Monday, August 25, 2014

వినాయక చవితి - విఘ్నేశ్వరుడి ఆవిర్భావం - అగ్రపూజ్యుడు -- అదిదేముడు


అగ్రపూజ్యుడు - ఆదిదేముడు 
తొండము నేకదంతము తోరపు బొజ్జయు వామహస్తమున్ 
మెండుగ మ్రోయుగజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్ 
కొండొక గుజ్జురూపము కోరిన విద్యలకెల్ల నొజ్జయై 
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్  
ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్ధి రోజు మనం వినాయకచవితి పండుగని జరుపుకుంటాము.  ఈ భాద్రపద శుద్ధ చతుర్ధి రోజు గజాననునికి విఘ్నాదిపత్యంబొసంగబడియెను.  అందువలన ఈ స్వామి శుభాశిస్సులకై  ప్రతి సంవత్సరం ఈ  రోజున మనం ఈ  పండగ జరుపుకొంటాము. గణపతిని పూజించకుండా ఎలాంటి శుభ కార్యము తలపెట్టము. మంగళకరమైన కార్యాలలో వాటిల్లే విఘ్నాలను తొలగించేవాడు కనుక ఈయన విఘ్నేశ్వరుడుగా ఆరాధింపబడుతున్నాడు.  ఆయన కృపాకటాక్షాలతో సకల కార్యాలు  నిర్విఘ్నముగా నెరవేరుతాయి విఘ్ననిర్మూలనముకై అవతరించి మంగళ స్వరూపుడై సకల మానవాళికి ఆరాధ్య మూర్తియై నిలిచాడు. 
 
వినాయకచతుర్థి రోజు అందరు ప్రాఃతక్కాలమునే నిద్రమేల్కాంచి అభ్యంగన స్నానమాచరించి పట్టువస్త్రాలను ధరించి, పూజా సామాగ్రినంతా సిద్ధం చేసుకొని, మండపాన్ని ఏర్పరచి మట్టి వినాయకుడి విగ్రహాన్ని ఆవాహన చేసి, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, స్వామికి  ఇష్టమైన కుడుములు, అపూపములు, టెంకాయలు, పాలు, తేనే, అరటిపండ్లు, పాయసం, పానకం, వడపప్పు మొదలైన నైవేద్యాలు సమర్పించి, వ్రతకధను చదువుకొని, కధాక్షతలని శిరస్సున ధరించి, భ్రాహ్మణులను సత్కరించి, ఆనందంతో అందరు కలసి ప్రసాదాలని స్వీకరించి, గణేశ భజనలతో, కీర్తనలతో, పురాణశ్రవణంతో ఆయన మీదే మనసులగ్నం చేసి, ఎంతో భక్తిశ్రదలతో ఈ పండగను మనం జరుపుకుంటాము.  ఇది మనందరికి ఎంతో ఇష్టమైన పండుగ.

అసలు ఈ గణపతి ఎవరు - ఈ  గణాధిపత్యం అంటే ఏమిటి తెలుసుకొందాము 
ఓం గణానాం త్వా గణపతిగ్o  హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమమ్!
జ్యేష్టరాజం బ్రహ్మణాo  బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్ !
మహాగణపతియే  నమః ।। ఓం ॥ 
గణపతి సర్వవిద్యాధి దేవతగా, వేదకాలమునుండి ఆరాధింపబడుతున్న అతి ప్రాచీన దేవత , వేదములలో స్తుతించబడి, గణములకు అధిపతియై, శబ్దములకు రాజుగా, ప్రణవ స్వరూపుడై  శబ్దబ్రహ్మగా తెలియబడుచున్నాడు.  "గ" శబ్దం బుద్దికి "ణ " శబ్దం జ్ఞానానికి ప్రతీక. 
సమస్త మంత్రములలోను శక్తికి కారణములైన బీజాక్షరములన్నింటిలోకి ముందుగా ఉచ్చరించబడేదే  "ఓంకారము  " అందుచేత ఈ గణపతిని ఓంకార స్వరూపుడిగా "గణపత్యధర్వ శీర్షము " లో వర్ణించారు.  గణములు అనగా అక్షరములతో ఏర్పడే ఛందస్సు  - గురువు, లఘువు, పూర్ణానుస్వార, అర్ధానుస్వార రూపమై శబ్దంగా వెలువడే మంత్రస్వరూపమైన శబ్దాలకి అధిపతే ఈ "గణపతి ".  అంతేకాకుండా "బ్రహ్మణస్పతి " అంటే వేదాలకి నాయకుడివి అని కీర్తించారు.
గణపతి విష్ణుస్వరూపుడు :
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే !
ఇక్కడ వినాయకుడు "విష్ణుం" అని పిలవబడినాడు. విష్ణువుగా చెప్పబదినాడు. విష్ణుం అంటే సర్వవ్యాపకుడు, స్థితి కారకుడు. అంతేకాకుండా క్షీర సాగర మధనానికి విఘ్నం కలిగిందని స్వయంగా శ్రీ మహావిష్ణువే దేవతలచే గణపతి పూజ చేయించాడు.  
సృష్టి ఆది లో దేవతా గణముల ప్రారంభం కంటే ముందే గణనాధుని తో సృష్టి ప్రారంభించినట్లు గణేశ పురాణం తదితర పురాణాలు మనకి సూచిస్తున్నాయి. సృష్టి ప్రారంభానికి ముందు ఒకప్పుడు అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేస్తున్నది.  ఇంకా మనుషులే పుట్టకముందుఅన్నమాట . అమ్మవారు పరమేశ్వరుణ్ణి తలచుకొన్నది . ఆయన అక్కడ ఉన్నారు. వారి చూపులు కలసినవి. ఆ చూపుల కలయకకి విఘ్నేశ్వరుడు పుట్టాడు. అంతటి పూర్వుడాయన. ఆయన పేరు మహాగణపతి. ఆ మహాగణపతి అవతారాలనే ఇప్పుడు మనం ప్రతి కల్పం లోనూ పూజిస్తున్నాం. 
గణేశుని (4) అవతారాలు
గణేష్ పురాణం ప్రకారం గణేషుడు (4) అవతారాలుగా ఆవిర్భవిస్తాడని అవి (4) యుగాలలో ఒకొక్క యుగానికి ఒకొక్క అవతారం గా చెప్పబడ్డాయి.
1. మహోత్కట వినాయక : -  ఈయన  కస్యపప్రజాపతి - అదితి ల కొడుకుగా కృత యుగంలో అవతరించారు. పది చేతులతో, ఎఱ్ఱని శరీర ఛాయతో సింహ వాహనుడై -- నరాంతక, దేవాంతక అనే రాక్షసులని సంహరించినట్లు చెప్పబడింది.
2. మయూరేశ్వర వినాయక :- ఈయన శివపార్వతుల కొడుకుగా త్రేతాయుగం లో అవతరించారు.  ఆరు చేతులతో, తెల్లని ఛాయతో, నెమలి వాహనంగా సిన్దురాసురుడు మొదలైన రాక్షస సంహారం కావించాడు.
3. గజానన వినాయక :- ఈయన శివపార్వతుల కొడుకుగా ద్వాపరయుగం లో అవతరించారు. ప్రస్తుత మన విఘ్న వినాయకుడు ఈయనే.  ఎర్రని శరీర చాయతో, నాలుగు బాహువులతో, మూషిక వాహనముతో. కుడివైపు రెండు చేతులలో  ఏక దంతమును,  అంకుశమును ధరించి,  ఎడమ వైపు రెండుచేతులతో పాశమును,
 మోదకమును ధరించి గజవదనంతో, తొండము కుడివైపు వంపుతిరిగి ఉండును. 
4.ధూమ్రకేతు వినాయకుడు :- ఈయన బూడిద రంగులో, నాలుగుచేతులతో, నీలంరంగు గుర్రం వాహనంగా, కలియుగాంతంలో, విష్ణుమూర్తి, కల్కి అవతారంలో అవతరించినప్పుడు, ధూమ్రకేతు వినాయకుడు కూడా అవతరిస్తాడు.
మూలాధార స్థితుడు గణపతి --- "త్వం మూలాధార స్తితోసి " అని శ్రుతి చెప్పే రహస్యం :-
కల్పాదిలో విష్ణు నాభి కమలంనుంచి ఉద్భవించిన బ్రహ్మగారికి, విష్ణుమూర్తి సృష్టి భాద్యతను అప్పచెప్పారు.  కాని ఎలా చెయ్యాలో చెప్పకుండా యోగనిద్రలోకి వెళ్ళిపోయారు.  బ్రహ్మ ఏం చెయ్యాలో తెలియక చాల సంవత్సరాలు తపస్సు చేసి విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకొని సృష్టి ప్రారంభించారు. ప్రారంభంలో జీవకోటిని, ముఖ్యంగా మానవుల్ని సృజించటం లో కొంత తికమక పడటం జరిగింది, అప్పుడు మళ్ళా విష్ణుమూర్తిని ప్రార్ధించగా, ఆయన మహాగణపతిని ప్రార్ధించమని చెప్పారు. బ్రహ్మ, మహాగణపతిని ప్రార్ధించగా ఆయన ప్రత్యక్షమై " మూలాధరమనే చక్రాన్ని సృష్టించు, అక్కడనుండి సహస్రార కమలందాక నిర్మాణం చెయ్యి.  ఆ మూలాధారచక్రంలో నేను అధిస్టానదైవం గా ఉండి నీవు సృష్టించే జీవులకు దేహాత్మ భావనను కలుగచేస్తాను అని చెప్పారు.

శరీరంలోని షట్చక్రములలో అన్నిటికన్నా అడుగున ఉండే చక్రము "మూలాధార చక్రం".  ఈ మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు.దీనిలో ఇంకో రహస్యం  కూడా ఉంది. "మహాశక్తి " అయిన పార్వతీదేవికి "ద్వారపాలకుడుగా "గణపతిని పెట్టినట్టు మనపురాణగాధ, దీనిలో అంతరార్ధం ఏమిటంటే -- మూలాధారంలో కుండలినీశక్తి యోగనిద్రలో నిద్రిస్తూ ఉంటుంది అని, ఈ కుండలిని శక్తి యే  మహాశక్తి  -- అ మూలాధారంలో కుండలిని శక్తిని మేల్కొలపడానికి  ప్రవేసించే ద్వారంవద్దనే గణపతి కావలిగా ఉన్నాడు.  అనగా గణపతి భీజాక్షరంతో మూలాధారాన్ని చైతన్యవంతం చేస్తే  శక్తిని మేల్కొలుపుట సాధ్యపడుతుంది.  మూలాధారంలో మేల్కొన్న కుండలినిశక్తి "ఇడ " "పింగళ " నాడులద్వార షట్చక్రములను భేదించి సహస్రారం చేరుతుంది. యోగికి "సిద్ధి" "బుద్ధి" కలుగుతుంది.  ఈ బుద్ది, సిద్ది -- ఇడా, పింగళ అనే జంటలే సుషుమ్నా నాడిలో నివసించు గణపతికి భార్యలు అని చెప్పబడినాయి.  

గణేశ ద్వాత్రింశ త్ రూపములు :- మంత్రం శాస్త్రంలో (32) గణపతుల రూపాలు చెప్పబడినాయి.   32 ఎందుకంటే చంద్రకళలు శుక్లపక్షంలో (16) బహుళ పక్షంలో (16) రెండుకలిస్తే (32)  ఇది జ్యోతిష మంత్రశాస్త్ర సంకేతమ్. అంతేకాకుండా ముక్కోటిదేవతలకు మూలమైన 32 దేవతాగణములకు ప్రతీకగా (32) రూపాలు ధరించాడు అనికూడా చెపుతారు.  వాటిలో షోడశ గణపతులు ఎంతో ప్రసిద్దమైనవిగా పురాణాలు చెపుతున్నాయి .
1. బ్రహ్మగణపతి  2. విఘ్నగణపతి 3. హేరంభ గణపతి 4. లక్ష్మీ గణపతి 5.శ్రీ  మహా గణపతి  6. తాండవ గణపతి     7. డుండీ గణపతి 8. ద్విముఖ గణపతి 9. త్రిముఖ గణపతి  10. యోగ గణపతి 11. వల్లభ గణపతి  12. హరిద్రా గణపతి  13. ఉచ్చిష్ట గణపతి  14. వీర గణపతి  15. విజయ గణపతి  16. సిద్ధ గణపతి

గణేశ్ చతుర్ధి ప్రాముఖ్యత :- భాద్రపదమాసం సూర్యుడు సింహరాశి చివరలో ఉండగా వస్తుంది.  శుక్లపక్ష చవితినాడు చంద్రుడు కన్యారాశిలో హస్తానక్షత్రంమీద ఉదయిస్తాడు. హస్తానక్షత్రం చేతివేళ్ళవలే హస్తాకారం లో ఉంటుంది . భాద్రపద శుద్ధ చవితిరోజు చంద్రుడు,  శిరస్సున హస్తానక్షత్రంతో కనిపిస్తాడు. హస్తముఖము - హస్తిముఖుడుగా - అంతేకాకుండా హస్తానక్షత్రం కన్యారాశియందున్నది - కన్య వివాహముకానిది - గణపతి కూడా బ్రహ్మచారిగా వర్నించబడినాడు.  కన్యారాశికి అధిపతి బుధుడు అతని రంగు మరకతము (పచ్చ) కన్యారాశి రంగు గరిక రంగు - అందుకే గణపతికి ప్రియమైనది దూర్వాంకురము ఇంకా  పచ్చని పత్రి.  కన్యారాశి రాసులలో (6) వది,  ఆరవస్థానం శత్రువులకు,అపనిందలకు, రోగములకు, బాధలకు, విఘ్నములకు, జ్యోతిషం ప్రకారం మూలస్తానం, కాబట్టి ఈ స్థానంలో గణపతిని ఏర్పాటుచేసి ఆయనను పూజించితే ఏడాది పొడుగునా విఘ్నాలు, విపత్తులు రావని పెద్దలు ఈ రోజున ఏర్పాటు చేసారు  

గణపతి యొక్క రూపంలో అంతరార్ధం : -  గణపతి రూపం ఎందుకలా ఉంది - కుండలాంటి బొజ్జ - వంకరగా ఉన్న తొండం - నుదిటిమీద అర్థ చంద్రుడు - నుదుట మధ్య ఫాలనేత్రం --  సిద్ధిని, బుద్దిని,జ్ఞానం, శక్తిని ఇచ్చే వరదుడికి ఈ వంకరరూపేమిటి అనిపిస్తుంది.
గూడార్ధం ఏమిటంటే గణపతి మనలాగా పదార్ధమయ శరీరం కలవాడని భావించరాదు.  దేవతలు "శబ్దమయ శరీరులు - వారి ఆకారం శబ్దతరంగాలు (బీజాక్షరాలు ). ఒకొక్క అక్షరమునకు ఒకొక్క స్పందన ఉంటుంది  ఇది ఫిజిక్స్ కూడా ఒప్పుకొంటుంది. శబ్దతరంగాలస్పందన మారితే కాంతియొక్క రంగులు మారుతాయి. అందుకే వర్ణము అంటే సంస్కృతంలో అక్షరము - రంగు అని రెండు అర్ధాలు ఉన్నాయి. ఇలా 32 దేవతలకు అంటే 32 స్పందనలకి వర్ణములు చెప్పబడినాయి.  ఒకొక్క శబ్దము జపిస్తే ఒకొక్క ఫలితము సిద్దిస్తుంది.  ఇలాంటి అక్షర స్వరూపములకు (ఛందోగణములకు) అధిపతియే గణపతి.  శబ్దతరంగాలకి ప్రధానమైన స్పందన "ప్రణవం" "ఓం " కారము ఈ గణపతి యొక్క "శబ్దస్వరూపము".  ఈ  ఓం అనే అక్షరాన్ని సంస్కృతంలో ॐ   అని రాయబడుతుంది.  ఇదే గజాననుడి ఆకారం.  దీనిలో గుడ్రంగావుండే కిందిభాగం లంబోదరం(పొట్ట) -  కుడివైపు తిరిగివుండే కొమ్ము వక్రతుండం - దానిపైనున్న అర్ధసున్నా చంద్రవంక  - పైనున్న బిందువు ఫాలనేత్రం -  ఈ  విధంగా గణపతిని ప్రణవ స్వరూపుడుగా వేదాలు చెపుతున్నాయి.

వేదనాయకుడైన మన గణనాదునికి వేదాలలో చెప్పిన చతుర్ షష్టి   ఉపచారాలతో అంటే (64) ఉపచారాలతో పూజచేద్దాం 1.. ద్యానం 2. ఆవాహనం 3. ప్రభోధనం 4. మణి మందిరం 5. రత్న మండపం 6. దంత ధావనం 7. సిబికాం 8. రత్న సింహాసనం 9. వితానం 10. పాద్యం 11. అర్ఘ్యం 12 ఆచమనీయం 13 మధుపర్కం 14. అభ్యంగనమ్ 15. ఉద్వర్తనం 16. పంచామృతం 17. ఫలోదకం 18. శుద్దోదకం 19. సమ్మార్జనమ్ 20. వస్త్రం 21 పాదుకాo  22 ఆభరణం 23 కిరీటం 24 కుండలం 25 కవచం 26 యజ్ఞోపవీతం  27 శ్రీ గంధం 28 అక్షతం  29 హరిద్రాచూర్నమ్ 30 కుంకుమ 31  పరిమళ ద్రవ్యం 32 సింధూరం 33. పుష్పాణి  34. దూర్వాదళం 35. ధూపం 36. దీపం 37. కుంభ నీరాజనం 38. నైవేద్యం 39. హస్త ప్రక్షాళనం  40 కరో ద్వర్థనమ్  41. పానీయం 42. ఫలసమర్పణం  43 తాంబూలం 44. దక్షిణ  45 ఛత్రం 46 చామరం 47. దర్పణం 48. మంగళ నీరాజనం 49.  మంత్రపుష్పం  50. ప్రదక్షిణం  51 నమస్కారం 52 తురంగవాహనమ్ 53. మదగజం  54. రధం 55. సైన్యం 56. దుర్గం 57. మూషిక వాహనం 58 ఆయుధం 59. వ్యజవీజనం (వింజామర) 60. నృత్యం 61. వాద్యాని 62. గీత శ్రవణం 63. అబినయం 64. క్షమా ప్రార్ధన
ఈ 64 ఉపచారాలు ప్రధానమైనవిగా శాస్త్రాలలో చెప్పబడ్డాయి. అత్యంత విశిష్ట మైన ఈ ఉపచారాలతో శ్రీ మహాగణపతిని అర్చించి ఆ స్వామి దివ్యానుగ్రహాన్ని అందరం పొందుదాం.
తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ! తన్నో దంతిః ప్రచోదయాత్ !
స్వస్తి
చాగంటి రాజేశ్వరి

విఘ్నేశ్వరుడి పూజలో పత్రి యెక్క ప్రాముఖ్యత

            


శుక్లాం బరధరం  విష్ణుం శశివర్ణం చతుర్భుజం !
అనేక దంతం భక్తానాం ఏకదంతంముపాస్మహే !

సమస్త విఘ్నాల్ని తొలగించి మనొభీష్టాల్ని నెరవేర్చేఆది దేవుడు శ్రీమహాగణపతి.  సకల గణాలకు నాయకుడుగా సమస్త ప్రాణికోటిచేతా పూజలందుకొంటున్న దైవం శ్రీ గణపతి. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ద చతుర్ధి(చవితి)  రోజు మనం వినాయకవ్రతం చేసుకొంటాం. ఈ వినాయకవ్రతం లో చాల ప్రాముఖ్యమైనది, వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్ర మైనది ఏకవింశతి పత్ర  పూజ (అంటే 21 రకాలైన ఆకులతో చేసే పూజ). 

శ్రావణ, భాద్రపద మాసాల్లో వర్షఋతువు వల్ల చెట్లన్నీ పచ్చగా ఉంటాయి. ఈ సమయంలో వచ్చే వినాయకచవితి రోజు వినాయకుడికి (21) రకాల పత్రితో ప్రత్యేకంగా పూజా విధానం రూపొందించారు మన పూర్వీకులు . దీనిలో పరమార్ధం 1) ప్రకృతి సంపదను మొదట పరమేశ్వరునికి సమర్పించటం.  2) వర్షఋతువులో నీటి మార్పు, వాతావరణం మార్పు వల్ల వచ్చే అనారోగ్యాల  నివారణకు ఆయుర్వేదం లో ప్రత్యేకతను సంతరించుకొన్న ఈ (21) పత్రులను ఈ తొమ్మిది రోజులు (గణేష్ నవరాత్రులు) పూజించటం వల్ల  వాటిమీదుగా వచ్చే గాలులను పీల్చటం వల్ల ఈ కాలం లో వచ్చే అనారోగ్యాలని ఎదుర్కోగల శక్తి వస్తుంది అనే భావంతో ఈ పత్రితో పూజించే విధానం మన పెద్దలు ఏర్పరచారు. 

ఇక ఈ పత్రి యొక్క ప్రాముఖ్యతని తెలుసుకొందాం :
1. మాచీ పత్రం  : (మాచిపత్రం) : ఇది అన్ని ప్రాంతాలలోను లభిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఇది నులిపురుగులను, కుష్టు, బొల్లి, దప్పికను పోగొడుతుంది. ఈ  ఆకులు కళ్ళ పై  పెట్టుకొంటే నేత్రదోషాలు పోతాయి. శిరస్సు పై పెట్టుకొంటే తలనెప్పి తగ్గుతుంది. 

2. బృహతి పత్రం   : (నేల మునగాకు) : ఇందులో తెలుపు, నీలి రంగుపూలు పూసే రెండు రకాలు ఉంటాయి. ఇది కఫాన్ని,   వాతాన్ని తగ్గిస్తుంది.  జ్వరం, మలబద్ధకం, మూలవ్యాది, దగ్గులను తగ్గిస్తుంది. 

3. బిల్వ పత్రం  :  (మారేడు ఆకు ) : దీని గాలి సోకితే శరీరం లో బాహ్య, అంతర పదార్ధాలు చెడిపోకుండా ఉంటాయి .  ఈ ఆకులు వలన  గాలిసోకని గర్భాలయాలలో దుర్వాసనలు  పుట్టకుండా ఉంటాయి.

4. దూర్వారయుగ్మం : (గరిక ) : ఇది శీతవీర్యన్ని వృద్ది చేస్తుంది, రక్తపిత్తాన్ని శమింప చేస్తుంది.  ముక్కు వెంట కారే రక్తానికి పనిచేస్తుంది. 

5. దుత్తూర పత్రం : ( ఉమ్మెత్త ఆకు ) : దీని ఆకులు, కొమ్మలు , కాయలు, గింజలు, వేళ్ళు అన్నీ ఔషధ లక్షణాలు కలిగినవే.  ఉమ్మెత్త రసం మర్దన చేస్తే ఊడిపోయిన వెంట్రుకలు (బట్టతల ) తిరిగి మొలిచే అవకాశం ఉంది. దీన్ని  ఎక్కువగా మానసిక రోగులకి ఉపయోగిస్తారు

6. బదరీ పత్రం  : (రేగు ఆకు) : ఇది శ్లేష్మం పుట్టిస్తుంది. ఎముకలకి బలం చెకూరుస్తుంది. ఎక్కువగా బాల రోగాలను నయం చేస్తుంది.  

7. అపామార్గ పత్రం : ( ఉత్తరేణి ఆకు) : ఇది చర్మ రోగాలకి పనికి వస్తుంది. 

8. తులసి పత్రం ఈ ఆకు శ్లేష్మాన్ని హరిస్తుంది. క్రిములను నాశనం చేస్తుంది. దగ్గును తగ్గిస్తుంది.  వాంతులను  అరికడుతుంది.  తులసి గాలి ఉల్లాసాన్నిస్తుంది.

9. చూత పత్రం   :  (మామిడి ఆకు)  :  దీని లేత ఆకులు నూరి పెరుగుతో తింటే అతిసార వ్యాధి తగ్గుతుంది.  ఒరిసిన పాదాలకు, పుండ్లకు  మామిడి జీడి రసం లో పసుపు కలిపి రాస్తే మానిపోతుంది.    చెట్టు జిగురుతో ఉప్పు కలిపి వెచ్చ చేసి కాళ్ళ పగుళ్ళకు రాస్తే చాల బాగా పనిచేస్తుంది. 

10. కరవీర పత్రం  :  (గన్నేరు ఆకు) : ఈ  ఆకులు జ్వరం పోగొట్టి నేత్రాలకు చలువ చేస్తాయి, దురదలను పోగొడతాయి.  దీని పప్పు తింటే మరణం సంభవిస్తుంది.  

11. విష్ణుక్రాంత పత్రందీని ఆకులు కోలగా ఉంటాయి. గింజలు మిరియాలలా ఉంటాయి . కఫం, వాతాలను, క్రిములను, వ్రణాలను హరిస్తుంది.  

12. దాడిమి పత్రం :  ( దానిమ్మ ఆకు) : ఇది వాతాన్ని, కఫాన్ని, పిత్తాన్నిహరిస్తుంది.  హృదయానికి బలాన్ని ఇస్తుంది.

13. దేవదారు పత్రం ఈ వృక్షం లోని అన్ని అంగాలు సువాసన కలిగి ఉంటాయి.  దీని తైలం వాపులను హరిస్తుంది.  ఎక్కిళ్ళు తగ్గిస్తుంది, చర్మ రోగాలను తగ్గిస్తుంది.  

14. మరువక పత్రం : (మరువం)  : ఇది సువాసన నిస్తుంది.  శ్వాస రోగాలను తగ్గిస్తుంది. దీనిని పసుపుతో కలిపి నూరి రాస్తే గజ్జి, చిడుము లాంటి చర్మవ్యాధులు తగ్గుతాయి.  

15. సింధూర పత్రం : (వావిలాకు)  : దీని ఆకులతో పురిటి స్నానం చేయిస్తే బాలింతలకు వాతం చేయదు  ఈ ఆకుల కషాయం కడుపు నెప్పులను, క్రిములను తగ్గిస్తుంది.  నుదుటికి పట్టిలా వేస్తె తలపోటు తగ్గుతుంది.  

16.  జాజి పత్రం  : (జాజి ఆకు)  : దీనికి వేడి చేసే స్వభావం ఉంది . దీని లేత ఆకులు తరుచుగా తింటే శరీరానికి మంచి కాంతిని, తేజస్సు ను ఇస్తుంది.  ఆకలిని పెంచుతుంది.  కంటస్వరాన్ని బాగుచేస్తుంది. నోటి దుర్వాసన, దగ్గు పోగొడుతుంది.  

17. గండకీ పత్రం : (అడవి మొల్ల) : దీని రసం అపస్మారక స్థితిని, పైత్య వికారాలనిమూర్చలని తగ్గిస్తుంది.  

18. శమీ పత్రం  : ( జమ్మి ఆకు)  :  ఇది మూల వ్యాధిని హరిస్తుంది.  అతిసారం, రక్తస్రావాలను తగ్గిస్తుంది.  దీని రసం వెంట్రుకలను నల్లపరుస్తుంది.  ఆకు రసాన్ని పిప్పిపన్నులో పెడితే నొప్పి తగ్గి పన్ను ఊడిపోతుంది. దీని పుల్లతో పళ్ళను శుభ్రం చేయరాదు. 

19. అశ్వత్థ  పత్రం :  ( రావి ఆకు)  :  దీని గాలి చాలా శ్రేష్టమైనది, గర్భస్థ దోషాలని హరిస్తుంది.    చెట్టు క్రింద కూర్చుని చదువుకొంటే జ్ఞానవృద్ది అవుతుంది. 

20.  అర్జున పత్రం : ( మద్ది ఆకు) :  ఇది వాత, కఫ రోగాలని పోగొడుతుంది.  వ్రణాలను మాన్పుతుంది. 

21.  అర్క పత్రం  : ( జిల్లేడు ఆకు )  :  ఇది శరీరాన్ని కాంతివంతం చేస్తుంది.  ఆకులను తలపై ఉంచుకొని స్నానం చేస్తే జలుబు తగ్గుతుంది.  శిరస్సుకు సంబంధిచిన వ్యాధులు పోతాయి.  జిల్లేడు పాలను పసుపుతో కలిపి ముఖానికి రాస్తే ముఖం నలుపు తగ్గుతుంది.

 పత్రి గురించి తెలుసు కొన్నారు కాబట్టి, ఈ సంవత్సరం వినాయక చవితికి సాద్యమైనన్ని ఆకులు మీ చుట్టుపక్కల ఉన్నవి ఎంచుకొని తెచుకొని పూజ చేసుకోండి. చాలా వరకు మన చుట్టుపక్కల దొరికేవే, కాబట్టి కొంచెం శ్రద్ధ పెట్టండి. కొండంత దేముడికి కొండంత పత్రి కాదు కోరిన పత్రి తో పూజించండి.    బయట అమ్మే పత్రిలో ఏమున్నాయో తెలుసుకోకుండా ఆకులు దేముడి మీద వేయటమే చాలు అనుకోకండి.  

చాగంటి రాజేశ్వరి