Monday, August 25, 2014

విఘ్నేశ్వరుడి పూజలో పత్రి యెక్క ప్రాముఖ్యత

            


శుక్లాం బరధరం  విష్ణుం శశివర్ణం చతుర్భుజం !
అనేక దంతం భక్తానాం ఏకదంతంముపాస్మహే !

సమస్త విఘ్నాల్ని తొలగించి మనొభీష్టాల్ని నెరవేర్చేఆది దేవుడు శ్రీమహాగణపతి.  సకల గణాలకు నాయకుడుగా సమస్త ప్రాణికోటిచేతా పూజలందుకొంటున్న దైవం శ్రీ గణపతి. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ద చతుర్ధి(చవితి)  రోజు మనం వినాయకవ్రతం చేసుకొంటాం. ఈ వినాయకవ్రతం లో చాల ప్రాముఖ్యమైనది, వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్ర మైనది ఏకవింశతి పత్ర  పూజ (అంటే 21 రకాలైన ఆకులతో చేసే పూజ). 

శ్రావణ, భాద్రపద మాసాల్లో వర్షఋతువు వల్ల చెట్లన్నీ పచ్చగా ఉంటాయి. ఈ సమయంలో వచ్చే వినాయకచవితి రోజు వినాయకుడికి (21) రకాల పత్రితో ప్రత్యేకంగా పూజా విధానం రూపొందించారు మన పూర్వీకులు . దీనిలో పరమార్ధం 1) ప్రకృతి సంపదను మొదట పరమేశ్వరునికి సమర్పించటం.  2) వర్షఋతువులో నీటి మార్పు, వాతావరణం మార్పు వల్ల వచ్చే అనారోగ్యాల  నివారణకు ఆయుర్వేదం లో ప్రత్యేకతను సంతరించుకొన్న ఈ (21) పత్రులను ఈ తొమ్మిది రోజులు (గణేష్ నవరాత్రులు) పూజించటం వల్ల  వాటిమీదుగా వచ్చే గాలులను పీల్చటం వల్ల ఈ కాలం లో వచ్చే అనారోగ్యాలని ఎదుర్కోగల శక్తి వస్తుంది అనే భావంతో ఈ పత్రితో పూజించే విధానం మన పెద్దలు ఏర్పరచారు. 

ఇక ఈ పత్రి యొక్క ప్రాముఖ్యతని తెలుసుకొందాం :
1. మాచీ పత్రం  : (మాచిపత్రం) : ఇది అన్ని ప్రాంతాలలోను లభిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఇది నులిపురుగులను, కుష్టు, బొల్లి, దప్పికను పోగొడుతుంది. ఈ  ఆకులు కళ్ళ పై  పెట్టుకొంటే నేత్రదోషాలు పోతాయి. శిరస్సు పై పెట్టుకొంటే తలనెప్పి తగ్గుతుంది. 

2. బృహతి పత్రం   : (నేల మునగాకు) : ఇందులో తెలుపు, నీలి రంగుపూలు పూసే రెండు రకాలు ఉంటాయి. ఇది కఫాన్ని,   వాతాన్ని తగ్గిస్తుంది.  జ్వరం, మలబద్ధకం, మూలవ్యాది, దగ్గులను తగ్గిస్తుంది. 

3. బిల్వ పత్రం  :  (మారేడు ఆకు ) : దీని గాలి సోకితే శరీరం లో బాహ్య, అంతర పదార్ధాలు చెడిపోకుండా ఉంటాయి .  ఈ ఆకులు వలన  గాలిసోకని గర్భాలయాలలో దుర్వాసనలు  పుట్టకుండా ఉంటాయి.

4. దూర్వారయుగ్మం : (గరిక ) : ఇది శీతవీర్యన్ని వృద్ది చేస్తుంది, రక్తపిత్తాన్ని శమింప చేస్తుంది.  ముక్కు వెంట కారే రక్తానికి పనిచేస్తుంది. 

5. దుత్తూర పత్రం : ( ఉమ్మెత్త ఆకు ) : దీని ఆకులు, కొమ్మలు , కాయలు, గింజలు, వేళ్ళు అన్నీ ఔషధ లక్షణాలు కలిగినవే.  ఉమ్మెత్త రసం మర్దన చేస్తే ఊడిపోయిన వెంట్రుకలు (బట్టతల ) తిరిగి మొలిచే అవకాశం ఉంది. దీన్ని  ఎక్కువగా మానసిక రోగులకి ఉపయోగిస్తారు

6. బదరీ పత్రం  : (రేగు ఆకు) : ఇది శ్లేష్మం పుట్టిస్తుంది. ఎముకలకి బలం చెకూరుస్తుంది. ఎక్కువగా బాల రోగాలను నయం చేస్తుంది.  

7. అపామార్గ పత్రం : ( ఉత్తరేణి ఆకు) : ఇది చర్మ రోగాలకి పనికి వస్తుంది. 

8. తులసి పత్రం ఈ ఆకు శ్లేష్మాన్ని హరిస్తుంది. క్రిములను నాశనం చేస్తుంది. దగ్గును తగ్గిస్తుంది.  వాంతులను  అరికడుతుంది.  తులసి గాలి ఉల్లాసాన్నిస్తుంది.

9. చూత పత్రం   :  (మామిడి ఆకు)  :  దీని లేత ఆకులు నూరి పెరుగుతో తింటే అతిసార వ్యాధి తగ్గుతుంది.  ఒరిసిన పాదాలకు, పుండ్లకు  మామిడి జీడి రసం లో పసుపు కలిపి రాస్తే మానిపోతుంది.    చెట్టు జిగురుతో ఉప్పు కలిపి వెచ్చ చేసి కాళ్ళ పగుళ్ళకు రాస్తే చాల బాగా పనిచేస్తుంది. 

10. కరవీర పత్రం  :  (గన్నేరు ఆకు) : ఈ  ఆకులు జ్వరం పోగొట్టి నేత్రాలకు చలువ చేస్తాయి, దురదలను పోగొడతాయి.  దీని పప్పు తింటే మరణం సంభవిస్తుంది.  

11. విష్ణుక్రాంత పత్రందీని ఆకులు కోలగా ఉంటాయి. గింజలు మిరియాలలా ఉంటాయి . కఫం, వాతాలను, క్రిములను, వ్రణాలను హరిస్తుంది.  

12. దాడిమి పత్రం :  ( దానిమ్మ ఆకు) : ఇది వాతాన్ని, కఫాన్ని, పిత్తాన్నిహరిస్తుంది.  హృదయానికి బలాన్ని ఇస్తుంది.

13. దేవదారు పత్రం ఈ వృక్షం లోని అన్ని అంగాలు సువాసన కలిగి ఉంటాయి.  దీని తైలం వాపులను హరిస్తుంది.  ఎక్కిళ్ళు తగ్గిస్తుంది, చర్మ రోగాలను తగ్గిస్తుంది.  

14. మరువక పత్రం : (మరువం)  : ఇది సువాసన నిస్తుంది.  శ్వాస రోగాలను తగ్గిస్తుంది. దీనిని పసుపుతో కలిపి నూరి రాస్తే గజ్జి, చిడుము లాంటి చర్మవ్యాధులు తగ్గుతాయి.  

15. సింధూర పత్రం : (వావిలాకు)  : దీని ఆకులతో పురిటి స్నానం చేయిస్తే బాలింతలకు వాతం చేయదు  ఈ ఆకుల కషాయం కడుపు నెప్పులను, క్రిములను తగ్గిస్తుంది.  నుదుటికి పట్టిలా వేస్తె తలపోటు తగ్గుతుంది.  

16.  జాజి పత్రం  : (జాజి ఆకు)  : దీనికి వేడి చేసే స్వభావం ఉంది . దీని లేత ఆకులు తరుచుగా తింటే శరీరానికి మంచి కాంతిని, తేజస్సు ను ఇస్తుంది.  ఆకలిని పెంచుతుంది.  కంటస్వరాన్ని బాగుచేస్తుంది. నోటి దుర్వాసన, దగ్గు పోగొడుతుంది.  

17. గండకీ పత్రం : (అడవి మొల్ల) : దీని రసం అపస్మారక స్థితిని, పైత్య వికారాలనిమూర్చలని తగ్గిస్తుంది.  

18. శమీ పత్రం  : ( జమ్మి ఆకు)  :  ఇది మూల వ్యాధిని హరిస్తుంది.  అతిసారం, రక్తస్రావాలను తగ్గిస్తుంది.  దీని రసం వెంట్రుకలను నల్లపరుస్తుంది.  ఆకు రసాన్ని పిప్పిపన్నులో పెడితే నొప్పి తగ్గి పన్ను ఊడిపోతుంది. దీని పుల్లతో పళ్ళను శుభ్రం చేయరాదు. 

19. అశ్వత్థ  పత్రం :  ( రావి ఆకు)  :  దీని గాలి చాలా శ్రేష్టమైనది, గర్భస్థ దోషాలని హరిస్తుంది.    చెట్టు క్రింద కూర్చుని చదువుకొంటే జ్ఞానవృద్ది అవుతుంది. 

20.  అర్జున పత్రం : ( మద్ది ఆకు) :  ఇది వాత, కఫ రోగాలని పోగొడుతుంది.  వ్రణాలను మాన్పుతుంది. 

21.  అర్క పత్రం  : ( జిల్లేడు ఆకు )  :  ఇది శరీరాన్ని కాంతివంతం చేస్తుంది.  ఆకులను తలపై ఉంచుకొని స్నానం చేస్తే జలుబు తగ్గుతుంది.  శిరస్సుకు సంబంధిచిన వ్యాధులు పోతాయి.  జిల్లేడు పాలను పసుపుతో కలిపి ముఖానికి రాస్తే ముఖం నలుపు తగ్గుతుంది.

 పత్రి గురించి తెలుసు కొన్నారు కాబట్టి, ఈ సంవత్సరం వినాయక చవితికి సాద్యమైనన్ని ఆకులు మీ చుట్టుపక్కల ఉన్నవి ఎంచుకొని తెచుకొని పూజ చేసుకోండి. చాలా వరకు మన చుట్టుపక్కల దొరికేవే, కాబట్టి కొంచెం శ్రద్ధ పెట్టండి. కొండంత దేముడికి కొండంత పత్రి కాదు కోరిన పత్రి తో పూజించండి.    బయట అమ్మే పత్రిలో ఏమున్నాయో తెలుసుకోకుండా ఆకులు దేముడి మీద వేయటమే చాలు అనుకోకండి.  

చాగంటి రాజేశ్వరి

No comments:

Post a Comment