యుగానికి ఆది -జగానికి పునాది
ఓజస్సు వీక్షకులందరికి నా హృ దయ పూర్వక నూతన తెలుగు జయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు . ఈ నూతన సంవత్సరం మన అందరికి జయాన్ని ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇవ్వాలని ఆ శ్రీరామచంద్రుడిని మనస్పూర్తిగా వేడుకొంటున్నాను .
ఉగాది అంటే వసంతకాలం -వసంతకాలం అంటే కోకిలమ్మ ఆగమనం
కొత్త చిగుళ్ళు తింటూ కొసరి పాడే కోకిలమ్మ అన్నా - అప్పుడే విచ్చుకుంటూ మనస్సులని చుట్టుకొనే మల్లెలన్న ఇష్టపడని వాళ్ళు ఎవరు
శుభమస్తు అనవమ్మ ప్రధమ పిక గాత్రమా
మురిపాల వన బాల ధరహాసమా
ఉగాది పండగ వస్తుంది అనగానే మన అందరికి మూడు విషయాలు గుర్తుకువస్తాయి .
1. ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మన గ్రహబలం ఎలా ఉందో? రాజపూజ్యం ఎంతో ? అవమానం ఎంతో? ఆదాయం ఎంతో? వ్యయం ఎంతో? ఇలా పంచాంగం విందాం అనుకొంటారు.
2. ఇంక మనకి ఎంతో ఇష్టమైన ఉగాది పచ్చడి - ఈ వసంత కాలం లో ప్రధమం గా వచ్చే ఆరు క్రొత్త రుచుల మేళవింపుతో మధురమయిన పచ్చడి ఆరగింపు.
3. వసంతనవరాత్రులు - వసంతమాసం అంటేనే మనోహరమైన కాలం. ప్రకృతి అంతా పరవశం నిండుకొని ఉంటుంది. ఎక్కడ చూసినా పచ్చదనం పరవశం. అందుకే అన్నమాచార్యులవారు ఇలా అన్నారు
వాడల వాడల వెంట వసంతమా, జాడతో చల్లేరు నీ ఫై జాజర జాజర జాజర..............
నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు. ఛైత్రశుద్ధ పాడ్యమి (ఉగాది) మొదలుకొని ఛైత్రశుద్ధనవమి (శ్రీరామనవమి) తొమ్మిది రోజులు వసంతనవరాత్రులు చాలా భక్తీ శ్రద్ధలతో మనం జరుపుకొంటాం .
ఉగాది పండగ వైశి ష్ట్యం
ముఖ్యంగా ఈ పండగకి ఒక విశేషం ఉంది. ఇది కాలాన్ని ఆరాధించే పండుగ. ఉగాది అంటే యుగ + ఆది = కాలానికి మొదలు. భగవంతుడు కాలస్వరూపుదు.
అహః మేవ క్షయం కాలః - అని శ్రీ కృష్ణుడు భగవత్ గీతలో చెప్పారు
కాలాయ నమః - శ్రీ విష్ణు సహస్ర నామం లో జపిస్తాం
ఇలా భగవంతుడు కాల స్వరూపుడుగా భావిస్తూ కాలాన్ని ఆరాధిస్తాం. మన భారతీయ సంస్కృతిలో అన్నిటిని ఆరాధించటం అందరిని రోజు పూజించటం మన పెద్దలు మనకి అలవాటు చేసారు, ఇది తల్లి రోజు, తంద్రి రోజు, గురువు రోజు, అడవుల రోజు ఇలా ప్రత్యేకమైన రోజులు లేవు.
ప్రతి రోజు ప్రాతః కాలం లో మాతృదేవో భవః - పితృదేవో భవః - ఆచార్యదేవో భవః అంటూ తల్లితండ్రులకు, గురుదేవులకు వందనాలు అర్పించటం, ప్రత్యక్ష దైవాలుగా సూర్య చంద్రులని తలుస్తూ , తులసి మాత ను, అశ్వర్ధ మొదలైన వ్రుక్షాలని పూజించటం అంటే ప్రకృతిని పూజించటం ---- ఇలా పెద్దలని, ప్రకృతిని ఈ సృష్టి లోని చరాచర జీవకోటిని ప్రతి నిత్యం ఆరాధించటం అందరి లో పరమాత్మను చూడడం - ఇది మన భారతీయ పరంపరానుగత జీవన శైలి. మన జీవనవిధానాన్ని అన్ని కట్టుబాట్లతో చక్కటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక నడవడితో సన్మార్గం వైపు నడిపించేదిగా మలచి మన కందించారు మన పెద్దలు .
ఉగాది పండుగ ప్రతి సంవత్సరం ఏ రోజు జరుపుకొంటామో తెలుసుకొందాం
ఉగాది - యుగ + ఆది లేదా సంవత్సరాది ఇలా పిలవబడే పండుగ భారతదేశం లో భారతీయ పంచాంగం ప్రకారం కొన్ని ప్రాంతాలలో ఒకసారి మరి కొన్ని ప్రాంతాలలో ఇంకో సారి ఆ ప్రాంతీయతకి సంభందించిన పేర్ల తో జరుపుకొంటూ ఉంటారు.
మన హిందూ పంచాంగం చాంద్ర, సౌర మానాల ప్రకారం రుపొందిచబడింది(lunisolar). దీని ప్రకారం మనకి (60) తెలుగు సంవత్సరాలు -ప్రభవ, విభవ మొదలయినవి ఉన్నాయి. (60) వ సంవత్సరం పూర్తి అయిన పిదప తిరిగి మొదటి సంవత్సరం ప్రవేశిస్తుంది. ఈ భ్రమణం లో ప్రస్తుత 'జయ ' నామ సంవత్సరం '28' వ సంవత్సరం. అలాగే (12) తెలుగు నెలలు ఉన్నాయి, మొదటిది 'చైత్రము'. తిధులు (15) అందులో మొదటిది 'పాడ్యమి ' . అయితే ప్రతి నెలను రెండు పక్షాలు గా విభజించి - శుక్ల (శుద్ధ ) పక్షము అంటే అమావాస్య తరవాత వచ్చే 15 రోజులు అంటే 'చంద్రుడు వృద్ధి చెందే రోజులు' - బహుళ (కృష్ణ) పక్షము అంటే పౌర్ణమి తరవాత వచ్చే 15 రోజులు అంటే 'చంద్రుడు క్షీణించే రోజులు' గా పేర్కొన్నారు.
తెలుగు, కన్నడ , మరాఠి లు చాంద్రమానం ప్రకారం ఉగాది జరుపు కొంటారు.
భారతదేశం లో వింధ్య పర్వతాలు మొదలు కొని కావేరి వరకు గల ప్రాంత ప్రజలు అంటే తెలుగు, కన్నడ, మరాఠి , గోవా ప్రజలు ఈ చంద్ర మానం ప్రకారం జరుపుకొంటారు .
అంటే మొదటి నెల అయిన 'చైత్రమాసం ' లో మొదటి తిధి అయిన 'శుద్ధ పాడ్యమి' రోజున ఉగాది జరుపుకొంటాము. ఈ సంవత్సరం 31-3-2014 నాడు తెలుగు ఉగాది.
తెలుగు ---- ఉగాది
కన్నడ ----- ఉగాది
మరాఠీ---- గుడి పడవ (Gudi Padwa)
తమిళలు తమ ఉగాదిని 'పుతండు ''putandu' గా సూర్యుడు మొదటి రాశి అయిన "మేషరాశి' లో కి ప్రవేశించిన రోజు జరుపుకొంటారు. Punjab
-- Baishakhi (harvest festival); Kerala - Visu; Bengal --Poilla
Baishakhi ఇలా వేరు వేరు ప్రాంతాలలో అక్కడి ప్రాంతియతతో చేసుకొంటారు .
ఆకాశం లోని నక్షత్రాల సముదాయాన్ని 'గెలాక్సీ' అంటారు . 'పాలపుంత' అనే గెలాక్సీ కి చెందిన నక్షిత్రమే సూర్యుడు. సూర్యుని చుట్టూ 9 గ్రహాలు తిరుగుతుంటాయి. నిజానికి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నా, మనకు సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది . సూర్యుడు తిరిగే ఈ మార్గమునే 'క్రాంతి వృత్తం' అంటారు . ఈ గమనానికి దగ్గరగా ఉండే భాగాన్ని 'రాశిచక్రం ' (జోడియాక్ ) అంటారు. ఈ 'రాశిచక్రం ' లోని నక్షత్రాల ని 12 రాసులుగా వాటికి 12 పీర్లు పెట్టారు . అందులో మొదటిది 'మేషం '.
తెలుగు ఉగాది
ఎక్కడ ఎలా జరిగినా మన తెలుగు ఉగాది మాత్రం మన అందరి హ్రుదయాలనలరించే
"చెక్కెర తేనెల ఊట మధురామృతాల తోట "
ఇక ఇది ఎప్పుడు మొదలయింది అంటే నిర్దుష్టం గా చెప్పలేము. కాని శాస్త్ర ప్రకారం "శ్రీకృష్ణ భగవానుని నిర్యాణం రోజున" మొదలు అని చెపుతారు. అలాగే బ్రహ్మ తొలిసారిగా సృష్టి చేసిన రోజు అని చెపుతారు . ఇది శాలివాహన శకారంబమ్ అని కూడా చెప్ప్పవచ్చు - గౌతమీపుత్ర శాతకర్ణి తన రాజ్యాన్ని స్తాపించిన రోజు గా - ఆ రోజు నుంచి నూతన శకారంభం శాతవాహన శకం/శాలివాహన శకం గా మనం పరిగణిస్తున్నాం. ఇంకా ప్రముఖ గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్య కూడా ఇదే రోజుని సూచించారు.
ఏది ఎలా అయినా చక్కటి ఆహ్హ్లాదకరమయిన వాతావరణంలో మన తెలుగు ఉగాది పండుగ మనం జరుపుకొంటాం.
అప్పుడే ప్రకృతిలో కొత్త కొత్త గా వచ్చే షడ్రుచులు కలయికతో ఆరోగ్యాన్నిచ్చే పచ్చడి, పచ్చడి అనే కంటే ఔషధమ్ అనడం సమంజసం. ఎందుకంటే శిశిర , వసంత, గ్రీష్మ, ఋతువులు ఆధానకాలం(transaction period) ఋతువులు మారినప్పుడల్లా శరీరం లో చాల మార్పులు వస్తాయి, ఆయా ఋతువుల్లో వచ్చే పళ్ళు, కాయలు, ధాన్యాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఆయుర్వేదం ప్రకారం జబ్బు లన్నీ వాత, పిత్త, కఫా లు గా పేర్కొంటారు. (Anabolism, Catabolism, Metabolism)
అంటే ఈ త్రిగుణాలు మన శరీరం లో సమతుల్యం లో (balance) ఉండాలంటే ఈ షడ్రుచులు కావాలి (మధుర, ఆమ్ల, కట, తిక్త రసాలు)
ఆరు ఋతువులు, ఆరు రుచులు, అరిషడ్వర్గాలు (అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య ) అన్నీ సమతుల్యం గా ఉంటేనే జీవనం చక్కగా సాగుతుంది అని ఈ పచ్చడి ఇచ్చే సందేశం
పచ్చడికి కావలసినవి, వాటి గుణాలు , చేయు విధానము
1. వేపపువ్వు -- గుప్పెడు --తిక్త --చేదు -- శరీరం లోని మలిన్యాలని దురం చేస్తుంది - షుగర్ తగ్గిస్తుంది
2. చింతపండు --నిమ్మకాయంత --కషాయ --పులుపు -- తగినమోతాడులో వాడితే మంచిది - ఎక్కువైతే ఎసిదిటి, వంట్లో నీరు పడుతుంది
3. బెల్లం /చెరకు -- తగినంత -- మధురం -- తీపి -- తృప్తి
4. మామిడి -- ఒక చిన్న కాయ -- ఆమ్ల -- వగరు/పులుపు --చర్మ సౌందర్యం పెంచుతుంది
5. మిరియాలు -- అర చెంచా పొడి --కటు --కారం -- కొవ్వు తగ్గిస్తుంది - చురుకుదనాన్ని యిస్తుంది
6.లవణం -- చిటికెడు -- సైoధవ -- ఉప్పు --రుచి - తృప్తి
చింతపండు రసం లో బెల్లము, వేపపువ్వు, చెక్కు తీసి సన్నగా తరిగిన మామిడి ముక్కలు, అర చెంచా మిరియాల పొడి, చిటికెడు ఉప్పు వేస్తె పచ్చడి తయారయి పోతుంది. మరింత రుచికి సన్నగా తరిగిన ఒక అరటిపండు, సన్నగా తరిగిన చూపుదు వేలంత చేరకుముక్క , చిన్న పచ్చి కొబ్బరి ముక్క సన్నగా తరిగి, నాలుగు ఏలకులు చితకొట్టి వేయండి -- ఇంకేముంది రుచులూరే ఉగాది పచ్చడి రెడి.
ఉగాది రోజు ఆచరించవలసిన విధులు
ముందు ప్రాతః కాలం లో లేవాలి, అంటే సూర్యోదయానికి ముందు, అది అపార్ట్ మెంట్ అయినా, వేరే దేశంలో ఉన్నా ముందు ఇల్లు శుభ్రం చేసుకోవాలి , వీలయితే రంగవల్లులు లేకపోతె చిన్న ముగ్గయినా వేసుకోవాలి, గడపకి పసుపు, కుంకుమ, గుమ్మలకి తోరణాలు కట్టాలి. చక్కగా తలారా స్నానం చేసి నూతన వస్త్రాలు కట్టుకొని దేముడి దగ్గర శుబ్రం చేసుకొని చక్కగా గణేషుడి కి, మీ ఇష్ట దైవానికి పూజ చేసుకోవాలి. ఉగాది పచ్చడి, వడపప్పు, పానకం, మీరు చేసిన పిండివంటలు నివేదన చెయ్యాలి .
ఇక్కడ ముఖ్యం గా చేయవలసింది -- మన హిందూ సంప్రదాయం ప్రకారం విధిగా ప్రతి ఒక్కరు నుదుట కుంకుమ ధారణ చెయ్యలి.
ఉగాది అంటే కాలానికి సంబంధించినది కాబట్టి - కాలం అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు తో కూడుకొన్నది కాబట్టి ఈ రోజు వినాయకుడి పూజ అయ్యాకా నవగ్రహ స్తోత్రం చేయటం మంచిది . అంతే కాకుండా ఇవి వసంత నవరాత్రులు కాబట్టి ఈ (9) రోజులు శ్రీరామచంద్రమూర్తిని పూజించటం నవమి రోజున స్వామి కల్యాణం లో పాలుపంచుకోవటం ఉత్తమం.
తరవాత మనకి అత్యంత ఆసక్తి కలిగించే పంచాంగ శ్రవణం చెయ్యాలి. పంచాంగం కొనుక్కునో, గుళ్ళో వినో, టీవీ లో వినో ఎవరి సందర్భాన్ని బట్టి వాళ్ళు తెలుసుకోవచ్చు. .
ఈ రోజు ఇంకో పసందయిన కార్యక్రమం "కవి సమ్మేళనం " ఇది కూడా వినగలిగితే నిజమయిన ఉగాది ఆనందాన్ని అనుభవించినట్లే.
వసంతనవరాత్రులు
సంవత్సరం లో (3) సార్లు నవరాత్రులు వస్తాయి.
1.వసంత నవరాత్రులు -- చైత్రశుద్ధ పాడ్యమి (ఉగాది రోజు మొదలు)
2. గణేశ్ నవరాత్రులు -- భాద్రపద శుద్ధ చవితి ( around సెప్టెంబర్)
3. శరద్ నవరాత్రులు (దేవీ నవరాత్రులు) -- ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి(around సెప్టెంబర్- అక్టోబర్)
ప్రస్తుతం వసంత నవరాత్రులు గురించి తెలుసుకుందాం-- చైత్రశుద్ధ పాడ్యమి (ఉగాది రోజు) మొదలు కొని చైత్రశుద్ధ నవమి (శ్రీరామనవమి రోజు వరకు ) అంటే శ్రీరాముడు పుట్టిన రోజు వరకు -- అదే రోజున శ్రీరామ కళ్యాణం జరుపుకొంటాం. ఈ తొమ్మిది రోజులు ఉత్సవాలు, ఊరేగింపులూ, అర్చనలు ఆంధ్రదేశం అంతటా జరుగుతాయి. మనం కూడా ఈ తొమ్మిది రోజులు శ్రీరాముడికి పూజ చెయ్యటం, లేదా రామచరితమానసమ్ చదవటం లేదా ఈ క్రింది శ్లోకం అయినా చదవండి చాలు .
ఆపదాపహర్తారమ్ ధాతారం సర్వ సంపదాం
లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం
అంతే కాకుండా దేవి భాగవతం ప్రకారం ఈ వసంత నవరాత్రుల కి ఇంకో విశిష్టత కూడా ఉంది, ఇవి శ్రీ శక్తి అనుగ్రహానికి మూలమైన రోజులుగా ఉత్తరభారతదేశం లో దేవి పూజలు చేస్తారు. దీనికి మూలమ్ ఇక్ష్వాకు వంశానికి చెందిన సుదర్సనుడు, శశికళ లను దేవి అనుగ్రహించి వారి రాజ్యాన్ని తిరిగి ఇప్పించటం వారికి నవరాత్రులు చెయ్యమని అదేశించటం. కాబట్టి రోజు లలితసహస్ర నామ పారాయణం కూడా ఈ తొమ్మిది రోజులు చెయ్యచ్చు
ఇవి ఉగాది విశేషాలు. త్వరలో మళ్లీ కలుద్దాం
మీ రాజేశ్వరి