అపారమైన జ్ఞాన విజ్ఞానములకు, సంస్కృతి సంప్రదాయాలకు ఆలవాలమైన దేశం మన భారత దేశం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు మూలాధారం ఋషులు, జీవరాశికి మూలపురుషులు ఋషులే . మనను నిత్యమూ నడిపిస్తూ, మనకు సంప్రదాయాన్ని ఇచ్చినవారు ఋషులు. ఈ ఋషులు భౌతికమైన ప్రపంచానికి తండ్రులు . బ్రహ్మ ముఖం నుండి వేదం పుట్టింది, కాని దానిని మనకు ప్రసాదించినది ఋషులే. ఋషి అంటే మంత్రద్రష్ట, త్రికాలజ్ఞాని, సద్గురువు, వేదవిజ్ఞాన ప్రచారకుడు, తపశ్శాలి , మానవాళికి మార్గదర్సకుడు.
ప్రతి మనిషికి ఎప్పుడో ఒకప్పుడు సందేహం కలుగుతుంది - నేనెవరు, నా మూలపురుషులెవరు, వారి చరిత్ర ఎటువంటిది అని -- దీనికి ముందుగా మనం కొంత సృష్టి ఆవిర్భావం గురించి(క్లుప్తంగా ) తెలుసుకొని - ఆ తరువాత మన ఋషులు, మనగోత్రాలు, ప్రవర చెప్పుకొందాం.
మానవులందరికీ మూలపురుషుడు మనువు. మనువు యొక్క సంతతి కాబట్టి మనం మనుషులం.
అసలు ఈ మనువు ఎవరు? సప్తఋషులు ఎవరు? ఇది తెలుసుకొందాం.
మహాప్రళయం తరవాత అనంత జలరాశి లో శయనించిన మహావిష్ణువు యొక్క నాభికమలం లోంచి ఉద్భవించిన బ్రహ్మకు సృష్టి భాద్యతని అప్పచెప్పాడు విష్ణుమూర్తి. కాని ఎలాగో చెప్పలెదు. ఆ నాభికమలం చాలా దూరం వెళ్ళిపోయింది, అక్కడ బ్రహ్మ మాత్రమే ఉన్నాడు . సృష్టి ఎలా చెయ్యాలో తెలియలేదు, తెలుసుకొనేందుకు తపస్సు చేసాడు. ఆ తపస్సు లో ఆయనకి అవగతం అయింది - ముందు నేను సృష్టికి హేతువులైన ఋషులను సృష్టించాలి. అంటే వారికీ ప్రపంచ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము రెండు ఉంటాయన్నమాట. వాళ్ళే మానవాళికి మంచిచెడులు భోధించి చెపుతారు.
అలా బ్రహ్మ తలలోంచి మొదట పుట్టినవాళ్ళు - సనక, సనందన, సనాతన, సనత్కుమారులు అనే నలుగురు పుట్టారు. వీరిని బ్రహ్మ మానసపుత్రులు అంటారు. కాని వాళ్ళు సహజంగా బ్రహ్మ జ్ఞానం ఉండటం తో సృష్టి కార్యక్రమం చెయ్యలేమని తపస్సు కు వెళ్లిపొయరు.
తరవాత బ్రహ్మవిశ్వం నందు జీవకోటిని సృస్తించుటకై మనువులను , శతరూప అనే సుందరిని, ప్రజాపతులను, ఋషులను సృష్టించాడు. ఆ తరవాత సృష్టి క్రమం ప్రారంభం అయింది. ఇది మనకి సంబంధించిన విశ్వం. ఇటువంటివి అనేకానేక విశ్వాలు ఉన్నాయని మన పురాణాలు చెపుతున్నాయి.
బ్రహ్మ యొక్క ఒక రోజు " పగటి కాలాన్ని" ఒక " కల్పము " అంటారు. ఈ పగటి కాలాన్ని (14) పద్నాలుగు భాగాలుగా చేసి, ఒకొక్క భాగానికి ఒకొక్క మనువుని సృష్టించాడు. ఒకొక్క మనువు కాలం అయిపోగానే మళ్ళా కొత్త మనువుని సృష్టిస్తూ ఉంటాడు. మనువు, మనువుతో పాటు ప్రజాపతులు, సప్తరుషులు, రుద్రులను,. ఇంద్రుడు, దేవతలు ఇలా entire administration అన్నమాట.
బ్రహ్మ ఒక రోజు పగటి కాలం (కల్పము ) = 1000 మహాయుగాలు (432,00,00,000 మానవ సంవత్సరాలు) (43,20,000X 1000) (432 కోట్లు సంవత్సరాలు)
ఒక మహాయుగం = . కృతయుగం + త్రేతాయుగం + ద్వాపరయుగం + కలియుగం (చాతుర్యుగాలు )
కలియుగం = 4,32,000 సంవత్సరాలు
ద్వాపరయుగం = (432000 X 2)= 8,64,000 "
త్రేతాయుగం = (432000X 3) = 12,96,000 "
కృత(సత్య)యుగం = (432000X 4)= 17,28,000 "
43,20,000 "
బ్రహ్మగారి పగలు కాలం అంటే 1000 మహా యుగాలు పూర్తి అయితే ఒక మహాప్రళయం వస్తుంది. (end of kalpa ). భూమి, జీవకోటి మొత్తం ప్రళయంలో అంతం అయిపోతుంది, కాని విశ్వం ఉంటుంది. బ్రహ్మ గారి 1000 మహా యుగాల రాత్రి సమయం గడిచాక మళ్ళా సృష్టి పునరావృతం అవుతుంది.
1000 మహా యుగాలు పగలు + 1000 మహా యుగాలు రాత్రి కలిపితే బ్రహ్మ ఒక రోజు. దీన్ని మహాకల్పము అంటారు. ఇలాంటి 360 రోజులైతే ఒక సంవత్సరం . బ్రహ్మ ఆయుర్దాయం 100 (దేవ) సంవత్సరాలు. (100 సంవత్సరాల బ్రహ్మ గారి ఆయుర్ధాయ కాలం, మహావిష్ణువు యొక్క పగటి కాలం). ప్రస్తుత బ్రహ్మ గారికి (మన గెలాక్సీ) మన శాస్త్రాల ప్రకారం 50 సంవత్సరాలు ( దేవ సంవత్సరాలు)గడచిపోయాయి.
మనువు - మన్వంతరాలు
ఇప్పుడు ఏదైతే జరుగుతోందో ఆ కల్పానికి (day of brahma) "శ్వేతవరాహ కల్పము " అని పేరు. బ్రహ్మగారి పగటి కాలాన్ని (14) భాగాలు చేసి ఒకో భాగానికి ఒకో మనువును appoint చేసారని మనం చెప్పుకొన్నాం.
ఈ ప్రకారం ఒక మనువు కాలం = 71 మహాయుగాలు = 308571414 (మానవ)సంవత్సరాలు (71+కృతయుగ(approx )
ప్రస్తుతం మనం (7) వ మనువైన "వైవస్వతమనువు" కాలం లో ఉన్నాము. దీన్ని "వైవస్వతమన్వంతరం" అంటారు.
ఈ "వైవస్వతమన్వంతరం" లో ( 27) ఇరవైఏడు మహాయుగాలు గడచిపోయాయి -- ఇప్పుడు మనం (28) వ మహాయుగంలోనాలుగవదైన కలియుగంలో ఉన్నాము. (ఈ మహాయుగం లో మొదటి మూడు యుగాలు
గడచిపోయాయి). కలియుగంలో
ఇప్పటికి 5115 సంవత్సరాలు (out
of 4,32,000 years) గడచిపోయాయి (B.C +A.C).
పూజ చేసుకొనే టప్పుడు సంకల్పం లో చెప్పుకొంటాము(మనం ఎక్కడ ఉన్నాం ఏ కాలంలో ఉన్నాం ) -- శ్వేతవరాహకల్పే, వైవస్వతమన్వంతరే, కలియుగే, ప్రధమపాదే, జంబూద్వీపే, భరతఖండే...
ఈ (14) మనువులు, వారి పేర్లు, వారి కాలంలో ఋషులు , ఇంద్రుడు, వగైరా ఈ క్రింద
పట్టికలో చూడండి
(ఇంకో సంగతి ఏమిటంటే ఈ దిక్పాలకుల పేర్లు, ఉపదేవతల పేర్లు ఒకో మనువు టైం లో కొన్ని మార్పులతో ఉన్నాయి)
మన్వంతర (No.)
|
మన్వంత మను పేరు
|
అవతార్ పేరు (అసలు పేరు )
|
భార్య, పిల్లలు
|
సప్త ఋషులు
|
ఇంద్రుడు
|
1
|
స్వయంభువమను
|
యజ్ఞ
|
భార్య-శతరూప
కూతుర్లు-అకుటి,దేవహుతి
మనవలు-యజ్ఞ,కపిల
|
మరీచి, అత్రి, అంగిరస, పులహ, క్రతు, పులస్త్య. వశిస్థ
|
యజ్ఞ (మనువు మనవడు)
|
2
|
స్వారోచిషమను
|
విభు
|
కొడుకులు - ద్యుమాట్, సుషేన, రోసిష్మట్
|
ఉర్జ, స్తంభ, ప్రాణ, దత్తోలి, రిషభ, నిస్చర, అర్వరివత్
|
రొచన
|
3
|
ఉత్తమమను
|
సత్యసేన
|
కొడుకులు-పవన, శ్రింజయ, యజ్ఞహొత్ర
|
కాకుండిహి, కురుండి, దలయ, శంఖ, ప్రవహిత, మిత, సమ్మిత (వశిష్టుని కొడుకులు)
|
సత్యజిత్
|
4
|
తామసమను(ఉత్తమమను తమ్ముడు)
|
హరి
|
10 మందికొడుకులు
|
జ్యోతిర్ధామ, ప్రీతు, కావ్య, చైత్ర , అగ్ని, వానక, పివర
|
త్రిశిఖ
|
5
|
రైవతమను (తామసమను కవల సోదరుడు)
|
వైకుంఠ
|
అర్జున, బాలి, వింధ్య
|
హిరణ్న్యరోమ, వేదశ్రి, ఊర్ద్ధబాహు, వేదబాహు,సుధామన్, పర్జన్య, మహాముని
|
భుట్టరాయ
|
6
|
చాక్షుషమను
|
అజిత
|
చాలామంది కొడుకులు- పురు,పురుస,...
|
సుమెధస్, విరజాస్, హవిష్మట్, ఉత్తమ, మధు,అభినమన్,సహిశ్న్ను
|
మంత్రద్రుమ
|
7
|
వైవస్వతమను (ప్రస్తుత మనువు)
|
వామన
|
10 మంది కొడుకులు - ఇక్ష్వాకు,నభగ,ద్రష్ట,సర్యాతి, నరిస్యంత,నభగ,దిష్ట,తరుస, ప్రసాదర,వాసుమాన్
|
కశ్యప, అత్రి, వశిష్ట, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, భరద్వాజ
|
పురందర
|
8
|
సావర్ణిమను
|
సార్వభౌమ
|
చాలామంది కొడుకులు - మొదట నిర్మోక ...
|
దిప్తిమత్, గాలవ, పరశురామ, కృప, ద్రౌని, వ్యాస, రిష్యశ్రింగ
|
బాలి
|
9
|
దక్ష సావర్ణిమను
|
రిషభ
|
చాలామంది కొడుకులు - మొదట భూతకేతు
|
సవన, ద్యుతిమత్, భవ్య, వాసు, మేధాతిథి, జ్యోతిష్మాన్, సత్య
|
అద్భుత
|
10
|
బ్రహ్మసావర్ణిమను
|
విష్వక్సేన
|
భూరిసేన (etc )
|
హవిష్మాన్, సుక్రితి, సత్య,అపమ్ముర్తి , నభగ, అప్రతిమౌజస్, సత్యకేత్
|
శంభు
|
11
|
ధర్మసావర్ణిమను
|
ధర్మసేతు
|
10మంది కొడుకులు - సత్యధర్మ ...
|
నిస్చర, అగ్నితేజాస్, వపుష్మన్, విష్ణు, ఆరుణి, హవిష్మాన్, అనఘ
|
వైధ్రిత
|
12
|
రుద్రసావర్ణిమను
|
సుధామ
|
దేవవన్ ....
|
తపస్వి, సుతపస్, తపోమూర్తి, తపోద్యుతి, తపోరతి, తపోద్రితి,తపోధన్
|
రితధామ
|
13
|
దేవసావర్ణిమను
|
యోగేశ్వర
|
చిత్రసేన...
|
నిర్మోహ,తత్వదర్సిన్, నిష్ప్రకంప, నిరుత్సుక , ధ్రితిమత్, అవ్యయ ,సుతపస్
|
దివస్పతి
|
14
|
ఇంద్రసావర్ణిమను
|
బ్రిహద్భాను
|
ఉరు, గంభీర
|
అగ్నిబహు, సూచి, శుక్ర, మగధ, యుక్త, గ్రిద్ర, అజిత
|
శుచి
|
ఇవి (14) మనువుల వివరాలు. బ్రహ్మగారి యొక్క ఒకరోజు పగటి కాలానికి పరిపాలనా వ్యవస్థ. ఈ కాలం లో మనం (7) వ మనువైన "వైవస్వతమనువు" కాలం లో ఉన్నాము. ఈ "వైవస్వతమనువు" గారు సృష్టి కార్యక్రమం చేపట్టి 27 మహాయుగాలు అయిపొయింది (27X 43,20,000). ఇప్పుడు మనం 28 వ మహాయుగంలో నాలుగవదైన కలియుగం లో ఉన్నము. కలియుగం ప్రవేసించి 5115 సంవత్సరాలు అయింది( ఇంకా 4,32,000-5115=4,26,885 ఉంది ). మనువుల వివరాలు (9) వ మనువు దగ్గరనుంచి కొన్నికొన్ని పురాణాల్లో కొంతకొంత తేడాలు తో ఉన్నాయి. ముఖ్య ప్రమాణం భాగవతం, విష్ణుపురాణం.
ఇంక ఇతిహాసాలు, పురాణాల ప్రమాణాల విషయానికి వస్తే మనకి ఈ 28 వ యుగం లో కృతయుగం దగ్గరనించి విషయసేకరణ, అవగాహన ఉంది.
సంక్షిప్తంగా ఈ కల్పం యొక్క కాలపరిమితులు ఇవి.
మనువు మారినప్పుడల్లా అంటే మన్వంతరం లో (71 మహాయుగాల అనంతరం) ప్రళయం వస్తుందా అంటే వస్తుంది అనే చాల పురాణాలు చెపుతున్నాయి, కాని అది కల్పాంతం అంటే బ్రహ్మగారి పగలు ముగిసి రాత్రి మొదలు అయ్యేటప్పుడు వచ్చేప్రళయం లా మొత్తం solar system అంతా లయం కాదు అంటున్నాయి.
మన పురాణాల్లో మూడురకాలైన ప్రళయాలు చెప్పబడ్డాయి.
1. ప్రాక్రితిక్ ప్రళయ -మహాప్రళయం -- 311040000000000(311trillion 40billion ) అంటే బ్రహ్మగారి 100 దేవసంవత్సరాల ఆయుర్దాయం తరవాత. (బ్రహ్మగారి ఒక పగలు కాలం =4320,000000X 2 X 100) మొత్తం విశ్వం, పంచభూతాలు అంతా వినాశనం అవుతుంది. అంటే విష్ణువు యొక్క పగలు సమాప్తం అవుతుంది అన్నమాట. ఆ తరవాత అంతే కాలం రాత్రి విశ్రమించిన మహా విష్ణువు, సృష్టి పునః ప్రారంభం మొదలు పెడతారు with new brahma.
2. నైమిత్తిక ప్రళయం - కల్పాంతం - అంటే బ్రహ్మ గారి ఒక పగలుకాలం - 4320,000000 (432 కోట్ల సంవత్సరాలు) అప్పుడొచ్చే ప్రళయం లో అన్ని జీవరాసులు నశించిపోతాయి, భూమి కుంగి పోతుంది, కాని విశ్వం ఉంటుంది - ఆయన రాత్రి నిద్రకి వెళ్ళేటప్పుడు జీవకోటినంతా నాశనం చేసి మళ్ళా ఉదయం సృష్టి మొదలు పెడతారు
3. మన్వంతర ప్రళయ : ఒక మనువు కాలం అంటే 71 మహాయుగాలు (30.7 కోట్లు సంవ ) అప్పుడుకూడా ప్రళయం వస్తుంది, కానీ కల్పాంతం అంత పెద్దది కాదు, కాని ఇక్కడ కూడా జీవకోటి చాలా నశించిపోతుంది. భూమి కూడా కుంగుతుంది.
ఇవి కాక ఒక మహాయుగం అంటే (4) చాతుర్యుగాలు పూర్తి అయినప్పుడు ఒక ప్రళయం, జీవకోటికి అపార నష్టం కలుగుతుంది. .ఇది కాక ఇంకా సౌర కుటుంబం లో వచ్చే ప్రళయాలు చాలా చెప్పారు మన పురాణాల్లో.
అన్ని పురాణాలలోను మహాప్రళయం ఒక భయంకరమైన వర్షం తో (deluge ) మొదలవుతుందని సమస్త ప్రాణికోటి నీటిలో పరిసమాప్తి అవుతుందని,భగవంతుడు ఒక మనిషిని సాక్షీభూతంగా భవిష్యత్తు మానవాళి కోసమ్ ఎన్నుకొంటాడని అతడే మనువు (వైవస్వతమను ) అని చెపుతున్నయి. బైబిల్లో కూడా ప్రళయం ఇంచుమించు ఇదే విధంగా వర్ణించారు - బైబిల్ ప్రకారం ఆ మానవుడు నోహ్ (NOAH). BIG BANG THEORY ప్రకారం ప్రళయం తరువాత విశ్వం లో జరిగే మార్పులు కూడా కొచెం ఇంచుమించులో ఇంతే. ( the Big Bang model suggests that at some moment all matter in the universe was contained in a single point. which is considered the beginning of the universe)
బ్రహ్మ వైవర్త పురాణం లో శ్రీకృష్ణుడు, గంగాదేవి తో చెపుతాడు మొదటి 5000 సంవత్సరాలలో నువ్వు మానవజాతి పాపాలను ప్రక్షాళన చెయ్యి అని.
కాలేః పంచసహస్రని వర్షాని తిష్థా భూతలే ! పాపాని పాపినో యాని తుభ్యం దశ్యంతి స్నానతః !
మొత్తం మీద సారాంశం ఏమిటంటే ఈ విశ్వం సృస్టించబడుతూ, లయం చెయ్యబడుతూ, మళ్ళా సృజించ బడుతూ ఈ కాలచక్రాన్ని ఆ పరబ్రహ్మ (brahman ) అంటే అనంత శక్తిస్వరూపం దీన్ని ఇలా నడిపిస్తోంది. దీనికి ఆది లేదు అంతం లేదు, చావు, పుట్టుకల మద్యలో కాలచక్రం ఇలా తిరుగుతూ ఉంటుంది .
ఇప్పుడు మన subject కి వద్దాం. ఎప్పటివో ఈ విషయాలన్నీ మానవులకి ఎలా తెలిసాయి . జ్ఞాన, అజ్ఞానాల మధ్యలో మనుషులు ఎలా కొట్టుమిట్టాడుతున్నారు. వీళ్ళకి మార్గదర్శకులు ఎవరు?
పూర్వకల్పం లో బ్రహ్మ మొదట సృష్టించిన అతడి మానసపుత్రులు సనకసనందనాదులు వాళ్ళు బ్రహ్మ జ్ఞానం తో సృష్టి కార్యం లో పాలుపంచుకొలెదు. తరవాత బ్రహ్మ ప్రజపతులను, దేవతలను, ఋషులను సృష్టించాడు. వాళ్ళే ఈ సృష్టిలో జ్ఞానులై పుట్టటం, సంతతిని వృది చెయ్యటం జరిగింది. బ్రహ్మ ఉద్దేశ్యం ఏమిటంటే - మనుషులు పెళ్ళిచేసుకోవాలి పిల్లల్ని కనాలి సంతానం వృది చెయ్యాలి భూమి కళకళ లాడాలి - ఇలా ఉండాలంటే వారికీ అవిద్య,(పరమాత్మ గురించి) అజ్ఞానం, దేహత్మభావన, దేహాభిమానం - ఇట్లాంటి లక్షణాలుంటే తప్ప మనుషులు వృది పొందరు. అందరూ శుద్ధజ్ఞానం లో ఉంటె సృష్టి జరగదు . కాబట్టి మనుషులలో అవిద్య, అజ్ఞానం ప్రవేశపెట్టారు .
ఈ సృష్టి రహస్యం, జీవకోటి లక్షణాలు అంతా సంపూర్ణంగా తెలిసినవారు, జగత్తు యొక్క భూత, భవిష్యత్, వర్తమానాలు తెలిసినవారు, జీవులకు ఏది క్షేమకరమో అది తెలిసినవారు మహర్షులు. ఆద్యంతమూ సృష్టి రహస్యం తెలిసి , వాళ్ళ కర్తవ్యం నిర్వహిస్తూ మనకి కర్తవ్య భోధ చేస్తూ, పుట్టబోయేవారి యోగక్షేమాలు కూడా ఆలోచించే వారు మహర్షులు . అనేకమంది మహర్షులు ఆర్య సంస్కృతిని రక్షించి జీవకోటిని ఉద్దారించారు, వేదములు, దర్శనములు, స్మృతులు మొదలైన వాజ్మయ ప్రపంచాన్ని ఈ ప్రపంచానికి అందించారు.
ఇటువంటి మహనీయుల వంశపరంపర లో జన్మించిన మనకి మన గోత్రములు, ఋషులు తప్పక తెలియాలి, తెలుసుకోవటం మన ధర్మం. సంధ్యావందనం లో ప్రతి రోజు గోత్ర ప్రవరలు చెప్పుకోవాలని మన ధర్మశాస్త్రం చెపుతుంది.
ప్రతిమనిషికి ఒకటి విద్యావంశము, జన్మ వంశము ఉంటాయి . జన్మవంశము అంటే తండ్రి,తాత ,ముత్తాత పేర్లు, విద్యవంశము అంటే తన గురువునుండి వారి గురువు వారినుండి భగవంతుని వరకు. ఈ రెండూ కాక గోత్ర ప్రవర ప్రతివాళ్ళకి తెలియలి. గోత్రమున ఏ ఋషి పేరుంటుందో అతడే మన వంశమునకు మూలపురుషుడు, అతనినుండి ఈ వంశము ఆవిర్భవించింది, ఆ ఋషి యొక్క శిష్యులు, వారి శిష్యులు లేదా ఋషి తండ్రి, తాత, సోదరులు, ఇలా ప్రతి వంశానికి(1),(2), (3),(5),(7),(9) ఇలా ఋషులు ఉంటారు . మన పుట్టుకకి ఆధారమైన ఈ మహనీయులని మనం రోజు స్మరించుకోవాలి . వారి చరిత్రలు తెలుసుకోవాలి. ఋషి సమూహమున సప్తఋషులు పరమపూజ్యులు నక్షత్ర రూపమున ఇప్పటికి దర్శనమిస్తున్నారు . వీరే కాకా జమదగ్ని, గౌతమస, విశిష్ట ఇలా చాల మంది మూల ఋషులు గా కలిగిన సుమారు (49) గోత్రముల ఋషి మూలములు ఉన్నట్లుగా అంచనా.
ప్రవర:ప్రవర అంటే శ్రేష్టుడు అని అర్ధం. ప్రవర అంటే ఎంతమంది శ్రేష్టులైన ఋషులు ఆ గోత్రంలో ఉన్నారో తెలియచెప్పేది.
ఉదాహరణకి శ్రీవత్సస గోత్రం అనుకోండి - ప్రవర ఈ విధంగా చెప్పుకోవాలి.
చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్య శ్సుభంభవతు భార్గవ, చ్యావన, ఆప్నువాన, ఔర్వ, జామదగ్న్య, పంచార్షేయ ప్రవరాన్విత శ్రీవత్సస గోత్రః అపస్తంబ సూత్రః కృష్ణయజుర్వేద శాఖా అధ్యాయి ........ (పేరు) శర్మ అహంభో అభివాదయే.
(సూత్రా లంటే వేదంగాలలోని వైదికక్రియలకి సంబంధించినవి ) (శా ఖ అంటే ఈ గోత్రానికి సంబంధించిన ఋషి ఏ వేదానికి సంబంధించిన స్కూల్ నడిపాడో తెలియచేసేది.
కొన్ని ఇంటిపేర్లకి గోత్రాలు, ఋషులు, వివరంగా తెలియచేస్తాను.
ప్రస్తుతం సెలవ్
చాగంటి రాజేశ్వరి