Wednesday, April 9, 2014

షష్టి పూర్తి


           తెలుగు సంవత్సరములు (60).  ప్రభవ  ..... నుంచి ......     క్షయ వరకు .  మనిషి పుట్టి (60) సంవత్సరాలు పూర్తి అయినప్పుడు తాను పుట్టిన సంవత్సరం మరల వచ్చును.  ఈ  (60) వ సంవత్సరం ప్రతి మనిషి జీవితం లో తిరిగి పుట్టటం లాంటిది.  ఋషులు, మునులు, శాస్త్రము చెప్పినదాన్ని బట్టి ఒక మనిషి జీవితం లో 60 సం " పూర్తి కావటం అంటే ఆ మనిషి తిరిగి పుట్టటం లాంటిది అని, అందువలన,     పుట్టినప్పుడు చేసిన జాతకకర్మలన్నీ తిరిగి జరిపించాలని అంటారు. అందువలన దీన్ని ఆ వ్యక్తి  పుట్టిన సంవత్సరం లో, పుట్టిన నెలలో, పుట్టిన తెదీ (హిందూ పంచాంగం ప్రకారం ) జరిపించాలి.
శాస్త్రం ఇలా అంటుంది
''జన్మబ్దే , జన్మమాసేచ , స్వజన్మదివసే తథా, జన్మర్శేచైవ కర్తవ్యా శాంతి ఉగ్రరధాహ్వాయా; దేవాలయే నదీతీరే స్వగృహే; వా; సుభస్థలే''

          అయితే ఈ శాంతి లకి ఉగ్రరధ హోమము, ఉగ్రరధ  శాంతి అని పేరు. మానవుడి ఆయుర్దాయం 100 సం" అయితే అందులో (60) సం" వ్యక్తిగత ప్రయోజనాలకి కాలం గడచి పోతుంది.  ఈ మిగిలిన జీవితకాలం అయినా ఆధ్యాత్మిక మార్గం  లో పయనించాలని, పరమార్థాన్ని, పరబ్రహ్మను తెలుసుకోవాలని, అపమృత్యు భయం, ఆరోగ్యం కలగాలని ఈ శాంతి చేస్తారు .  ఒక రకం గా ఉగ్రరధ  శాంతి భగవంతుడికి నివేదించుకొనే ఒక ప్రార్ధన -మిగిలిన జీవితకాలం అంతా పరమాత్మ కోసం జీవించాలనుకోవటం. అంతే  కాకుండా శాస్త్రం చెపుతుంది - ఈ శాంతి వల్ల రాబోయే గడ్డు రోజులని చాలా ప్రశాంతం గా గడపచ్చని - ఎందుకంటే వార్ధక్యం ముదలవుతుంది - (60) సం " శారీరక శ్రమ ఇప్పుడు బయటపడుతుంది - మనోబలం చాలా అవసరం అయిన కాలం
        అయితే ఇది  అన్ని పూజలలా కాకుండా మన జన్మలకి కారణమైన గ్రహాదుల ని   ఆవాహన చేస్తాం. 
ఇది  కాలానికి సంబందించినది కూడా కాబట్టి కాలానికి సంబంధించిన అన్ని దేవతా మూర్తులని ఆవాహన చేస్తూ (అంటే మన హిందూ ధర్మంలో ప్రక్రుతి అంతా దైవీ, దేవతా స్వరూపాలు గానే భావిస్తాం) పూజ చేస్తాం. కాలం, గ్రహాలు, గ్రహదిపతులు, గ్రహదిపతుల అధిదేవతలు  ఇలా  అన్న మాట.  వాటి యొక్క వివరణ క్లుప్తం గా ఇలా   ఉంటుంది.. 
తెలుగు సంవత్సరాలు   -- 60       దిక్కులు   --  4      ఆయనాలు  ---  2       ఋతువులు   --   6     మాసములు --  12              పక్షములు  --  2    తిధులు   -- 15    వారములు   --  7      వారదేవాతలు  ఐన  గ్రహాలు -- 7 (గ్రహాలు 9 కానీ ఇక్కడ 7 మాత్రమే )  గ్రహాలకు అధి దేవతలు  -- 7 ఈ అధిదేవతలకి దేవతలు, మృత్యుంజయడు  వగైరా ..... 

సంక్షిప్తం గా ఉగ్రరధ  శాంతి ఇలా చేస్తారు

          తెల్లని నూతన వస్త్రముపై తూర్పు దిక్కుగా 12 గీతలు గీచి వాటిమీద అయిదు గీతలు గీసి మొత్తము 60 గదులు   వచ్చే విధంగా చేస్తారు . వరుసకు 12  అయిదు వరుసలు తూర్పు దిక్కున బియ్యం పోసి కలశం ఉంచుతారు. ప్రభవ  నుంచి  క్షయ వరకు 60 సం " అధిదేవతలతో ఆవాహన చేస్తారు. పైన చెప్పిన దక్షినాయన ఉత్తరాయణ దేవతలను, 6 ఋతువులను  12 మాసములను ఆవాహన చేస్తారు.  పక్షములను,తిదులను  వారములను - వారదేవతలు అయిన - సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని ని ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు - అగ్ని, జలము , భూమి, విష్ణువు ఇంద్రుడు, ప్రజాపతి లని ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు  శివుడు, దుర్గ, కుమారస్వామి, బ్రహ్మ  - ఇంకా ఏకాదశ రుద్రులు, నక్షత్ర దేవతలు  27 యోగములు 11 కరణములు  ఇలా అందరి దేవి దేవతా స్వరూపాలని మృత్యుంజయుని ఆవాహన చేసి  బ్రాహ్మణోత్తములు మంగళాచరనములతొ వేదయుక్తంగా ఈ కార్యక్రమం జరిపిస్తారు.  

         కర్త ధర్మపత్నీ సమేతుడై మంగళస్నానము చేసి నూతన వస్త్రములు ధరించి తూర్పు ముఖం గా పీటపై కూర్చుండి బ్రహ్మ గారు చెప్పినట్లు ఈ  దేవతలందరికీ ధూప, దీప నీరజనాది షోడశోపచార పూజ చేయవలెను, ఇంకా అపమృత్యు నివారణార్థం హోమాల్ని, జపాలని కుడా చేస్తారు. (సుమారు 4---5 గం" పాటు జరుగుతుంది కార్యక్రమం).
   

            పూజా కార్యక్రమం అయ్యాకా బ్రహ్మ గారు భార్యా భర్త   లిరువురిని దండలు మార్చుకోమని  తిరిగి నూతన దంపతుల లా జీవనాన్న్ని సాగించమని చెపుతారు.  అంటే దానర్థం ఇంతవరకు సంసారచక్రం లో అలసిపోయి ఉన్న దంపతులు,  భాద్యతల నుండి విముక్తి పొంది స్నేహంతో,  సామరస్యం తో మిగిలిన జీవితం ఒకరికొకరు తోడుగా ప్రశాంతం గా జీవించమని.

      తరువాత బ్రహ్మలను సత్కరించి బంధుమిత్రులతో విందు ఆరగించవలెను. ఇది శాస్త్రం లో చెప్పిన షష్టి పూర్తి.

          విదేశాలలో ఉండేవాళ్ళు , అవకాశం లేనివాళ్ళు, ఆర్ధిక స్తోమత లేనివాళ్ళు ఉండచ్చు - మరి అలాంటప్పుడు ఏం చెయ్యాలి అనుకోవచ్చు - గ్రహాదిపతి ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడికి కొంచెం పాయసం చేసి నైవేద్యం పెట్టి - ఆదిత్యహృదయం, నవగ్రహ స్తోత్రం చదువుకొని, వినాయకుడికి పూజ చేసుకోవచ్చు - ఓపిక ఉంటే   నమకమ్, చమకమ్  CD లు దొరుకుతాయి, అవిపెట్టుకొని శివుడికి అభిషేకం, నీళ్ళతో పాలతో చేసుకోవచ్చు =  బందుమిత్రులతో కలసి సత్యనారాయణవ్రతం CD  కూడా దొరుకుతుంది - అది పెట్టుకొని చక్కగా ప్రసాదం చేసుకొని పూజ చేసుకోవచ్చు - మనస్సుని కాసేపు భగవత్ ధ్యానానికి వినియోగించండి - ఈ బ్రతుకునిచ్చిన పరమేశ్వరుడికి కృతఙ్ఞతలు చెప్పుకోండి చాలు.

          ఈ  మధ్య   అందరు  షష్టి పూర్తి అనగానే పార్టీ చేసుకోవటం, కేక్ కట్ చేయటం, బహుమతులు ఇచ్చుకోవటం, విహరయత్రాలకి వెళ్ళటం వంటివి చేస్తున్నారు - ఇవన్నీ సరదాకి వాళ్ళ ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు.  కానీ షష్టిపూర్తి  ని శాస్త్రాలు ఎందుకు చేసుకోమన్నారో దాని  అర్థం తెలుసుకొని - పెద్దవాళ్ళు ఆ ప్రకారం చేసుకొంటె  మన ముందు తరాల వాళ్ళకి అర్థం అవుతుంది.  
శెలవు
రాజేశ్వరి