Thursday, June 12, 2014

మహాప్రళయం -సృష్టి ఆవిర్భావం -ఋషులు - జీవరాసి

      

        అపారమైన జ్ఞాన విజ్ఞానములకు,  సంస్కృతి సంప్రదాయాలకు  ఆలవాలమైన దేశం మన భారత దేశం.  భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు మూలాధారం ఋషులు, జీవరాశికి మూలపురుషులు ఋషులే .  మనను  నిత్యమూ నడిపిస్తూ, మనకు సంప్రదాయాన్ని ఇచ్చినవారు ఋషులు. ఈ ఋషులు భౌతికమైన ప్రపంచానికి తండ్రులు . బ్రహ్మ ముఖం నుండి వేదం పుట్టింది, కాని దానిని మనకు ప్రసాదించినది ఋషులే.  ఋషి అంటే మంత్రద్రష్ట, త్రికాలజ్ఞాని, సద్గురువు, వేదవిజ్ఞాన ప్రచారకుడు, తపశ్శాలి , మానవాళికి మార్గదర్సకుడు.

        ప్రతి మనిషికి ఎప్పుడో ఒకప్పుడు  సందేహం కలుగుతుంది - నేనెవరు, నా మూలపురుషులెవరు, వారి చరిత్ర ఎటువంటిది అని -- దీనికి ముందుగా మనం కొంత సృష్టి ఆవిర్భావం గురించి(క్లుప్తంగా ) తెలుసుకొని - ఆ తరువాత మన ఋషులు, మనగోత్రాలు, ప్రవర చెప్పుకొందాం.
 మానవులందరికీ మూలపురుషుడు మనువు.  మనువు యొక్క సంతతి కాబట్టి మనం మనుషులం.
  
  అసలు ఈ మనువు ఎవరు? సప్తఋషులు ఎవరు?  ఇది తెలుసుకొందాం.
           మహాప్రళయం తరవాత అనంత జలరాశి లో శయనించిన మహావిష్ణువు యొక్క నాభికమలం లోంచి ఉద్భవించిన బ్రహ్మకు సృష్టి భాద్యతని అప్పచెప్పాడు విష్ణుమూర్తి.  కాని ఎలాగో చెప్పలెదు. ఆ నాభికమలం చాలా దూరం వెళ్ళిపోయింది, అక్కడ బ్రహ్మ మాత్రమే ఉన్నాడు . సృష్టి ఎలా చెయ్యాలో తెలియలేదు, తెలుసుకొనేందుకు తపస్సు చేసాడు.  ఆ తపస్సు లో ఆయనకి అవగతం అయింది - ముందు నేను సృష్టికి హేతువులైన ఋషులను సృష్టించాలి. అంటే వారికీ ప్రపంచ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము రెండు ఉంటాయన్నమాట.  వాళ్ళే మానవాళికి మంచిచెడులు భోధించి చెపుతారు.

       అలా బ్రహ్మ తలలోంచి మొదట పుట్టినవాళ్ళు - సనక, సనందన, సనాతన, సనత్కుమారులు అనే నలుగురు పుట్టారు.  వీరిని బ్రహ్మ మానసపుత్రులు అంటారు. కాని వాళ్ళు సహజంగా బ్రహ్మ జ్ఞానం ఉండటం తో సృష్టి కార్యక్రమం చెయ్యలేమని తపస్సు కు వెళ్లిపొయరు.

       తరవాత బ్రహ్మవిశ్వం నందు జీవకోటిని  సృస్తించుటకై  మనువులను , శతరూప  అనే సుందరిని, ప్రజాపతులను, ఋషులను సృష్టించాడు.  ఆ తరవాత సృష్టి క్రమం ప్రారంభం అయింది. ఇది మనకి సంబంధించిన విశ్వం.  ఇటువంటివి అనేకానేక  విశ్వాలు ఉన్నాయని మన పురాణాలు చెపుతున్నాయి.

             ఇప్పుడు బ్రహ్మ యొక్క కాలం గురించి ఆయన administration గురించి తెలుసుకొందాం.

         బ్రహ్మ యొక్క ఒక రోజు " పగటి కాలాన్ని" ఒక " కల్పము " అంటారు. ఈ పగటి కాలాన్ని (14) పద్నాలుగు భాగాలుగా చేసి, ఒకొక్క భాగానికి ఒకొక్క  మనువుని సృష్టించాడు. ఒకొక్క మనువు కాలం అయిపోగానే మళ్ళా కొత్త మనువుని సృష్టిస్తూ ఉంటాడు.  మనువు, మనువుతో పాటు ప్రజాపతులు, సప్తరుషులు, రుద్రులను,. ఇంద్రుడు, దేవతలు ఇలా  entire administration అన్నమాట.

బ్రహ్మ ఒక రోజు పగటి కాలం (కల్పము )   =  1000 మహాయుగాలు (432,00,00,000 మానవ సంవత్సరాలు)                                                                   (43,20,000X 1000)   (432 కోట్లు సంవత్సరాలు)
ఒక మహాయుగం  =  . కృతయుగం + త్రేతాయుగం + ద్వాపరయుగం + కలియుగం (చాతుర్యుగాలు )
కలియుగం       =                                                                    4,32,000   సంవత్సరాలు
ద్వాపరయుగం =       (432000 X 2)=                                     8,64,000          "
త్రేతాయుగం     =       (432000X 3) =                                    12,96,000          "
కృత(సత్య)యుగం =  (432000X 4)=                                     17,28,000         "
                                                                                            43,20,000         "

               బ్రహ్మగారి పగలు కాలం అంటే 1000 మహా యుగాలు పూర్తి అయితే ఒక మహాప్రళయం వస్తుంది. (end of kalpa ). భూమి, జీవకోటి మొత్తం ప్రళయంలో అంతం అయిపోతుంది, కాని విశ్వం ఉంటుంది.  బ్రహ్మ గారి 1000 మహా యుగాల రాత్రి సమయం గడిచాక మళ్ళా సృష్టి పునరావృతం అవుతుంది.

               1000 మహా యుగాలు పగలు + 1000 మహా యుగాలు రాత్రి కలిపితే బ్రహ్మ ఒక రోజు.  దీన్ని  మహాకల్పము అంటారు. ఇలాంటి 360 రోజులైతే ఒక సంవత్సరం . బ్రహ్మ ఆయుర్దాయం 100 (దేవ) సంవత్సరాలు. (100 సంవత్సరాల బ్రహ్మ గారి ఆయుర్ధాయ కాలం, మహావిష్ణువు యొక్క పగటి కాలం).   ప్రస్తుత బ్రహ్మ గారికి (మన గెలాక్సీ) మన శాస్త్రాల ప్రకారం 50 సంవత్సరాలు ( దేవ సంవత్సరాలు)గడచిపోయాయి.

ప్రస్తుతం  బ్రహ్మగారి 51 వ సంవత్సరం లో పగటి కాలం (7) వ మనువు కంట్రోల్ లో మనం ఉన్నము.

మనువు - మన్వంతరాలు 

             ఇప్పుడు ఏదైతే జరుగుతోందో ఆ కల్పానికి (day of brahma) "శ్వేతవరాహ కల్పము " అని పేరు. బ్రహ్మగారి పగటి కాలాన్ని (14) భాగాలు చేసి ఒకో భాగానికి ఒకో మనువును appoint చేసారని మనం చెప్పుకొన్నాం.

             ఈ ప్రకారం ఒక మనువు కాలం = 71 మహాయుగాలు = 308571414 (మానవ)సంవత్సరాలు  (71+కృతయుగ(approx )
ప్రస్తుతం మనం (7) వ మనువైన "వైవస్వతమనువు" కాలం లో ఉన్నాము. దీన్ని "వైవస్వతమన్వంతరం" అంటారు.


            ఈ  "వైవస్వతమన్వంతరం" లో ( 27)  ఇరవైఏడు    మహాయుగాలు గడచిపోయాయి -- ఇప్పుడు మనం (28) వ మహాయుగంలోనాలుగవదైన  కలియుగంలో ఉన్నాము. (ఈ మహాయుగం లో మొదటి మూడు యుగాలు గడచిపోయాయి). కలియుగంలో ఇప్పటికి 5115 సంవత్సరాలు (out of 4,32,000 years)  గడచిపోయాయి (B.C +A.C). 
 
పూజ చేసుకొనే టప్పుడు  సంకల్పం లో  చెప్పుకొంటాము(మనం ఎక్కడ ఉన్నాం ఏ కాలంలో ఉన్నాం )  --  శ్వేతవరాహకల్పే,  వైవస్వతమన్వంతరే,  కలియుగే,  ప్రధమపాదే, జంబూద్వీపే, భరతఖండే...  


        ఈ  (14) మనువులు, వారి పేర్లు, వారి కాలంలో ఋషులు , ఇంద్రుడు, వగైరా ఈ క్రింద పట్టికలో చూడండి
(ఇంకో సంగతి ఏమిటంటే ఈ దిక్పాలకుల పేర్లు, ఉపదేవతల పేర్లు ఒకో మనువు టైం లో కొన్ని మార్పులతో ఉన్నాయి) 



మన్వంతర (No.)
మన్వంత మను పేరు
అవతార్ పేరు (అసలు పేరు )
భార్య, పిల్లలు
సప్త ఋషులు
ఇంద్రుడు


1


స్వయంభువమను


యజ్ఞ
భార్య-శతరూప
కూతుర్లు-అకుటి,దేవహుతి
మనవలు-యజ్ఞ,కపిల
మరీచి, అత్రి, అంగిరస, పులహ, క్రతుపులస్త్య. వశిస్థ  
యజ్ఞ  (మనువు మనవడు)

2

స్వారోచిషమను

 విభు
కొడుకులు - ద్యుమాట్సుషేన, రోసిష్మట్  
ఉర్జ, స్తంభ, ప్రాణ, దత్తోలి,  రిషభ, నిస్చర, అర్వరివత్

రొచన

3

ఉత్తమమను

సత్యసేన      
కొడుకులు-పవన,    శ్రింజయ, యజ్ఞహొత్ర    
కాకుండిహి, కురుండి, దలయ, శంఖ, ప్రవహిత, మిత, సమ్మిత   (వశిష్టుని కొడుకులు) 

సత్యజిత్     

4

తామసమను(ఉత్తమమను తమ్ముడు)  

హరి   
10 మందికొడుకులు    
జ్యోతిర్ధామ, ప్రీతు, కావ్య, చైత్ర , అగ్ని, వానక, పివర 

 త్రిశిఖ  


5


రైవతమను  (తామసమను కవల సోదరుడు)  


వైకుంఠ      


అర్జున, బాలి, వింధ్య    
హిరణ్న్యరోమ, వేదశ్రి, ఊర్ద్ధబాహు, వేదబాహు,సుధామన్, పర్జన్య,    మహాముని 


భుట్టరాయ  


6


చాక్షుషమను


అజిత    
చాలామంది కొడుకులు- పురు,పురుస,...  
సుమెధస్, విరజాస్, హవిష్మట్,  ఉత్తమ, మధు,అభినమన్,సహిశ్న్ను 


మంత్రద్రుమ 


7


వైవస్వతమను   (ప్రస్తుత మనువు)


  వామన        
10 మంది కొడుకులు - ఇక్ష్వాకు,నభగ,ద్రష్ట,సర్యాతి, నరిస్యంత,నభగ,దిష్ట,తరుస,   ప్రసాదర,వాసుమాన్ 
కశ్యప, అత్రి, వశిష్ట, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, భరద్వాజ


పురందర


8


సావర్ణిమను  


సార్వభౌమ  
చాలామంది కొడుకులు - మొదట నిర్మోక ...    
దిప్తిమత్, గాలవ, పరశురామ, కృప,  ద్రౌని, వ్యాస, రిష్యశ్రింగ 


బాలి 


9



దక్ష సావర్ణిమను



రిషభ    

చాలామంది కొడుకులు  -    మొదట భూతకేతు  

సవన, ద్యుతిమత్, భవ్య, వాసు, మేధాతిథి, జ్యోతిష్మాన్, సత్య



అద్భుత 


10


బ్రహ్మసావర్ణిమను


విష్వక్సేన


భూరిసేన (etc )      
హవిష్మాన్, సుక్రితి, సత్య,అపమ్ముర్తి , నభగ, అప్రతిమౌజస్, సత్యకేత్  


శంభు     


11


ధర్మసావర్ణిమను


ధర్మసేతు
10మంది కొడుకులు    - సత్యధర్మ  ...  
నిస్చర, అగ్నితేజాస్, వపుష్మన్, విష్ణు, ఆరుణి, హవిష్మాన్, అనఘ 


వైధ్రిత 


12


రుద్రసావర్ణిమను 


సుధామ
 

దేవవన్ ....   
తపస్వి, సుతపస్, తపోమూర్తి, తపోద్యుతి, తపోరతి, తపోద్రితి,తపోధన్


రితధామ


13


దేవసావర్ణిమను


యోగేశ్వర 


చిత్రసేన...  
నిర్మోహ,తత్వదర్సిన్, నిష్ప్రకంప, నిరుత్సుక , ధ్రితిమత్, అవ్యయ ,సుతపస్    


దివస్పతి


14


ఇంద్రసావర్ణిమను


బ్రిహద్భాను 


ఉరు, గంభీర        
అగ్నిబహు, సూచి, శుక్ర, మగధ, యుక్త,   గ్రిద్ర, అజిత     


శుచి



             ఇవి  (14) మనువుల వివరాలు.  బ్రహ్మగారి యొక్క ఒకరోజు పగటి కాలానికి పరిపాలనా వ్యవస్థ.  ఈ  కాలం లో మనం (7) వ మనువైన    "వైవస్వతమనువు" కాలం లో ఉన్నాము. ఈ "వైవస్వతమనువు" గారు సృష్టి కార్యక్రమం చేపట్టి 27 మహాయుగాలు అయిపొయింది (27X 43,20,000). ఇప్పుడు  మనం 28 వ మహాయుగంలో నాలుగవదైన కలియుగం లో ఉన్నము. కలియుగం ప్రవేసించి 5115 సంవత్సరాలు అయింది( ఇంకా 4,32,000-5115=4,26,885 ఉంది ).  మనువుల వివరాలు (9) వ మనువు దగ్గరనుంచి కొన్నికొన్ని పురాణాల్లో కొంతకొంత తేడాలు తో ఉన్నాయి.  ముఖ్య ప్రమాణం భాగవతం, విష్ణుపురాణం. 

          ఇంక ఇతిహాసాలు, పురాణాల ప్రమాణాల విషయానికి వస్తే మనకి ఈ 28 వ యుగం లో కృతయుగం దగ్గరనించి విషయసేకరణ, అవగాహన ఉంది.

           సంక్షిప్తంగా  ఈ  కల్పం యొక్క కాలపరిమితులు ఇవి.

              మనువు మారినప్పుడల్లా అంటే మన్వంతరం లో (71 మహాయుగాల అనంతరం) ప్రళయం వస్తుందా అంటే వస్తుంది అనే చాల పురాణాలు చెపుతున్నాయి, కాని అది కల్పాంతం అంటే బ్రహ్మగారి పగలు ముగిసి రాత్రి మొదలు అయ్యేటప్పుడు వచ్చేప్రళయం లా మొత్తం solar system అంతా లయం కాదు అంటున్నాయి.

              మన పురాణాల్లో   మూడురకాలైన ప్రళయాలు చెప్పబడ్డాయి.

1. ప్రాక్రితిక్ ప్రళయ -మహాప్రళయం   -- 311040000000000(311trillion 40billion ) అంటే బ్రహ్మగారి 100 దేవసంవత్సరాల ఆయుర్దాయం తరవాత. (బ్రహ్మగారి ఒక పగలు  కాలం =4320,000000X 2 X 100) మొత్తం విశ్వం, పంచభూతాలు అంతా వినాశనం అవుతుంది. అంటే విష్ణువు యొక్క పగలు సమాప్తం అవుతుంది అన్నమాట. ఆ తరవాత అంతే కాలం రాత్రి విశ్రమించిన మహా విష్ణువు,  సృష్టి  పునః ప్రారంభం మొదలు పెడతారు with new  brahma.  

2. నైమిత్తిక ప్రళయం - కల్పాంతం - అంటే బ్రహ్మ గారి ఒక పగలుకాలం - 4320,000000 (432 కోట్ల సంవత్సరాలు) అప్పుడొచ్చే ప్రళయం లో అన్ని జీవరాసులు నశించిపోతాయి, భూమి కుంగి పోతుంది, కాని విశ్వం ఉంటుంది - ఆయన రాత్రి నిద్రకి వెళ్ళేటప్పుడు జీవకోటినంతా నాశనం చేసి మళ్ళా ఉదయం సృష్టి మొదలు పెడతారు

 3. మన్వంతర ప్రళయ : ఒక మనువు కాలం అంటే 71 మహాయుగాలు (30.7 కోట్లు సంవ ) అప్పుడుకూడా ప్రళయం వస్తుంది, కానీ కల్పాంతం అంత  పెద్దది కాదు, కాని ఇక్కడ కూడా జీవకోటి చాలా నశించిపోతుంది. భూమి కూడా కుంగుతుంది.
 
ఇవి  కాక  ఒక మహాయుగం అంటే (4) చాతుర్యుగాలు పూర్తి అయినప్పుడు ఒక ప్రళయం, జీవకోటికి అపార నష్టం కలుగుతుంది.   .ఇది కాక  ఇంకా సౌర కుటుంబం లో వచ్చే ప్రళయాలు  చాలా చెప్పారు మన పురాణాల్లో.

అన్ని పురాణాలలోను మహాప్రళయం ఒక భయంకరమైన వర్షం తో (deluge ) మొదలవుతుందని సమస్త ప్రాణికోటి నీటిలో పరిసమాప్తి అవుతుందని,భగవంతుడు ఒక మనిషిని సాక్షీభూతంగా భవిష్యత్తు మానవాళి కోసమ్ ఎన్నుకొంటాడని అతడే మనువు (వైవస్వతమను ) అని చెపుతున్నయి.  బైబిల్లో కూడా ప్రళయం ఇంచుమించు ఇదే విధంగా వర్ణించారు - బైబిల్ ప్రకారం ఆ మానవుడు  నోహ్ (NOAH).    BIG BANG THEORY  ప్రకారం ప్రళయం తరువాత విశ్వం లో జరిగే మార్పులు కూడా కొచెం ఇంచుమించులో ఇంతే. ( the Big Bang model suggests that at some moment all matter in the universe was contained in a single point.  which is considered the beginning of the universe)


బ్రహ్మ వైవర్త పురాణం లో శ్రీకృష్ణుడు, గంగాదేవి తో చెపుతాడు మొదటి 5000 సంవత్సరాలలో నువ్వు మానవజాతి పాపాలను ప్రక్షాళన చెయ్యి అని.
కాలేః పంచసహస్రని వర్షాని తిష్థా భూతలే ! పాపాని  పాపినో యాని తుభ్యం దశ్యంతి స్నానతః ! 

మొత్తం మీద సారాంశం ఏమిటంటే ఈ విశ్వం సృస్టించబడుతూ, లయం చెయ్యబడుతూ, మళ్ళా సృజించ బడుతూ ఈ కాలచక్రాన్ని ఆ పరబ్రహ్మ (brahman ) అంటే అనంత శక్తిస్వరూపం దీన్ని ఇలా నడిపిస్తోంది.  దీనికి ఆది లేదు అంతం లేదు, చావు, పుట్టుకల మద్యలో కాలచక్రం ఇలా తిరుగుతూ ఉంటుంది .

ఇప్పుడు మన subject కి వద్దాం. ఎప్పటివో ఈ విషయాలన్నీ మానవులకి ఎలా తెలిసాయి . జ్ఞాన, అజ్ఞానాల మధ్యలో మనుషులు ఎలా కొట్టుమిట్టాడుతున్నారు.  వీళ్ళకి మార్గదర్శకులు ఎవరు?

పూర్వకల్పం లో బ్రహ్మ మొదట సృష్టించిన అతడి మానసపుత్రులు సనకసనందనాదులు వాళ్ళు బ్రహ్మ జ్ఞానం తో సృష్టి కార్యం లో పాలుపంచుకొలెదు. తరవాత బ్రహ్మ ప్రజపతులను, దేవతలను, ఋషులను సృష్టించాడు. వాళ్ళే ఈ  సృష్టిలో జ్ఞానులై పుట్టటం, సంతతిని వృది చెయ్యటం జరిగింది.  బ్రహ్మ ఉద్దేశ్యం ఏమిటంటే - మనుషులు పెళ్ళిచేసుకోవాలి పిల్లల్ని కనాలి సంతానం వృది చెయ్యాలి భూమి కళకళ లాడాలి - ఇలా ఉండాలంటే వారికీ అవిద్య,(పరమాత్మ గురించి) అజ్ఞానం, దేహత్మభావన, దేహాభిమానం - ఇట్లాంటి లక్షణాలుంటే తప్ప మనుషులు వృది పొందరు. అందరూ శుద్ధజ్ఞానం లో ఉంటె సృష్టి జరగదు .  కాబట్టి మనుషులలో అవిద్య, అజ్ఞానం ప్రవేశపెట్టారు .

          ఈ సృష్టి రహస్యం, జీవకోటి లక్షణాలు అంతా సంపూర్ణంగా తెలిసినవారు, జగత్తు యొక్క భూత, భవిష్యత్, వర్తమానాలు తెలిసినవారు, జీవులకు ఏది క్షేమకరమో అది తెలిసినవారు మహర్షులు.  ఆద్యంతమూ సృష్టి రహస్యం తెలిసి , వాళ్ళ కర్తవ్యం నిర్వహిస్తూ మనకి కర్తవ్య భోధ చేస్తూ, పుట్టబోయేవారి యోగక్షేమాలు కూడా ఆలోచించే వారు మహర్షులు . అనేకమంది మహర్షులు ఆర్య సంస్కృతిని రక్షించి జీవకోటిని ఉద్దారించారు,  వేదములు, దర్శనములు, స్మృతులు మొదలైన వాజ్మయ ప్రపంచాన్ని ఈ ప్రపంచానికి అందించారు. 

    ఇటువంటి మహనీయుల వంశపరంపర లో జన్మించిన మనకి మన గోత్రములు, ఋషులు తప్పక తెలియాలి, తెలుసుకోవటం మన ధర్మం. సంధ్యావందనం లో ప్రతి రోజు గోత్ర ప్రవరలు చెప్పుకోవాలని మన ధర్మశాస్త్రం చెపుతుంది.

ప్రతిమనిషికి ఒకటి విద్యావంశము, జన్మ వంశము ఉంటాయి .  జన్మవంశము అంటే తండ్రి,తాత ,ముత్తాత పేర్లు, విద్యవంశము అంటే తన గురువునుండి వారి గురువు వారినుండి భగవంతుని వరకు.  ఈ రెండూ  కాక గోత్ర ప్రవర ప్రతివాళ్ళకి తెలియలి. గోత్రమున ఏ ఋషి పేరుంటుందో  అతడే మన వంశమునకు  మూలపురుషుడు, అతనినుండి ఈ వంశము ఆవిర్భవించింది, ఆ ఋషి యొక్క శిష్యులు, వారి శిష్యులు లేదా ఋషి తండ్రి, తాత, సోదరులు, ఇలా ప్రతి వంశానికి(1),(2), (3),(5),(7),(9) ఇలా ఋషులు ఉంటారు . మన పుట్టుకకి ఆధారమైన ఈ మహనీయులని మనం రోజు స్మరించుకోవాలి . వారి చరిత్రలు తెలుసుకోవాలి.  ఋషి  సమూహమున సప్తఋషులు పరమపూజ్యులు నక్షత్ర రూపమున ఇప్పటికి దర్శనమిస్తున్నారు . వీరే కాకా జమదగ్ని, గౌతమస, విశిష్ట ఇలా చాల మంది మూల  ఋషులు గా కలిగిన సుమారు (49) గోత్రముల ఋషి మూలములు ఉన్నట్లుగా అంచనా.
ప్రవర:
 ప్రవర అంటే శ్రేష్టుడు అని అర్ధం.  ప్రవర అంటే ఎంతమంది శ్రేష్టులైన ఋషులు ఆ గోత్రంలో ఉన్నారో తెలియచెప్పేది.
ఉదాహరణకి శ్రీవత్సస గోత్రం అనుకోండి - ప్రవర ఈ విధంగా చెప్పుకోవాలి.

చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్య శ్సుభంభవతు  భార్గవ, చ్యావన, ఆప్నువాన, ఔర్వ, జామదగ్న్య, పంచార్షేయ  ప్రవరాన్విత  శ్రీవత్సస గోత్రః     అపస్తంబ సూత్రః   కృష్ణయజుర్వేద శాఖా అధ్యాయి ........ (పేరు) శర్మ అహంభో అభివాదయే.
(సూత్రా లంటే వేదంగాలలోని వైదికక్రియలకి సంబంధించినవి ) (శా ఖ అంటే ఈ గోత్రానికి సంబంధించిన ఋషి ఏ వేదానికి సంబంధించిన స్కూల్ నడిపాడో తెలియచేసేది.

కొన్ని ఇంటిపేర్లకి గోత్రాలు, ఋషులు, వివరంగా తెలియచేస్తాను.
ప్రస్తుతం సెలవ్
చాగంటి రాజేశ్వరి





Tuesday, June 3, 2014

అదివో ... అల్లదివో ... శ్రీహరి వాసము

అదివో ... అల్లదివో ... శ్రీహరి వాసము  
 (ఆర్తితో,ఆశలతో,  శ్రమదమముల కోర్చిఆ దివ్యమంగళ రూపాన్నికనులారా తిలకించాలని తరలివచ్చే భక్తులకీ  గేయం ) 
ఓ  ... తిరుపతి వేంకటదేవా నా ఎదలో నిలువగరావా  ... 
వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేక నే వెడుతున్నా !   వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేక నే వెడుతున్నా!
నీ గర్భగుడిని చేరాకా నీ దివ్యస్వరూపం చూసాకా !  వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేక నే వెడుతున్నా! 
 వెనక్కి వెనక్కి తిరుగుతూ !

వేచి వేచి నీ గుడి ముంగిట పది  ఝాముల ఫై దాకా ! వెంకటేశ నిను వేడుకొనుచు పడిగాపులుగాసాకా ! వేచివేచి!
ఆలయ ప్రవేశమైనాకా,  పలుభక్తులు అడ్డుగ నిలిచాకా ! ఆలయ ప్రవేశమైనాకా పలుభక్తులు అడ్డుగ నిలిచాకా ! 
నీ రూపం కనబడి కనబడకా ! నా మనసా నీపై నిలబడకా !  రూపం కనబడి కనబడక, నా మనసా నీపై నిలబడక ! 
ఒక్క క్షణం ............ ఒక్క క్షణం నిను చూసినంత పూజారులు ప్రక్కకు నెడుతుంటే ! వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేక నే వెడుతున్నా!  వెనక్కి వెనక్కి తిరుగుతూ !

వజ్ర కిరీటం చూసే భాగ్యం కలుగనే లేదూ ! శంఖ, చక్రములు చూసే కోరిక తీరనే లేదూ ! వజ్ర!
వక్షస్థలమున లక్ష్మి ని గాని మెడలో కౌస్తుభ హారం గాని ! వక్ష !
పాదపద్మముల సొగసును గాని చూసే సమయం లేదూ .......   !పాద !
నీ కరుణా వీక్షణ నాపై,  ప్రసరితువనే ఆశతో !  కరుణా వీక్షణ నాపై  ప్రసరితువనే ఆశతో !

వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేక నే వెడుతున్నా! వెనక్కి వెనక్కి తిరుగుతూ !
వెనక్కి వెనక్కి తిరుగుతూ !
వెనక్కి వెనక్కి తిరుగుతూ !
వెనక్కి వెనక్కి తిరుగుతూ !

Saturday, April 26, 2014

ధ్యానం (Meditation ) page 2

Hello welcome  to ojas meditation

ఇంతకుముందు మనం మనస్సు యొక్క మూడు స్థితులు (state) వాటికీ అనుగుణంగా ధ్యానం లో (3) దశలు ఉన్నాయి అని చెప్పుకొన్నాం - 1. ధారణ   2. ధ్యానం  3. సమాధి

ధారణ (Keeping mind steady, Power of retention ) :  మనస్సు అంతర్ముఖం చేసి ఒక భావన (భగవన్మయమైన) మీద కొద్ది సేపు నిలపగాలిగితే దాన్ని "ధారణ "  అంటారు.  "ధారణ" ఆగకుండా తైలధారగా (oil flow ) కొనసాగితే అది "ధ్యానం" అవుతుంది.  
           సాధారణమైన ఏకాగ్రత అంత తొందరగా ధ్యానం లోకి వెళ్ళదు, దానికి సాధన కావలి. 
          మనస్సును అంతర్ముఖం చేసి ఏదో ఒక భావన మీద మనం మనస్సు ను నిలపటానికి పదే పదే  ప్రయత్నం చెయ్యాలి. ఈ  ప్రయత్నాన్ని "ప్రత్యాహారం" అంటారు.  కొంచెంసేపు కనీసం రెండు మూడు క్షణాలు నిలపగలిగితే  దాన్ని "ధారణ" అంటారు. 
           ఉదాహరణకి నా మనస్సుని ఎదురుగా కనిపిస్తున్న " గ్లాస్ " పై కేంద్రీకరించాను అనుకుందాం, మనస్సు చంచలంగా ఉండి "గ్లాస్" మీద నిలబడదు, నేను మళ్ళా మళ్ళా దాన్ని(మనస్సును)  వెనక్కి తీసుకొచ్చి ఆ "గ్లాస్" పై కేంద్రీకరిస్తాను, అప్పుడు కొంచెం సేపు ఆ గ్లాస్ మీద దృష్టి  మళ్ళి దానిమీద నిలబడుతుంది ఇది  ధారణ
                ఇంక ఆ "గ్లాస్" పైనే మనస్సు దృడంగా ఉండి  అటూ ఇటూ ఎక్కువగా కదలకుండా ఏకాగ్రంగా కొద్ది సేపు ఉంటే దాన్ని "ధ్యానం" అంటారు. 
                 కొంతకాలానికి  "నాకూ  ఆ గ్లాస్ కు " భేదం పూర్తిగా సమసిపోయి "నా మనస్సు గ్లాసు ఏకమై" ఆ రెండింటికి ఏ విధమైన భేదం కనిపించదు, నీ మనస్సు, నీ ఆత్మ , నీ inner consciousness  అంతటా గ్లాస్ అయిపోతుంది.  ఇది "సమాధి" స్ధితి.

                   ధ్యానం అంత సులువైన విషయం కాదు వంటబట్టటానికి.  చాలా సాధన కావలి.  మనస్సును కంట్రోల్ చెయ్యాలి.  మనస్సు చెఱువు లాంటిది.  ఆలోచనలు గాలి లాంటివి.  గాలిని ఆపితే గాని చెఱువు ప్రశాంతంగా ఉండదు. చెఱువు ప్రశాంతంగా  అలలు లేకుండా ఉంటేనేగాని చంద్రబింబం చెఱువు లో కనపడదు.   ఆలోచనలని ఆపి మనస్సును కంట్రోల్ చేస్తేనేగాని మనలోపల "చైతన్య శక్తి " (inner consciousness ) మనకి అవగతం (అనుభవం ) లోకి రాదు. 
             ఒకరకంగా చెప్పాలంటే ధ్యానం చేస్తేనేగాని మనస్సు స్వాధీనం లోకిరాదు - మనస్సును స్వాధీనం చేసుకొంటేనేగాని ధ్యానం కుదరదు.  పిచ్చి కుదిరితేగాని పెళ్లిఅవదు - పెళ్లిఅయితేగాని పిచ్చికుదరదు. 
                   మొట్టమొదట మనందరం మన ఆలోచనలోని తప్పుని గుర్తించాలి -   అదేమిటంటే  " నేను ధ్యానం చేస్తాను " ( I do Meditation ) ఇది  తప్పు -- ధ్యానం - వంటచేయటం, పనిచేయటం లాంటిది కాదు - you can  never  do  meditation ).  ఇది ఒక నిర్దుష్టమైన "సహజస్థితి" (natural quality).  ప్రతి మనిషి లోను ఇది అంతర్గతంగా దాగి ఉంటుంది (natural  quality  built in).    ఈ  సహజస్థితి వికసించటానికి (blossom ) మనం మన శరీరాన్నీ, మనస్సుని, రాగద్వేషాలని, కామక్రోధాలని అన్నింటినీ సంసిద్ధం (preparedness) చేసుకోవాలి. ఉదాహరణకి మన ఇంట్లో కుండిలో మనం పెంచుకొంటున్న గులాబి చెట్టు కి మొగ్గలు వచ్చాయి అనుకుందాం, ఆ రోజు మన ఇంట్లో function ఉందని ఆ మొగ్గల్ని మనం వికసింపచేయలేము కదా.  మనం దానికి నీళ్ళు పోస్తాం, ఎరువు వేస్తాం, ఎండ ఎక్కువ తగలకుండా చూస్తాం - దానికి కావలసిన atmosphere create చేస్తాం. అది దానంతటఅదే వికసిస్తుంది.  అలాగే మన మనస్సును మనం ధ్యానానికి  సమాయుత్తం చెయ్యాలి. అప్పుడు ద్యాన కుసుమాలు మీ లోపల వెల్లివిరుస్తాయి. 
మనలోని ఈ శక్తిని జాగృతం (awaken) చేయగలిగితే, ఇంక మనం చెయ్యలేనిది అంటూ ఏమి ఉండదు.  ఏ విద్యని అభ్యసిస్తావో అందులో ఉత్తమ స్తాయిలో ఉంటావు, ఏ ఉద్యోగం చేస్తావో అందులో ప్రధముడిగా ఉంటావు, ఏ మానవతా విలువలు ఉన్నతమైనవో అవి నీలో ఉంటాయి.  ఏ సమాజ శ్రేయస్సు కై పాటుపడతావో దాన్ని సాధించగలుగుతావు.  ఉత్తముడైన మానవుడిగా మనగలుగుతావు.  

శుక్లయజుర్వేద సంహితలో ఒక ప్రార్ధన శ్లోకం ఉంది - ఎప్పుడైనా ద్యానం కుదరనప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు దీన్ని చదువుకొని దీనర్ధం మననం చేసుకొంటే పూర్తిగా ద్యానం లో నిమగ్నం అవుతాం. 
తేజోసి తేజో మయి ధేహి ! వీర్యమసి వీర్యం మయి ధేహి ! 
బలమసి బలం మయి ధేహి ! ఓజోసి ఓజో మయి దేహి !
మనం ధ్యానం లో భగవంతుడిని తలుస్తూ (ఒకవేళ భగవంతుడు వద్దు అనుకుంటే) విశ్వమంతా వ్యాపించిన విశ్వశక్తి ని తలుచుకొని - "నీవు పవిత్రతా స్వరూపుడవు - నన్ను పవిత్రతతో నింపివేయి.  నీవు శక్తి స్వరూపుడవు - నాకు శక్తిని ప్రసాదించు.  నీవు బలవంతుడవు - నాకు బలాన్ని ప్రసాదించు.  నీవు ఓజస్సంపన్నుడవు - నాలో ఓజస్సును నింపు.
ఈ qualities అన్నీ మనం acquire  చేయగలిగితే - మనం పరిపూర్ణ మానవుడిగా వికసిస్తాం.  ఇదే ధ్యానం లో మనకి కలిగే అద్భుత పరిణామం.  

ఇదంతా బాగానే ఉంది అసలు మనసు నిలబడాలికదా ధ్యానం చేయాలంటే  ఇదే ప్రశ్న అర్జునిడికి కూడా వచ్చింది - వెంటనే కృష్ణుడిని అడిగాడు -  ఆయన దగ్గర అన్నిటికి ready made  answers ఉంటాయి కదా -(6-33 to 36)
ప్రశ్న :
 (6-34) చంచలమ్ హి మనః కృష్ణ ప్రమాధి బలవ ధృడమ్! త స్యాహం నిగ్రహం మన్యే వాయో రివ సుదుష్కరం !
ఓ కృష్ణా ! నీవేమో మనోనియంత్రణ గురించి, ఆత్మ సాక్షాత్కారం గురించి చెపుతున్నావు.  కానీ నా మనస్సేమో  కల్లోలంగా ఉంది.  దానిని ఏమాత్రం నిగ్రహించలేకుండా ఉన్నాను!
సమాధానం : 
(6-35) అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ ! అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే !
నీవు చెప్పేది నిజమే! మనసు కల్లోలంగా ఉన్నా సరే,  సరైన పద్ధతులనవలంబించి దాని ద్వారా మనోనిగ్రహం అలవరుచుకోవచ్చు.  అబ్యాస, వైరాగ్యాల ద్వారా కల్లోలంగా ఉన్న మనస్సుని సైతం, స్వాధీనం చేసుకోవచ్చు. అలా  స్వాధీనం చేసుకొని మనలోని ఆత్మకు మూలమైన పరమాత్మ శక్తి తో అనుసంధానం చేయచ్చు. ఆయనే పద్ధతులు కూడా వివరించారు (6-17) మితంగా భుజిచమని, మితంగా వినోదించమని, పని, నిద్ర, మేలుకొని ఉండటం అన్నిటిలో "అతిని" వదిలేయమని etc. 

ధ్యానం ఎప్పుడు చెయ్యాలి - ఎలా చెయ్యాలి - దానికి కావలసినవేమిటి 
ధ్యానం ఎక్కడ,ఎప్పుడు చెయ్యాలి : 
          ధ్యాన సాధనికి కొచెం ఏకాంతమైన ప్రదేశం ఉంటే బాగుంటుంది.  అలా అని హిమాలయలలోకో, అడవుల్లోకో వెళ్ళమని కాదు ఇంట్లోనే కొంచెం గాలి వచ్చే ప్రదేశం, కాస్త గొడవ తక్కువ ఉన్న ప్రదేశం అయితే చాలు.  కాని రోజూ ఒకే ప్రదేశం లో కూర్చోవటం చాల మంచిది. ఆ చోటికి రాగానే మన మనస్సుకి ధ్యానానికి కూర్చుంటున్నాము అని అర్థం అవుతుంది.
ధ్యాన సమయం :
రోజుకు (4) సార్లు ధ్యానానికి అనువైన సమయాలు
1. వేకువఝాము    -- రాత్రి ముగిసి తెల్లవారుతున్న సమయం -- ఉ. 5 గం. నుంచి 6 గం. వరకు
2. మధ్యహాన్నం     -- ఎండ తీవ్రత లలో మార్పులు చెందుతున్న సమయం -- 11 గం. నుంచి 12 గం. వరకు
3. సాయింత్రం        -- పగలు, రాత్రి అవుతున్న సమయం   -- 5 గం.   నుంచి  6 గం.
4. రాత్రి                 -- ప్రశాంతమైన రాత్రి వేళ                      -- 11 గం. నుంచి  12 గం.
          ఈ సమయాలలో పకృతి ప్రశాంతం గా ఉంటుంది.  అంతే కాకుండా ఏదైతే cosmic  energy  మనచుట్టూ ఆవరించి ఉందొ దాని density levels ఎక్కువగా ఉంటాయి,  అవి  మన ధ్యానం లో  ఆత్మ చైతన్యం గా మారి మనలో శక్తి  పెరగటానికి దోహద పడుతుంది.
           కొత్తగా మొదలు పెట్టేవాళ్ళు తప్పనిసరిగా వేకువఝామున చెయ్యాలి. పైన చెప్పిన సమయాలలో మీకు వీలయిన సమయాలు కనీసం రెండయినా ఎంచుకోండి.  ఎంతసేపు అంటే పావుగంట నుంచి గంట వరకు మీకు వీలయినంత సమయం.  రాసి కాదు వాసి ముఖ్యం (quality is important not quantity )
            అలాగే ధ్యానం అయిపోయిన వెంటనే లేవకూడదు. ఒక two minutes  కూర్చుని అరచేతులు కళ్ళ మీద పెట్టుకొని అసలు ఇంతసేపు ధ్యానం లో ఏం జరిగిందో సమీక్షించుకొని లేవాలి.
ఎలా చెయ్యాలి - కావలసినవి ఏమిటి :
         పతంజలి మహర్షి ఒక గ్రంధం వ్రాసారు  అదే " యోగసూత్రాలు"  దాంట్లో రెండో అధ్యాయమైన సాధనాప్రకరణం లో  ధ్యానానికి కావలసిన లక్షణాలు అన్నీ "అష్టాంగయోగం" అని క్రోడీకరించారు.  ఈ   అష్టాంగయోగం లో ఎనిమిది మెట్లు ఉన్నాయి 1. యమం 2. నియమం 3. ఆసనం 4. ప్రాణాయామం 5. ప్రత్యాహారం 6. ధ్యానం 7. ధారణ 8. సమాధి 

ఇందులో 5 నుంచి 8 వరకు అంటే ప్రత్యాహారం నుంచి సమాధి వరకు మనం చర్చించుకున్నాం.  ఇంక యమ,నియమాలంటే మనిషిని మనిషిగా నిలబెట్టేవన్న మాట (శ్రీరామచంద్రుడు లాగ మనం మారాలన్న మాట). ఇవి తరవాత చర్చించుకొందాం.  ఇంక  మిగిలినవి ఆసనం, ప్రాణాయామం.
ఆసనం :
ఏ భంగిమలో ఎలా కూర్చున్నా స్థిరం గాను, ఇబ్బంది లేకుండాను కూర్చోవాలి. వెన్నుముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఇబ్బంది లేకపోతే పద్మాసనం/ సుఖాసనం లో క్రింద కూర్చోండి.  లేదా కుర్చీ లో కూర్చోండి మీ ఇష్టం - కాని రోజు అదే place లో కూర్చోవాలి.  పడుకోని  చేయచ్చా  అంటారా - భేషుగ్గా చేయచ్చు - నిద్ర రాకుండా చూసుకోండి.
ప్రాణాయామం :
            ప్రాణాయామం అంటే గాలిని లోపలి తీసుకోని - కొంచెంసేపు ఊపిరితిత్తులలొ ఉంచి - తిరిగి వదలటం - ఇది 1 : 4 : 2 నిష్పత్తి లో చేయాలి.  ఇది పెద్ద subject  తరవాత చెప్పుకొందాం.
శ్వాస :
          మనకి ధ్యానం లో  శ్వాస చాలా ముఖ్యమైనది .  మనస్సు కు శ్వాసకు చాలా దగ్గరి సంబంధం ఉంది. ఆ రెండూ ఒకదాని మీద ఒకటి పని చేస్తాయి. సమాన వ్యవధులలో చేసే ఉచ్చ్వాస - నిశ్వాసాలు (inhale & exhale ) మన ధ్యానం లో ధ్యేయ విషయం గా (concentration point ) పరిగణించాలి.   గాలిని లోపలి తీసుకొంటూ విశ్వం లోని తేజస్సు(energy ) లోపలి తీసుకొంటునట్లు feel అవండి. రెండుకనుబోమల మధ్య ఆజ్ఞాచక్రం (వీటిగురించి యోగా లో చెపుతాను) దగ్గర లోపలి తీసుకొన్న గాలి ఆగినట్టు feel  అవండి. మళ్ళా శ్వాసను వదులుతూ మీ ప్రేమపూరితమైన పవిత్రమైన చైతన్య ప్రవాహాలను అన్ని వైపులకి పంపుతున్నట్టు అందరు సుఖ శాంతులతో ఉండాలని అనుభూతి చెందండి.  ఈ  విధంగా చేయటం వల్ల మీలో energy levels ఉన్నతస్థాయిలకి చేరటం ఎంతో  సులువు అవుతుంది .

దేన్నీ ధ్యానించాలి :
మీ ఇష్టం.  మీ ఇస్ట దైవం ని ధ్యానించండి. లేదా విశ్వమంతా వ్యాపించిన ఒక మహా కాంతిపుంజం లో ప్రేమ, పరమానందం నిండి ఉన్నాయని ఉహించండి. ఆ కాంతిపుంజం లో మీలోని ఆత్మ ఉందని ఊహించండి.  మీ ఆత్మ తేజం తో మీ హృదయం నిండిపోయింది - క్రమంగా ఆ దివ్య కాంతి మీ శరీరాన్ని, మనస్సును లోపల, బయటా కప్పివేస్తున్నట్టు భావించండి.  ఆ తరవాత సృష్టి మొత్తం లోని అన్నిచోట్లా ప్రకాశిస్తున్న ఒక అనంతమైన తెజోరాశిలో మీలోని తేజం ఒక భాగం అని అనుభూతి చెందండి.   చివరగా మీరొక చిన్న కాంతి గోళంగా మారి ఆ తెజోరాసిలో ప్రకాసిస్తున్నట్లు ఊహించండి.
          ఇలాంటి ఆనందాన్ని పొందలే గాని చదివితే రాదు కదా. జిలేబి తింటేనే కదా రుచి తెలిసేది.
         ప్రయత్నం మొదలు పెట్టండి జిలేబి తినటానికి.  పిండితెవాలి, నానబెట్టాలి, బట్టకి కాజా కుట్టాలి చాలా ఉన్నాయి కదా.  ఎందుకు పుల్లారెడ్డి ఉన్నాడంటారా  - అప్పుడైనా బయటికి వెళ్ళే డ్రెస్ వేసుకోవాలి, బండి తీయాలి, డబ్బులున్నాయో లేదో చూడాలి  -- వగైరా.
next week మరిన్ని విశేషాలతో
మీ రాజేశ్వరి



Wednesday, April 9, 2014

షష్టి పూర్తి


           తెలుగు సంవత్సరములు (60).  ప్రభవ  ..... నుంచి ......     క్షయ వరకు .  మనిషి పుట్టి (60) సంవత్సరాలు పూర్తి అయినప్పుడు తాను పుట్టిన సంవత్సరం మరల వచ్చును.  ఈ  (60) వ సంవత్సరం ప్రతి మనిషి జీవితం లో తిరిగి పుట్టటం లాంటిది.  ఋషులు, మునులు, శాస్త్రము చెప్పినదాన్ని బట్టి ఒక మనిషి జీవితం లో 60 సం " పూర్తి కావటం అంటే ఆ మనిషి తిరిగి పుట్టటం లాంటిది అని, అందువలన,     పుట్టినప్పుడు చేసిన జాతకకర్మలన్నీ తిరిగి జరిపించాలని అంటారు. అందువలన దీన్ని ఆ వ్యక్తి  పుట్టిన సంవత్సరం లో, పుట్టిన నెలలో, పుట్టిన తెదీ (హిందూ పంచాంగం ప్రకారం ) జరిపించాలి.
శాస్త్రం ఇలా అంటుంది
''జన్మబ్దే , జన్మమాసేచ , స్వజన్మదివసే తథా, జన్మర్శేచైవ కర్తవ్యా శాంతి ఉగ్రరధాహ్వాయా; దేవాలయే నదీతీరే స్వగృహే; వా; సుభస్థలే''

          అయితే ఈ శాంతి లకి ఉగ్రరధ హోమము, ఉగ్రరధ  శాంతి అని పేరు. మానవుడి ఆయుర్దాయం 100 సం" అయితే అందులో (60) సం" వ్యక్తిగత ప్రయోజనాలకి కాలం గడచి పోతుంది.  ఈ మిగిలిన జీవితకాలం అయినా ఆధ్యాత్మిక మార్గం  లో పయనించాలని, పరమార్థాన్ని, పరబ్రహ్మను తెలుసుకోవాలని, అపమృత్యు భయం, ఆరోగ్యం కలగాలని ఈ శాంతి చేస్తారు .  ఒక రకం గా ఉగ్రరధ  శాంతి భగవంతుడికి నివేదించుకొనే ఒక ప్రార్ధన -మిగిలిన జీవితకాలం అంతా పరమాత్మ కోసం జీవించాలనుకోవటం. అంతే  కాకుండా శాస్త్రం చెపుతుంది - ఈ శాంతి వల్ల రాబోయే గడ్డు రోజులని చాలా ప్రశాంతం గా గడపచ్చని - ఎందుకంటే వార్ధక్యం ముదలవుతుంది - (60) సం " శారీరక శ్రమ ఇప్పుడు బయటపడుతుంది - మనోబలం చాలా అవసరం అయిన కాలం
        అయితే ఇది  అన్ని పూజలలా కాకుండా మన జన్మలకి కారణమైన గ్రహాదుల ని   ఆవాహన చేస్తాం. 
ఇది  కాలానికి సంబందించినది కూడా కాబట్టి కాలానికి సంబంధించిన అన్ని దేవతా మూర్తులని ఆవాహన చేస్తూ (అంటే మన హిందూ ధర్మంలో ప్రక్రుతి అంతా దైవీ, దేవతా స్వరూపాలు గానే భావిస్తాం) పూజ చేస్తాం. కాలం, గ్రహాలు, గ్రహదిపతులు, గ్రహదిపతుల అధిదేవతలు  ఇలా  అన్న మాట.  వాటి యొక్క వివరణ క్లుప్తం గా ఇలా   ఉంటుంది.. 
తెలుగు సంవత్సరాలు   -- 60       దిక్కులు   --  4      ఆయనాలు  ---  2       ఋతువులు   --   6     మాసములు --  12              పక్షములు  --  2    తిధులు   -- 15    వారములు   --  7      వారదేవాతలు  ఐన  గ్రహాలు -- 7 (గ్రహాలు 9 కానీ ఇక్కడ 7 మాత్రమే )  గ్రహాలకు అధి దేవతలు  -- 7 ఈ అధిదేవతలకి దేవతలు, మృత్యుంజయడు  వగైరా ..... 

సంక్షిప్తం గా ఉగ్రరధ  శాంతి ఇలా చేస్తారు

          తెల్లని నూతన వస్త్రముపై తూర్పు దిక్కుగా 12 గీతలు గీచి వాటిమీద అయిదు గీతలు గీసి మొత్తము 60 గదులు   వచ్చే విధంగా చేస్తారు . వరుసకు 12  అయిదు వరుసలు తూర్పు దిక్కున బియ్యం పోసి కలశం ఉంచుతారు. ప్రభవ  నుంచి  క్షయ వరకు 60 సం " అధిదేవతలతో ఆవాహన చేస్తారు. పైన చెప్పిన దక్షినాయన ఉత్తరాయణ దేవతలను, 6 ఋతువులను  12 మాసములను ఆవాహన చేస్తారు.  పక్షములను,తిదులను  వారములను - వారదేవతలు అయిన - సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని ని ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు - అగ్ని, జలము , భూమి, విష్ణువు ఇంద్రుడు, ప్రజాపతి లని ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు  శివుడు, దుర్గ, కుమారస్వామి, బ్రహ్మ  - ఇంకా ఏకాదశ రుద్రులు, నక్షత్ర దేవతలు  27 యోగములు 11 కరణములు  ఇలా అందరి దేవి దేవతా స్వరూపాలని మృత్యుంజయుని ఆవాహన చేసి  బ్రాహ్మణోత్తములు మంగళాచరనములతొ వేదయుక్తంగా ఈ కార్యక్రమం జరిపిస్తారు.  

         కర్త ధర్మపత్నీ సమేతుడై మంగళస్నానము చేసి నూతన వస్త్రములు ధరించి తూర్పు ముఖం గా పీటపై కూర్చుండి బ్రహ్మ గారు చెప్పినట్లు ఈ  దేవతలందరికీ ధూప, దీప నీరజనాది షోడశోపచార పూజ చేయవలెను, ఇంకా అపమృత్యు నివారణార్థం హోమాల్ని, జపాలని కుడా చేస్తారు. (సుమారు 4---5 గం" పాటు జరుగుతుంది కార్యక్రమం).
   

            పూజా కార్యక్రమం అయ్యాకా బ్రహ్మ గారు భార్యా భర్త   లిరువురిని దండలు మార్చుకోమని  తిరిగి నూతన దంపతుల లా జీవనాన్న్ని సాగించమని చెపుతారు.  అంటే దానర్థం ఇంతవరకు సంసారచక్రం లో అలసిపోయి ఉన్న దంపతులు,  భాద్యతల నుండి విముక్తి పొంది స్నేహంతో,  సామరస్యం తో మిగిలిన జీవితం ఒకరికొకరు తోడుగా ప్రశాంతం గా జీవించమని.

      తరువాత బ్రహ్మలను సత్కరించి బంధుమిత్రులతో విందు ఆరగించవలెను. ఇది శాస్త్రం లో చెప్పిన షష్టి పూర్తి.

          విదేశాలలో ఉండేవాళ్ళు , అవకాశం లేనివాళ్ళు, ఆర్ధిక స్తోమత లేనివాళ్ళు ఉండచ్చు - మరి అలాంటప్పుడు ఏం చెయ్యాలి అనుకోవచ్చు - గ్రహాదిపతి ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడికి కొంచెం పాయసం చేసి నైవేద్యం పెట్టి - ఆదిత్యహృదయం, నవగ్రహ స్తోత్రం చదువుకొని, వినాయకుడికి పూజ చేసుకోవచ్చు - ఓపిక ఉంటే   నమకమ్, చమకమ్  CD లు దొరుకుతాయి, అవిపెట్టుకొని శివుడికి అభిషేకం, నీళ్ళతో పాలతో చేసుకోవచ్చు =  బందుమిత్రులతో కలసి సత్యనారాయణవ్రతం CD  కూడా దొరుకుతుంది - అది పెట్టుకొని చక్కగా ప్రసాదం చేసుకొని పూజ చేసుకోవచ్చు - మనస్సుని కాసేపు భగవత్ ధ్యానానికి వినియోగించండి - ఈ బ్రతుకునిచ్చిన పరమేశ్వరుడికి కృతఙ్ఞతలు చెప్పుకోండి చాలు.

          ఈ  మధ్య   అందరు  షష్టి పూర్తి అనగానే పార్టీ చేసుకోవటం, కేక్ కట్ చేయటం, బహుమతులు ఇచ్చుకోవటం, విహరయత్రాలకి వెళ్ళటం వంటివి చేస్తున్నారు - ఇవన్నీ సరదాకి వాళ్ళ ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు.  కానీ షష్టిపూర్తి  ని శాస్త్రాలు ఎందుకు చేసుకోమన్నారో దాని  అర్థం తెలుసుకొని - పెద్దవాళ్ళు ఆ ప్రకారం చేసుకొంటె  మన ముందు తరాల వాళ్ళకి అర్థం అవుతుంది.  
శెలవు
రాజేశ్వరి