Friday, March 20, 2015







అనంతకాలన్ని ఆరు భాగాలు చేసి (సంవత్సరం,ఆయనం,ఋతువు, మాసం,పక్షం,రోజు ) ఆరు ఋతువుల్లో అందమైన ఆమనిలో వచ్చే, ఆరు రుచుల పండగే ఉగాది

మన్మధనామ సంవత్సర ఉగాది  శుభాకాంక్షలు

ఉగాది వచ్చింది అంటే ప్రకృతి  పరవశం తో వళ్ళు విరుచుకొంటుంది
కోయిల గానం తో మేలుకోలిపితే
చెట్లు పూల సుగంధాలతో, తియ్యని ఫలాలతో స్వాగతిస్తాయి
నదీ, నదాలు అమృతధారలు కురిపిస్తాయి
వీటన్నిటిని తీయగా, తృప్తిగా, ఆనందంగా మనం ఆ స్వాదించటానికి
"మన్మధుడు " తానే  స్వయంగా మనోరంజకుడై
"చైత్రరదానెక్కి " మనముందుకి వస్తున్న ఈ నూతన సంవత్సర  శుభవేళ
  నా  ఆత్మీయులందరు   ఆయురారోగ్యఐశ్వర్యాలతో ఉండాలని కోరుకొంటూ
              అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు  

Friday, October 31, 2014

శివపంచయతన పూజ


సంక్షిప్త శివపంచాయతన పూజ

కార్తీకమాసం లో అందరికి శివుడికి తప్పకుండా అభిషేకం చెసుకొవలనిపిస్తుంది . చాలామంది శివాలయాలలో చేయించుకుంటారు ; కొంతమంది బ్రాహ్మణున్ని ఇంటికి పిలిపించి రుద్రాభిషేకం చేయించుకొంటారు , కాని అందరికి రోజు ఇంట్లో చేసుకోవాలని ఉంటుంది. టైం ఎక్కువ పడుతుంది వీలుకాదు అనుకొంటారు.  అందువల్ల అందరు ప్రతినిత్యం అభిషేకం, శివార్చన చేసుకొనేందుకు వీలుగా సంక్షిప్తం గా ఈ శివపూజా విధానం, నమకములోనివి, చమకములోనివి, కొన్ని ముఖ్యమైన మంత్రము లను చేర్చి పాణిమంత్ర విధ బిల్వార్చన తో ఇవ్వబడింది. ఈ పూజావిదికి 15 !ని!  మించి పట్టదు.
ముందుగా నిత్యపూజా విధానం లో చెప్పబడ్డ దీపారాధన, ఆచమనీయమ్, సంకల్పం, కలశపూజ, గణపతి పూజ చేసుకోవాలి.


ఓం శ్రీ మహా గణాధిపతయే నమః !!!  ఓం శ్రీ గురుభ్యో నమః !!!  
 హరిః  ఓం  !!  ఓం నమః శివాయ: !!!

అపవిత్ర :  పవిత్రోవా  సర్వావస్థాఙ్గతో  పివా  !!! య స్మరేత్పుణ్డరీకాక్షం సబాహ్యాభ్యంతర స్సుచి: !!!
పుండరీకాక్ష     పుండరీకాక్ష     పుండరీక్షాయనమః
(పై మంత్రం చెపుతూ తలమీద మూడు సార్లు నీళ్లు చల్లుకోవాలి )

తరవాత నమస్కరిస్తూ ఈ క్రిందిశ్లోకం చదువుకోవాలి

ఓం దేవీం వాచ  మజనయంత  దేవా  !!! స్తాం  విశ్వరూపా: : పసవో వదన్తి  !!!  సానో  మంద్రేష   మూర్జందుహానా!!
ధేనుర్వాగ  స్మా నుపసుష్టుతైతు  !!!

అయం ముహూర్తస్సు  ముహూర్తోస్తు
ప్రాణప్రతిష్టాపన మంత్రం :-  

పూజావిధానం
ఓం శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం !! ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ  విఘ్నోప  శాంతయే !!
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ !! విద్యాబలం  దైవబలం తదేవ లక్ష్మీపతే తే  జీన్ఘ్రియుగం స్మరామి !!
లాభస్తేషాం జయస్తే షాo కుతస్తేషాం పరాభవ !! యేషా మిందీవరశ్యామో హృదయ స్థో జానార్ధనః !!
ఆపదాపహర్తారం దాతారం స్వర్వసంపదామ్ !! లోకాభిరామం శ్రీ రామం భూయోభూయో నమామ్యహమ్!!
సర్వమంగళ మాంగళ్హ్యే శివే సర్వార్ధ సాధికే  !  శరణ్యే  త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే !!
యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్ధ్ర్డోధనుర్ధరః !! తత్రశ్రీ ర్విజయోభూతి ద్ధ్రువానీతి ర్మతిర్మమ !!

ఓం శ్రీ లక్ష్మి నారాయణాభ్యాం  నమః !! ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః !! ఓం శ్రీ వాణిహిరణ్య గర్భాభ్యాం నమః !!  ఓం శ్రీ శచీ పురంద రాభ్యాం నమః !!  ఓం శ్రీ ఇంద్రా ద్యష్ట దిక్పాలక దేవతాభ్యోనమః !! ఓం శ్రీ ఆదిత్యాది నవగ్దవతాభ్యోనమః !! ఓం శ్రీ గ్రామదేవతాభ్యోనమః !! ఓం శ్రీ క్షేత్రాధిష్ఠాన దేవతాభ్యోనమః !! ఓం శ్రీ కులదేవతాభ్యోమమః !! ఓం శ్రీ అరుంధతీ వసిస్తాభ్యాంనమః !! ఓం శ్రీ మాతా పితృభ్యాంనమః !!
 ఓం శ్రీ సర్వేభ్యోమహాజనేభ్యోనమః !! ఓం శ్రీ సద్గురుభ్యోనమః !!
ఓం ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసామ్  !!  కురుఘంటారవం తత్రదేవతాహ్వాన లాంచనమ్ !!
(ఘంట వాయించవలెను)
ఓం భోదీప ! బ్రహ్మరూపేణ సర్వేషాం హృదిసంస్థితః !  అతస్త్వామ్ స్థాపయామ్యద్యమద  జ్ఞానమపాకురు !!
(దీపము వెలిగించి పుష్పాక్షతలచే అలంకరించండి )
పృథ్వి ! త్వయాధృతా లొకాః  దేవి ! త్వం విష్ణునాధృతా !  త్వంచ ధారయ మాందేవి ! పవిత్రం కురుచాసనమ్ !!
(కూర్చున్న ఆసనం క్రింద కొంచెం అక్షతలను వేయండి భూదేవికి నమస్కరించండి )
ఆచమనము

(ఈ క్రింది నామములు చెప్పి మూడు సార్లు జలము తీసుకోండి )
ఓం కేశవాయస్వాహా ! ఓం నారాయణాయ స్వాహా ! ఓం మాధవాయ స్వాహా !
ఓం గోవిందాయ నమః  (అని చేతులు కొంచెం జలం తీసుకొని చేతులు  కడుగుకొండి )
ఓం విష్ణవే నమః ! ఓం మధుసూదనాయ నమః ! ఓం త్రివిక్రమాయ నమః !
ఓం వామనాయ నమః ! ఓం శ్రీధరాయ నమః !ఓం హృషీకేశాయ నమః !
ఓం పద్మనాభాయ నమః ! ఓం దామోదరాయ నమః ! ఓం సంకర్షణాయ నమః !
ఓం ప్రద్యుమ్నాయ నమః ! ఓం వాసుదేవాయ నమః ! ఓం అనిరుద్ధాయ నమః !
 ఓం పురుషోత్తమాయ నమః ! ఓం అధోక్షజాయ నమః ! ఓం నరసింహాయ నమః !
ఓం అచ్యుతాయ నమః ! ఓం జనార్ధనాయ నమః ! ఓం ఉపేంద్రాయ నమః !
ఓం హరయే నమః ! ఓం కృష్ణాయ నమః !
!!శ్లో !!     ఓం ఉత్తుష్టంతు  భూతపిశాచా : ఏతే  భూమిభారకాః !
  ఏతేషామవిరోధేన  బ్రహ్మకర్మ  సమారభే  !!
(అక్షతలు వాసనా చూసి ఎడం వైపుగా వెనుకవేసుకోవాలి )
ప్రాణాయామము 
ఓం భూ :, ఓం భువః , ఓం సువః , ఓం మహః , ఓం జనః , ఓం తపః , ఓగ్o సత్యం ,
ఓంతత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్యధీమహి ! ధియోయోనః ప్రచోదయాత్ !
ఓం అపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ !!
( పై మంత్రం చెపుతూ బొటనవేలు , మధ్యమ, ఉంగరం వ్రేళ్ళతో ముక్కు పట్టుకొని శ్వాస పీల్చి కొంచెం సేపు నిలిపి తరవాత వదిలేయాలి తరవాత ఉద్దరిని తో నీటిని తీసుకొని చెయ్యి కడుగుకోవాలి )
సంకల్పము 
( చేతిలో పుష్పాక్షతలు తీసుకొని కుడికాలి తొడమీద ఎడమ చేయి క్రింద, కుడిచేయి పైన ఉండేలా సంకల్పము అయ్యేవరకు పట్టుకోవాలి)
మమో పాత్త  సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్జ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః  ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరత వర్షే భరత ఖండే  మేరో: దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య  _____(ఈశాన్య) ప్రదేశే కృష్ణా గోదావరి(కావేరి)  మధ్య దేశే స్వగృహే(శోభనగృహే) సమస్త దేవతా బ్రాహ్మణ హరిహరగురు చరణ సన్నిదౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ______(దుర్ముఖి నామ) సంవత్సరే _______(దక్షిణాయనే) _____(శరత్ఋతౌ ) _______(కార్తీకమాసే ) _______పక్షే (అమావాస్య నుంచి పౌర్ణమి వరకు శుక్ల పక్షం -- పౌర్ణమి నుంచి అమావాస్య వరకు కృష్ణ (శుద్ధ) పక్షం) ________తిదౌ _______వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిదౌ  __________ గోత్ర:(గోత్రస్య /గోత్రావతి )    శ్రీమాన్/శ్రీమాత _________(పేరు) నామధేయస్య /నామధేయవతి (మమ యజమానస్య (భర్త పేరు ) / మమ  ధర్మపత్ని సమేతస్య )  అస్మాకం  సహ కుటుంబానాం  క్షేమ, స్థైర్య , ధైర్య, విజయ, అభయ, ఆయు , ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ద్యర్ధం, మనోవాంఛా ఫల సిద్ధ్యర్ధం, భక్తి, జ్ఞాన , వైరాగ్య , యోగ ప్రాప్యర్ధం, యే యే  గ్రహా : అరిష్టస్థానేషుస్థితా: తేషాం నవానాం, గ్రహాణాం శుభ ఏకాదశ స్థానఫల ప్రాప్యర్ధం శ్రీ సాంబసదాశివ దేవతా, శ్రీ ఉమామహేశ్వర దేవతా ప్రీత్యర్ధం అవాహతేభ్య స్సర్వేభ్యో దేవేభ్య: -- సంభవద్భి: ద్రవ్యై:, సంభవద్భ: పదార్డయై , సంభవద్భి ఉపచారై:  సంభవిత నియమేన శ్రీ రుద్రసూక్త విధానేన యావచ్ఛక్తి ధ్యాన అవాహనాది షోడశోపచార పూజామహంకరిష్యే .
(చేతిలోని పుష్పాక్షతలు దేవునిపై వేసి నమస్కరించవలెను )
ధ్యానం 

!!శ్లో !!             శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం 
                       శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయధం దక్షభాగే వహంతమ్ 
                       నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం  సాంకుశం వామభాగే 
                       నానాలంకారయుక్తం  స్పటికమణినిభం పార్వతీశం నమామి !!

!!శ్లో !!            ఆ పాతాళ నభ: స్థలాన్త   భువన బ్రహ్మాండ మావి: స్పుర
                       జ్యోతి స్పాటిక లింగ మౌళి విలస  త్పూ ర్ణేందు వాన్తామృతైః
                       అస్తోకాప్లుత మేక మీశ మనిశం - రుద్రానువాకా  ఙ్ఞపేత్   
                        ద్యాయే   దీప్సిత సిద్ధయే ద్రువపదం;   విప్రోభిషించే చ్చివమ్ 

                       బ్రహ్మాండ వ్యాప్తదేహా, భసిత హిమరుచా, భాసమానా భుజంగైః
                        కంఠేకాలాః , కపర్దా, ;కలితశశికలా , శ్చన్డ్ కోదండ  హస్తాః
                         త్ర్యక్షా  రుద్రాక్షమాలా , సులలితవపుష  ,  శ్శాంభవా , ముర్తిభేదా:
                        రుద్ర శ్రీ రుద్ర సూక్త - ప్రకటితవిభవా: -   నః  ప్రయచ్ఛన్తు సౌఖ్యమ్  

ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! ధ్యాయామి ! ధ్యానం  సమర్పయామి !
ప్రాణప్రతిష్టాపన మంత్రం :-  
 అసునీతే పునరాస్మాసు చక్షుః  పునః  ప్రాణ మిహినో హి భొగమ్
జ్యోక్ప శ్యేమ సూర్య ముచ్చరంత మనుమతే మృడయాన స్వస్తి
అమృతం వై ప్రాణా అమృత మాపః ప్రాణానేవ  యధా స్థాన  ముపహ్వ్యతే
స్థిరోభవ ! వరదోభవ ! సుప్రసన్నోభవ ! స్థిరాసనం  కురు !
ఆవాహనం 

 !!మ !! సద్యోజాతం ప్రపద్యామి 

స్వామిన్  సర్వ జగన్నాధ యావత్ పూజా వసావకం ! తావత్ త్వం ప్రీతిభావేన బింబే (లింగే) స్మిన్ సన్నిధిం కురు!

స్థిరోభవ ! వరదోభవ ! సుముఖోభవ ! సుప్రసన్నొభవ ! స్థిరాసనం కురు ! (అక్షతలు)

ఆసనం 

!!మ !! సద్యో జాతాయ వై నమోనమః !! 

భాస్వన్మౌక్తిక తొరణే , మరకత స్తంభాయుతాలంకృతే ! సౌదే దూపే సువాసితే, మణిమయె, మాణిక్య దీపాంచితే !
మాణిక్య సింహాసనే ! సుస్థిరొ భవ ! శ్రీ మహేశ్వరాయ నమః ! సువర్ణ రత్నఖచితసింహాసనం సమర్పయామి !

ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !కార్తీక దామోదరాయ నమః ! ఓం మహేశ్వరాయ నమః  ! ఆసనం సమర్పయామి

పాద్యమ్

!!మ !!    ! భవే భవే  నాతి  !
పాద్యం గృహాణ దేవేశ ! మమ సౌఖ్యం వివర్దయ ! భక్త్యా సమర్పితం దేవ ! లోకనాధ నమోస్తుతే !
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! కార్తీక దామోదరాయ నమః! ఓం శంభవే  నమః ! పాదయోః పాద్యం సమర్పయామి

అర్ఘ్యం 

!!మం !!  భవే భవస్వ మామ్ !!


వ్యక్తా, వ్యక్త స్వరూపాయ, హృషీకపతయే నమః ! మయా నివేదతో  భక్త్యా అర్ఘ్యోయం ప్రతిగ్రుహ్యతామ్ !
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! కార్తీక దామోదరాయ నమః! హస్తయోః అర్ఘ్యం సమర్పయామి !

ఆచమనీయమ్ 

!!మ!!  భవోద్భావాయ నమః !


కర్పూర వాసితం తోయం మన్దాకిన్యాః సమావృతం
మృత్యుంజయ, మహాదేవ, శుద్ధ ఆచమనం సమర్పయామి !
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! కార్తీక దామోదరాయ నమః! ముఖే ఆచమనీయం సమర్పయామి !

మధుపర్కం 

గుడ దదిసహితం, మధుప్రకీర్ణ, సుఘృత సమన్విత దేను దుగ్ధయుక్తం !శుభకర మధుపర్కం సమర్పయామి


స్త్నానం, పంచామృతస్త్నానం , అభిషేకం

!!మ !! వామదేవాయ నమః  !! స్నపయామి !! (రుద్రనమకం)

!!మ !! ఓం  నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరయ, మహాదేవాయ, త్ర్యంబకాయ  , త్రిపురంతకాయ, త్రికాలాగ్ని కాలాయ, కాలాగ్ని రుద్రాయ, నీలకంఠాయ, మృత్యుం జయాయ, సర్వేశ్వరాయ, సదా శివాయ, శ్రీమన్  మహాదేవాయ నమః !

హర హర మహాదేవ శంభో శంకర  (గంట వాయిస్తూ )

 !!మం !! నమ స్సోమాయ చ  రుద్రాయ చ, నమ స్తామ్రాయ చారుణాయ చ. నమ శ్సంగాయ చ పశుపతయే చ,నమ ఉగ్రాయ చ భీమయ చ,  నమో అగ్రేవధాయ  చ దూరేవదాయ చ, నమో  హంత్రే చ, హనీయసే చ, నమోవృక్షేభ్యో హరి కేశేభ్యో, నమ స్తారాయ, నమ శ్సం భవే  చ మయోభవే  చ, నమశ్శంకరాయ చ మయ స్కరాయ చ, నమశ్శివాయ చ, శ్శివతరాయ  చ, నమ స్తీర్యాయ చ కుల్యాయ చ, నమ పార్యాయ చ వార్యాయ చ, నమ ప్రతరణాయ చోత్తరణాయ చ,  నమ ఆతార్యాయ చాలాద్యాయ చ, నమ శ్శ ష్ప్యాయ చ  ఫేన్యాయ చ, నమ స్పికత్యాయ చ  ప్రవాహ్యాయ  చ !! 

!!మం !!  త్ర్యంబకాయ  యజామహే సుగంధిం పుష్టి  వర్ధనం ! ఉర్వారుకమివ బంధనాన్ మృత్యో ర్ముక్షియ మామృతాత్ ! యోరుద్రో అగ్నౌ యో అప్సు య ఓషధీషు యో రుద్రో విశ్వాభువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు!  నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి ! 

(రుద్రచమకం)

!!మం!! శం చ మే మయశ్చ మే ! ప్రియం చ మే ! కామశ్చ మే ! సౌమనసశ్చ మే ! భద్రం చ మే   శ్రేయశ్చ మే వస్యశ్చ మే   యశశ్చ మే భగశ్చ మే ద్రవిణం చ మే ! యంతా చ మే ! ధర్తా చ మే క్షెమశ్చ మే ధ్రుతిశ్చ  మే విశ్వం చ మే  మహశ్చ మే ! సంవిచ్చ మే జ్ఞాత్రం  చ మే  సూశ్చ మే ! ప్రసూశ్చ మే సీరం చ మే ! లయశ్చ మ ! ఋతం చ మే 
 మృతం చ మే ! యక్ష్మం చ మే ! అనామయశ్చ మే ! జీవాతుశ్చ మే ! దేర్ఘాయుత్వం చ మే ! అనమిత్రం  చ మే !అభయం చ మే ! సుగంచ మే  శయనం చ మే ! సూషా  చ మే ! సుదినం చ మే ! 

!!మం!!  ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః ! 
              భవే భవే నాతి భవే భవస్య మాం ! భావోధ్బవాయ నమః !

!!మం !! ఓం వామదేవాయ నమో జ్యేష్టాయ నమః  శ్రేష్టాయ  నమో 
             రుద్రాయ నమః కాలాయ నమః  కలవికరణాయ నమో 
             బలవికరణాయ నమో బలాయ నమో 
             బలప్రమధనాయ నమస్సర్వ భూతదమనాయ నమో 
              మనోన్మనాయ నమః !

!!మం !!  అఘోరేభ్యో ధఘోరేభ్యో ఘోరే ఘోరతరేభ్యః !
               సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః ! 

!!మం !!  ఈశాన సర్వ విద్యానా మీశ్వర సర్వ భూతానాం 
               బ్రహ్మాధిపతి   బ్రహ్మనోదిపతిర్ 
                బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం !!  
పురుషోవై  రుద్రః  సన్మహొ నమో నమః ! విశ్వం భూతం భువనం చిత్రం బహుధా  జాతం జాయ మానం చ యత్ సర్యోహ్యేష  రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు ! కద్రుద్రాయ ప్రచేతసే మీడుష్ట మాయ తవ్యసే ! వోచేమ శంతమగ్o   హృదే ! సర్యోహ్యేష  రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు ! 

మహాదేవ, మహాదేవ, మహాదేవ, దయానిధే 
భవానేవ,  భవానేవ, భవానేవ, గతి ర్మమ 

ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !కార్తీక దామోదరాయ నమః ! ఓం మహేశ్వరాయ నమః  ! పంచామృత తధా శుద్దోదక స్త్నానం సమర్పయామి !!


(శివలింగాన్ని ఎడమచేతితో పట్టుకొని ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ కుడిచేతితో నీటిని పోస్తూ కడిగి తుడిచి కుంకుమ,  పెట్టి మళ్లా యధాస్తానం లో ఉంచాలి)

ఓం ఆపో హిష్టా     మయో భువః తా న ఊర్జే  ధధాతన మహేరణాయ చక్షసే ! యో వః  శివతమో రసః తస్య భాజయతే హ నః  ఉశతీరివ  మాతరః తస్మా అరం గమామ వో యస్య క్షయాయ జిన్వద అపో జనయధా  చ నః !  

ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !కార్తీక దామోదరాయ నమః ! ఓం మహేశ్వరాయ నమః  !
 శుద్దోదక స్త్నానం సమర్పయామి !!

వస్త్రం 

11మం!! జ్యేష్టాయ నమః !!


వేదసూక్త సమాయుక్తే, యజ్ఞ సామ సమన్వితే ! సర్వవర్ణ ప్రదేదేశ వాససీతే, సునిర్మితే!!

ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !కార్తీక దామోదరాయ నమః ! ఓం మహేశ్వరాయ నమః  !వస్త్ర యుగ్మం సమర్పయామి

యజ్ఞోపవీతం
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే ర్యత్సహజం పురస్తాత్ ! ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః !

ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! ఓం మహేశ్వరాయ నమః  ! ఉపవీతం సమర్పయామి

విభూతి (భస్మ ధారణ )

అగ్ని రితిభస్మ,  వాయురితిభస్మ,  జలమితిభస్మ,  స్థలమితిభస్మ వ్యోమేతిభస్మ సర్వగ్o  హవాయ ఇదగ్o  సర్వంభస్మ ! చితాభస్మధరమ్  వామదేవరుద్రం నమామ్యహం 

ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !ఓం సర్వాయనమః   ! భస్మం ధారయామి !

ఆభరణం 

!!మం!!  ఓం రుద్రాయ నమః !!

రుద్రక్షమాల ఆభరణం, నాగేంద్రహార కంకణై:! భుజంగాభరణైర్యుక్తం  గృహాణ అమరవల్లభ
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !ఆభరణం సమర్పయామి   !

చందనం 

!!మం!! కాలాయ నమః !!


శ్రీ ఖండం చందనం దివ్యం, గoధాడ్యం సుమనొహరమ్ ! విలేపనం సురశ్రేష్టం, ప్రీత్యర్ధం 
ప్రతిగ్రుహ్యతాం !

ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !గంధం సమర్పయామి !

అక్షతాన్ 

1మం  ! కలవికరణాయ నమః !!

ఆయనే తే పరయణె దూర్వారోహం తు పుష్పిణీ:! హ్రదాశ్చ పుండరీకాణి  సముద్రశ్చ గృహా ఇమే!
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్, గృహాణ శివ శంకర

ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !అక్షతాన్  సమర్పయామి !

బిల్వపత్రం/ పుష్పం సమర్పయామి

!!మం!! బలవికరణాయ నమః !!
ఓం నిధన పతయే నమ !  ఓం నిధన  పతాంతికాయ నమః !!  
  ఓం ఊర్దాయ నమః ! ఓం ఊర్ధలింగాయ నమః!!
ఓం హిరణ్యాయ నమః ! ఓం హిరణ్య లింగాయ నమః!!   
 ఓం సువర్ణాయ నమః ! ఓం సువర్ణలింగాయ నమః!!
ఓం దివ్యాయ నమః! ఓం దివ్యలింగాయ నమః!!  
  ఓం భవాయ నమః ! ఓం భవలింగాయ నమః !!
ఓం సర్వాయ నమః! ఓం సర్వలింగాయ నమః !! 
 ఓం శివాయ నమః ! ఓం శివలింగాయ నమః !!
ఓం జ్వాలాయ నమః ! ఓం జ్వలలింగాయ నమః !! 
ఓం ఆత్మయ నమః!  ఓం ఆత్మలింగాయ నమః !!
ఓం పరమాయ నమః ! ఓం పరమలింగాయ నమః !!

!! ఏతత్ సోమస్య సూర్యస్య సర్వ లింగ గ్గ్ స్థాపయతి పాణిమంత్రం పవిత్రం !!

ఓం భవాయ దేవయ నమః ! ఓం శర్వాయ దేవాయ నమః !
ఓం ఈశానాయ దేవాయ నమః ! ఓం పశుపతయే  దేవాయ నమః !!
ఓం రుద్రాయ దేవాయ నమః 1  ఓం ఉగ్రాయ దేవాయ నమః  !!
ఓం భీమాయ దేవాయ నమః ! ఓం మహాతే దేవాయ నమః !!
ఓం భవస్య దేవస్య పత్న్యై    నమః! ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః !!
ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః ! ఓం పశుపతయే దేవస్య పత్న్యై నమః !!
ఓం రుద్రస్య దేవస్య పత్న్యై  నమః ! ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః !!
ఓం భీమస్య దేవస్య పత్న్యై  నమః !  ఓం మహతో దేవస్య పత్న్యై నమః !!

ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! నానావిధ పరిమళ పుష్పాణి, బిల్వపత్రాణి   సమర్పయామి !
(ఇక్కడ శివాష్టోత్తర శతనామావళి తో పూజ చేయవచ్చును )

ధూపం

1మం!  బలాయ నమః !! దశాంగం గుగ్గులోపెతం, సుగంధం, సుమనొహరమ్ !  కపిలాఘ్రుత సంయుక్తం, దూపోయం ప్రతిగృహ్యాతాం !
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !ధూపం ఆఘ్రాప యామి   సమర్పయామి !

దీపమ్
!మం! బల ప్రమథనాయ నమః !! సాజ్యం త్రివర్తి సంయుక్తం, వహ్నినాయోజితం ప్రియమ్ ! గృహాణ మంగళం దీపం, నీలకంర ! నమోస్తుతే !
భక్త్యా  దీపం  ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే ! త్రాహి మాం నరకాత్  ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోస్తుతే !!

ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! దీపమ్   సమర్పయామి !

ధూప, దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి !!

నైవేద్యం

!!మం!! సర్వభూత దమనాయ నమః!!
నైవేద్యం షడ్రసోపేతం , ఫల లడ్డూక సంయుతం ! రాజన్నం సూపసంయుక్తం, శాక చోష్య సమన్వితం!  ఘ్రుత భక్ష్య సమాయుక్తం నైవేద్యం ప్రతి గృహ్యాతాం !!

ఓం భూర్బువస్సువః  తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ !!

సత్యంత్వర్తేనా పరిషించామి ! అమృతమస్తు ! అమ్రుతొపస్తరణమసి !

ఓం సద్యోజాత ముఖాయ స్వాహా ! ఓం వామదేవ ముఖాయ స్వాహా ! ఓం అఘోర ముఖాయ స్వాహా ! ఓం తత్పురుషాయ ముఖాయ స్వాహా ! ఓం ఈశాయ ముఖాయ స్వాహా !

ఓం ప్రాణాయ స్వాహా ! ఓం అపానాయ స్వాహా ! ఓం వ్యానాయ స్వాహా ! ఓం ఉదానాయ స్వాహా ! ఓం సమానాయ స్వాహా ! ఓం బ్రహ్మణే   స్వాహా !
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి!   అమృతా పిథానమసి ! ఉత్తరాపోశనం సమర్పయామి!  హస్తౌ ప్రక్షాళయామి ! పాదౌ ప్రక్షాళ యామి ! శుద్ధ ఆచమనీయం సమర్పయామి !

తాంబూలం 

!మం! మనోన్మనాయ నమః!!
పూగీఫల సమాయుక్తం, నాగవల్లీ దళర్యుతం ! కర్పూర చూర్ణ సంయుక్తం, తాంబూలం ప్రతిగృహ్యాతాం !
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! తాంబూలం    సమర్పయామి !

కర్పూర నీరజనమ్

ఓం అఘోరెభ్యొ ధఘోరేభ్యో ఘోర ఘోర తరేభ్యః ! సర్వేభ్య స్సర్వ సర్వే భ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్యః !!
నీరాజనం మయాదత్తం కర్పూరేణ సమన్వితం తుభ్యం  దాస్యామహమ్ దేవం సర్వలోక పూజితే !!
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !కర్పూర నీరాజనం   సమర్పయామి !

మంత్రపుష్పం 

ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వైశ్రవణాయ కుర్మహే !  సమే కామాన్ కామ కామాయ మహ్యం  కామేశ్వరో వైశ్రవణొ దధాతు ! కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః !
ఓం తద్బ్రహ్మ ! ఓం తద్యాయుః  ! ఓం తదాత్మా ! ఓం తత్సత్యం ! ఓం తత్సర్వం ! ఓంతత్పురోర్నమః ! అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వముర్తిషు !
త్వం యజ్ఞస్త్వం  వషట్కారః త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః ! త్వం తదాప ఆపో జ్యొతీ రసోమృతం బ్రహ్మ  భూర్భువస్సువరొమ్ !

నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ  హిరణ్యరూపాయ హిరణ్యపతయెంబికా పతయ ఉమాపతయే  పశుపతయే నమో నమః !!

ఋతగ్o  సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగలమ్ !  ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః !

ఓం స్వస్తి సామ్రాజ్యం భోజ్యం స్వారాజ్యం వైరాజ్యం ! పారమేష్ట్యం రాజ్యం మహారాజ్య మాదిపత్యమయం !సoమత పర్యా ఈస్యాత్ ! సార్వభౌమ స్సార్వాయుషః !  అందాతాపరార్ధాత్  ప్రుధివ్యై  సముద్రపర్యంతాయా ! ఏకరాదితి తడష్యేష  శ్లోకో  భవతి !మరుతః  పరివేష్టారో మరుత్తస్యా వసన్న్గ్రుహే ! ఆవిక్షితస్య కామప్యే రిశ్వేదేవా స్సభాసద  ఇతి !అదైతం విష్ణువే చరుం నిర్వపతి యజ్ఞోవై విష్ణుః ! యజ్ఞ ఏవాం తతః  ప్రతితిష్ఠతి !
సొత్రజుహొతి  - విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా  ప్రతిష్టాయై  స్వాహేతి !!

ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ దిమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ !
ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి దిమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్ !

ఈశాన స్సర్వ విద్యానాం ఈశ్వర స్సర్వ భూతానాం ! బ్రహ్మధిపతి ర్బ్రహ్మణొ దిపతిర్బ్రహ్మ శివోమే స్తు సదాశివొమ్ !

ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! దివ్య మంత్రపుష్పం    సమర్పయామి !

ఆత్మ ప్రదక్షిణ నమస్కారము

యానికాని చ పాపని జన్మాంతర కృతానిచ ! తాని తాని ప్రనశ్యంతి  ప్రదక్షణ పదేపదే !
పాపోహం, పాప కర్మణాం, పాపాత్మ, పాపసంభవ ! త్రాహి మాం క్రుపయదేవ శరణాగత వత్స్చల !అన్యధా శరణం నాస్థి  త్వం ఏవ  శరణం మమ !  తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష మహేశ్వర !

ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! ఆత్మ  పూర్వక నమస్కారం    సమర్పయామి !

క్షమా ప్రార్ధన
ఆవాహనం న జానామి న జానామి విసర్జనం ! పూజాం చైవ న జానామి క్షమస్వ పరమేశ్వర
అపరాధ సహస్రాణి క్రియంతే  అహర్నిశం మయా ! దాసొయమితి మాం  మత్వా క్షమస్వ పరమేశ్వర !
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! క్షమార్పణ నమస్కారం    సమర్పయామి !

ఛత్రం ధారయామి! చామరం వీజయామి!దర్పణం దర్సయామి ! నృత్యం దర్సయామి ! గీతం శ్రావయామి ! ఆందోళికనారోహయామి ! అశ్వానారోహయామి ! గజానారొహయామి ! సమస్త రాజోపచార శక్త్యుపచార, భక్త్యుపచార మంత్రోపచార సర్వోపచార పూజాం సమర్పయామి !

పూజా సమర్పణం

యస్య స్మృత్యాచ నమోక్త్యా తపః పూజాక్రియా ధిషుః !  న్యూనమ్ సంపూర్ణతాం  యాతి సద్యో వందే తం  అచ్యుతం !
మంత్రహీనం, క్రియాహీనం, భక్తీహీనం మహేశ్వర ! యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే !!

అనయా ద్యానావాహనాది షోడశోపచారపూజయా చ భగవాన్ సర్వాత్మకః !  శ్రీ ఉమామహేశ్వర దేవతాసుప్రీత స్సుప్రసన్నొ వరదో భవతు  ! శ్రీ స్వామి ప్రసాదసిద్ధి రస్తు !

 శ్రీ ఉమామహేశ్వర దేవతా ప్రసాదం శిరసా గృహ్నామి ! స్వస్తి !!

!!సర్వం శ్రీ పరమేస్వరార్పణమస్తూ !!

కాయేన వాచా మనసెంద్రియైర్వా ! బుధ్యాత్మనా  వా ప్రకృతే  స్స్వభావాత్ ! కరోమి యద్యత్ సకలం పరస్మై !మహేశ్వరాయేతి  సమర్పయామి !!

ఓం సహ నావవతు ! సహ నౌ భునక్తు ! సహ వీర్యం కరవావహై ! తేజస్వినావధీతమస్తూ! మా విద్విషావహై !

ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్  పూర్ణముదచ్యతే ! పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే !!


ఓం శాంతిః   శాంతిః  శాంతిః  





































  

Thursday, September 18, 2014

"సుందర" గీత

ప్రపంచంలో మనుషులకి, దేముడికి పుట్టినరోజులు జరుపుకోవటం అనాదిగా వస్తున్న అలవాటు.  కాని పుస్తకాలకి పుట్టినరోజు జరుపుకోవటం అనే కీర్తి, భాగ్యం ఒక్క శ్రీమద్భగవద్గీత  కే  దక్కింది.  గీతాజయంతి అంటే గీత పుట్టినరోజు "మార్గశిర శుద్ధ ఏకాదశి"  నాడు జరుపుకుంటాము.  సుమారు 5025 సం. పూర్వము సాక్షాత్తు భగవంతుడే స్వయంగా ఉపదేశించి గానం చేసిన గీత.  గీత చెప్పినవాడు నారాయణుడు, విన్నవాడు నారాయణుడు, వ్రాసినవాడు నారాయణుడు.  ఈ  మాట కూడా స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే 10 వ అధ్యాయం లో చెప్పారు.  
"వృష్టీనామ్ వాసుదేవోస్మి పాణ్ణవానాం  ధనంజయః 
మునీనామప్యహం వ్యాసః కవీనా ముశన కవి:"
నేను వృష్టి వంశస్థులగు యాదవులలో వాసుదేవుని కుమారుడగు శ్రికృష్ణుడను, పాండవులలో అర్జునడను, మునులలో వేదవ్యాస మునీంద్రుడను, కవులలో శుక్రాచార్యుడను నేనే అయి ఉన్నాను.  అందువల్ల గీత విన్నట్టి అర్జునుడు, వ్రాసిన వ్యాసుడు ఇరువురు భగవదవతారులే అని తెలియుచున్నది.  అందుకే గీతకి ఇంతటి ప్రాముఖ్యం. 

శ్రీమద్భగవద్గీత ప్రస్థానత్రయం లో ఒకటి. ప్రస్థానత్రయం అంటే హిందూ వాంజ్ఞ్మయం, సంస్కృతి కి మూడు మూలస్థంబముల వంటివి. 
1. శ్రుతి ప్రస్థానం :- వేదాలు, వేదాంతాలైన ఉపనిషత్తులు 
2. శ్మ్రుతి ప్రస్థానం :-  పురాణాలు, ఇతిహాసాలు, శ్రీమద్భగవద్గీత 
3. న్యాయ ప్రస్థానం :- బ్రహ్మసూత్రాలు, తర్ఖం, మీమాంస 
 1. శ్రుతి ప్రస్థానం:- వేదాలు, వేదాంతాలైన ఉపనిషత్తులు -- ఇవి అపౌరుషీయాలు, అంటే అవి ఎవరిచేతా వ్రాయబడినవికాదు.  అందుచేత అవి "శ్రుతులు" (వినిపించినవి).  మహర్షులు వాళ్ళ తపస్సమాధి లో ఉన్నప్పుడు (seat of meditation) పరమేశ్వరుని ద్వారా విన్నవి.  వాటిని విశ్లేషించి, వారి శిష్యులకి, అక్కడ నుంచి గురు పరంపరగా మనవరకు వచ్చినవి. 
2. శ్మ్రుతి ప్రస్థానం :-  పురాణాలు, ఇతిహాసాలు, శ్రీమద్భగవద్గీత
     ముఖ్యంగా శ్రీమద్భగవద్గీత  ఇది "యోగశాస్త్రం".  ఎందువల్లనంటే ఇందులో సమస్త శాస్త్రాలు ఇమిడి ఉన్నాయి.  ఇందులో సర్వ ఉపనిషత్తుల సారాంశం ఉంది.  భగవంతుడైన శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పిన గీత. 
"స్వర్పనిషదో  గావో దోగ్దా గోపాలనన్దనః 
పార్ధోవత్సః సుధీర్భొక్తా దుగ్ధం గీతామృతం మహత్" 
     ఉపనిషత్తులు అన్నీ గోవులు, మన గోపాలస్వామి పాలుపితుకువాడు, అర్జునుడే దూడ (అమృత ధార వర్షించటానికి ప్రేరకుడు, కారకుడు) గీతామృతమే పాలు, మనమందరం ఆ అమృతాన్ని మన శక్తి మేరకు త్రాగవచ్చు.  
     శ్రీమద్భగవద్గీత , వేదాలలోని సారాంశాన్ని మన నిత్య జీవితానికి అన్వయించుకొని సులభంగా ఆచరించటానికి వీలుగా చెప్పబడింది (it is a manual of life).  శ్రీమద్భగవద్గీత ని మన జీవితానికి అన్వయించుకొంటే మనకి మనో ధైర్యం కలుగుతుంది. మన మనస్సులో సంశయాలు తోలుగుతాయి.  చెయ్యవలసిన కర్తవ్యాన్ని గుర్తిస్తాం, చేసే తెలివి కలుగుతుంది.  జీవితాన్ని సుఖమయం చేసుకోగలుగుతాం. జీవితంలో ఎదురొచ్చే ఉపద్రవాలని ఎదుర్కొగలుగుతాం.  శ్రీమద్భగవద్గీత మన నిత్య జీవితానికి మార్గదర్శి. మనిషికి సందిగ్ధ పరిస్తితులు ఎదురైనపుడు, ఏ పని ఎంతవరకు చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలియనపుడు గీతని ప్రమాణంగా ఎంచుకోవాలి.  మన జీవితాల్ని సమర్ధవంతంగా తీర్చిదిద్దుకొనేందుకు శ్రీభగవానుడే మనందరికోసం గీతోపదేశం చేసారు.  మనం అనుకొనేటట్లుగా స్వర్గానరకాలకి ఎక్కడికో పోము.  శరీరాలు ఎక్కడికి పోవు, వాటివల్ల ఆత్మకి కలిగిన దోషాలకి ఆ శరీరాలకే శిక్ష వేసి సవరించుకోవాలి.  అందుకే కర్మల ననుసరించి జన్మలు అదే శ్రీభగవానుడి ఉపదేశం.  ఆత్మ నశించదు, శరీరం ఏం చేసినా ఉండదు.  ఇదే దేహాత్మ వివేకము. 
      మనకి అందరికి తెలుసు దేహం నశిస్తుంది, ఆత్మ నిత్యం వగైరా, అలాగే గీత కూడా తెలుసు, అర్జునిడి విషాదం, శ్రీకృష్ణుడి బోధ మరెందుకు పదేపదే చదవటం.  ఎందుకంటే మన విషాదం కూడా తగ్గేంతవరకు, మనకి సంపూర్ణ ఆనందం కలిగే వరకు. మనలో ఇంకా విషాదం, బాధ, దుఖం, కోపం ఉన్నాయంటే ఇంకా గీతని మన జీవితానికి అన్వయించుకోలేదని అర్ధం. గీతని ఆచరించగలిగేంతవరకు చదువుతూ అర్ధం చేసుకొంటూనే ఉండండి. ఇందులో (18) అద్యాయలు ఉన్నాయి.  ఒకో అధ్యాయానికి ఒకో యోగం గా అందులో ఉపదేశించిన విషయానికి అనుగుణంగా ఆ పేర్లు  పెట్టారు. మొత్తం గీత  శ్లోకాలు 701 మనకి అందుబాటులో ఉన్నాయి.  ఇది శ్రీమహాభారతం లో భీష్మపర్వం లో ఉంది. 

      రాముడు ఆచరించి చూపించటానికే అవతరించాడు.  అనుసరించే మానవాళి తగ్గిపోతుండటంతో కృష్ణావతారం ఎత్తవలసివచ్చింది.  జ్ఞానంలేని ఆచరణ పుట్టుగ్రుడ్డితనంలా తప్పుదారి పడుతోందని శ్రీభగవానుడే స్వయంగా అవతరించి జ్ఞానోపదేశం చేయటం ధ్యేయంగా పెట్టుకొని, సమయం వచ్చినప్పుడల్లా సదుపదేశాలు అందిస్తూనే ఉన్నారు.  తనమీద నమ్మకం కలగటానికి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు.  పురుషార్ధాలని భోదిస్తూనే ఉన్నారు . పురుషార్ధాలంటే  ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు - ధర్మానికి లోబడిన అర్ధ కామాలు,  మోక్షాన్ని ఇస్తాయి. 

శ్రీమద్భగవద్గీత మొట్టమొదట ధర్మంతోనే మొదలవుతుంది.  
1. అధ్యాయం - అర్జునవిషాదయోగం 
"ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః 
మామకాః పండవాశ్చైవ కిమ కుర్వతి సంజయ"
    ఇది గ్రుడ్డి వాడైన ధృతరాష్ట్రుడు తన బాల్యమిత్రుడు మంత్రి అయిన సంజయుణ్ని అడిగిన ప్రశ్న. అంధకారం లోంచి, అజ్ఞానం లోంచి వచ్చిన ప్రశ్న.  
     అప్పటికి మహాభారత సంగ్రామం మొదలయ్యి (11) రోజులయింది(ఆ రోజు మార్గశిర శుద్ద ఏకాదశి - యుద్ధం మొదలయింది అమావాస్య రోజున)  ఆరోజు యుద్ధంలో భీష్ముడు కూలిపోయాడు.  కౌరవుల సర్వసేనపతి, మృత్యువుకి కూడా లొంగని వీరుడు అయిన భీష్మ ఓటమికి ధృతరాష్ట్రుడు తట్టుకోలేకపోయాడు, కౌరవుల సేన (11) అక్షౌహిణుల సైన్యం, భీష్మ, ద్రోణ, కృపచార్యులు లాంటి యోధాను యోధులు, జయం తననే వరిస్తుందని నమ్మకంతో ఉన్నాడు ధృతరాష్ట్రుడు - అసలు ఏం జరుగుతోందో చెప్పమని సంజయుణ్ని అడిగాడు.  వ్యాసుడి ద్వార దివ్యదృష్టిని పొందిన సంజయుడు యుద్దరంగాన్ని యధాతధంగా వర్ణించి చెప్పాడు. 

  ధృతరాష్ట్రుడు బాహ్యంగాను, అంతరంగం లోను అంధుడే.  అందుకే మితిమీరిన పుత్రవాత్సల్యంతో దురాశతో  నేను, నావాళ్ళు అనే మొహంతో, సాక్షాత్తు శ్రీభగవానుడే స్వయంగా హెచ్చరించినా, వారించినా పెడచెవినిపెట్టి మహాభారతసంగ్రామానికి కారకుడయ్యాడు.  
      ఇక అర్జునుడు వీరుడు, మహాయోధుడు, కౌరవులవల్ల పొందిన అవమానాలకి బదులు తీర్చుకొనేందుకు రణరంగానికి వచ్చినవాడు, కాని అక్కడ తన ఎదురుగా ఉన్న సేనావా హినిలో తాతల్ని, గురువులని, తమ్ములని, స్నేహితులను, బంధువులను, సన్నిహితులని చూసి తట్టుకోలేక పోయాడు. 

"న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖానిచ 
కింనో రాజ్యేన గోవిందా కిం భోగైర్జీవితేనవా " (1-32)
యుద్ధం వద్దు, రాజ్యం వద్దు వీరందరినీ సంహరించేకంటే భిక్షాటనతో జీవించటం మేలు అన్నాడు.  
"గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే" (1-30)
గాండీవాన్ని వదిలేసి కూలబడి పోయాడు. 
   ఇక్కడ కూడా అర్జునుడు నేను, నా వాళ్ళు అనే మొహంతో (అజ్ఞానం ) కర్తవ్యాన్ని మర్చిపోయి విలపించాడు.  అర్జునుడు సుక్షత్రియుడు, యుద్దరంగం లో యుద్ధం చేయటం అతని కర్తవ్యం.  కర్తవ్యాన్ని మర్చిపోయాడు, మొహంతో విషాదం లో మునిగిపోయాడు.  చెయ్యవలసిన పని తప్పని పిస్తోంది, చెయ్యకూడని పని చెయ్యాలనిపిస్తోంది. ఇది సందిగ్ధం, ఇదే అర్జున విషాదం, మనందరి విషాదం కూడా ఇదే.  మొహాన్ని జయించలేకపోవటం.  ఏం చెయ్యాలో తెలియని  అర్జునుడు  భగవంతుణ్ని శరణు వేడాడు. 
"కార్పణ్య దోషోప హత స్వభావః పృచ్చామి త్వాం  ధర్మసమ్మూఢచ్చేతః !
యచ్చ్రేయః స్యాన్నిశ్చితం  బ్రూహి తన్మే శిష్యస్తే హం శాధి మాం త్వాం ప్రసన్నమ్!" (2-7)
 
  పిరికితనంతో నా స్వభావాన్ని కోల్పోయి ధర్మాధర్మ విచక్షణకు దూరమై నా కర్తవ్యాన్ని నిర్ణయించుకోలేక పోతున్నాను నాకు నిజముగా శ్రేయస్కరమైనది ఏదో దాన్ని నాకు తెలియచేయి.  నేను నీకు శిష్యుడను, శరణాగతుడను నాకు  మార్గాన్ని నిర్దేశించు అని అర్జునుడు వేడుకొన్నాడు. 
    ఎప్పుడైతే శిష్యుడు నిజమైన శరణాగతితో వేడుకొంటాడో గురువు మార్గాన్ని తప్పకుండా చూపిస్తాడు. అదే "సాంఖ్యం "(జ్ఞానం ). 
2. అధ్యాయం "సాంఖ్య యోగం "
"అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే !
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ! (2-11)
గీతా ప్రభోదం ఈ శ్లోకం నుంచే మొదలవుతుంది.
అశోచ్యాన్  = శోకింపదగని వారి గురించి 
అంటే ఓ అర్జునా నువ్వు శోకింపదగని వాటి గురించి ఎందుకు శోకిస్తున్నావు. పైగా పెద్ద పండితుడిలా మాట్లాడుతున్నావు. పండితులు, జ్ఞానులు ఎక్కడైనా దుఖిస్తారా? 
    శ్రీకృష్ణభగవానుడి ఉపదేశం  శోకం వద్దు అని మొదలవుతుంది, గీతా ప్రభోదం మొదలు - మళ్ళా చివరి ప్రభోద శ్లోకం అయిన 

"సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ!
          అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః !" (18-66) 
 
ఆఖరి వాక్యం "మా శుచః" అంటే "శోకింపకుము" 
కాబట్టి గీతయొక్క ముఖ్యఉద్దేశ్యం మానవునికి శోకరాహిత్యమే 
    పరమాత్మ  వంక ఒక్క అడుగు మనం వేస్తే చాలు ఆయన 100 అడుగులు మనకోసం వస్తారు. అటువంటిది ఆశ్రయిస్తే ఇంక చెప్పేదేముంది, మనకి మార్గ నిర్దేశకులే అవుతారు.  
మనం ఆయన్ని ఆశ్రయిస్తే చాలు మన ఆజ్ఞా బద్దుడై ఉంటాడు, అనటానికి నిదర్శనం, సకల భువనాలకి పాలకుడైన ఆయన, అర్జునిని కాలి దగ్గర కూర్చొని రధం నడుపుతూ, అర్జునుడు సేన మధ్యలో రధం నిలుపు అని ఆదేశిస్తే అలాగే చేసారు. 
   అర్జునుడు శరణాగతుడై ఏది శ్రేయస్కరమో చెప్పు - (శిష్యస్తే హం శాధి మాం త్వాం ప్రసన్నమ్) అని అడిగితే ఒక్క అర్జునిడి కే కాకుండా సమస్త మానవాళి కోసం శ్రేయస్కరమైన దానిని ఉపదేశించారు. 
 దేహినోస్మిన్ యధా దేహే కౌమారం యౌవనం జరా!
               తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి !               (2-13)

న జాయతే మ్రియతే వా కదాచిత్ 
నాయం భూత్వా భవితా వా న భూయః 
అజో నిత్యః శాశ్వతో యం పురాణో 
                                 న హన్యతే హన్యమానే శరీరే                       (2-20)   

వాసాంసి జీర్ణాని యథా విహాయ 
నవాని గృహ్ణాతి నరోపరాణి 
తథా శరీరాణి విహాయ జీర్ణా 
                                 న్యన్యాని సంయాతి నవాని దేహి                (2-22) 
నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః 
                    న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః         (2-23)
జాతస్య హి ధ్రువో మృత్యుః ధృవం జన్మ మృతస్య చ ! 
                      తస్మాదపరిహార్యే   ర్దే  న త్వం శోచితుమర్హసి          (2-27)
     శ్రీకృష్ణభగవానుడి లా అన్నారు ఓ అర్జునా ఎందుకు దుఖిస్తున్నావు - నీ శిశుప్రాయం లో శరీరాన్ని గుర్తుతెచ్చుకో, బాల్యం లో  శరీరం, యౌవనం లో, చివరికి వృద్ధాప్యం లో మార్పు చెందుతూనే ఉందికదా. ఆ వెనకటి దేహాలన్నీ ఇప్పుడేమయ్యాయి? లేవు ! మరి నువ్వో ఉన్నావు. నీ ఆత్మ ఉంది.  మరి కొంత కాలానికి ఈ దేహం పోయి మరో దేహం లో నీ ఆత్మ ప్రవేశిస్తుంది.  మరి శిశుప్రాయం నుంచి లేని దుఖం ఇప్పుడెందుకు.  
    ఆత్మకి పుట్టుక, చావు రెండూ లేవు. నిత్యమూ, శాశ్వతము, పురాతనము.   శరీరమునకే చావుకాని ఆత్మ కి లేదు. 
     మనిషి ఎలా అయితే జీర్ణ వస్త్రమును వదిలి, క్రొత్త బట్టలు మారుస్తున్నాడో ఆత్మ పాత శరీరాన్ని వదిలి నూతన శరీరాన్ని పొందుతోంది.  
      ఈ ఆత్మని ఏ ఆయుధాలు ఏమి చేయలేవు, అగ్ని దహించలెదు, నీరు తడుపనూలేదు, వాయువు ఆరిపోవునట్లు చేయలేదు.  
        అలాగే పుట్టినవారికి మరణం తప్పదు, తిరిగి పుట్టకా తప్పదు. 
    అద్భుతంగా చెప్పారు శ్రీకృష్ణభగవానుడు, మరి ఈ విషయం అర్జునిడికి తెలియదా మనకి తెలియదా. మనకి తెలుసని ఆయనకి  తెలియదా. అన్నీ అందరికి తెలిసి మరి ఎందుకు ఇంత, దుఖం తెచ్చుకొంటున్నాము. గాఢమైన దేహాభిమానం. అహం అనేదాన్ని అధిగమించలేకపోవటం వల్ల.  అదే మాయ. మళ్ళా ఆ మాయ కూడా మనకి ఆయన కల్పించిందే. (దైవీ ష్యెషా గుణమయీ మమ మాయా దురత్యయా). ఈ మాయను దాటాలంటే మళ్ళా ఆయన అనుగ్రహం కావలసిందే . ఆ మాయను, ఈ దేహాభిమానాన్ని  ఎలా అధిగమించాలో step by step movement లో శ్రీకృష్ణభగవానుడు గీతలో (18) అధ్యాయాలలో చెప్పారు. 
ముందు దీనికో చిన్న మార్గం చెప్పారు. 
కర్మణ్యేవాధికరస్తే మా ఫలేషు కదాచన 
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగో స్త్వ కర్మణి         (2-47)
    కర్మలు చెయ్యటం వరకే నీ వంతు దాని ఫలితాలు గురించి నీవు ఆలోచించకు. అలా అని కర్మలు మానవద్దు.  do best - leave to God.  ఇదే ఆయన చెప్పింది.  అంటే నువ్వెప్పుడు presentense లోనే ఉండు  - future గురించి past గురించి ఆలోచించకు - live in the present - act in the present.

బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః !
             లిప్యతే న స పాపేన పద్మపత్రమివాం భసా !              (5-10)
   కర్మలనన్నిటినీ భగదర్పణము గావించి, ఆసక్తి రహితముగా కర్మలనాచరించుచున్న ప్రాణికి తామరాకు పై నీటి బిందువులా పాపములు అంటవు. 
     బాగుంది, గతం వద్దు, భవిష్యత్తు వద్దు, చేసే ప్రతీ పనీ భగవంతుడికి అర్పించెయ్యాలి. మరి మన లైఫ్ దేని కోసం అని సందేహం వస్తుంది. ఎప్పుడైతే మనం చేసే ప్రతి పని భగవంతుడికి అర్పింస్తామో, అది తప్పకుండా మంచిపని, ధర్మమైనదే అవుతుంది.  ఎలా అయితే భగవత్ ప్రసాదాన్ని దాని గుణగణాలు పరిశీలించకుండా భక్తిగా స్వీకరిస్తామో, అలాగే మన కర్మ ఫలాల్ని కూడా మంచి చెడ్డలవైపు మనసుపోనీక భగవత్ ప్రసాదం గా స్వీకరిస్తాము.  

   ఈ స్థితి లో కి మనిషి రావాలంటే ఏం కావాలోశ్రీకృష్ణభగవానుడు చాల వివరంగా చక్కగా చెప్పారు అవే "స్థిత ప్రజ్ఞ" లక్షణాలు. (2 అధ్యాయం లో 55 వ. శ్లోకం నుంచి 72 వ. శ్లోకం వరకు)
దుఖేష్వనుద్విగ్నమనాః -------  యదా సంహరతే చాయం --------  విషయా వినివర్తంతే 
తాని సర్వాణి సంయమ్య ------ధ్యాయతో విషయాన్ పుంసః -------క్రోధాద్భవతి సంమోహః 
ఏషా బ్రాహ్మి స్థితి పార్ధ   
     సుఖదుఃఖాలని, శీతోష్ణాలను, మట్టిని, బంగారాన్ని సమంగా చూసేవాడు, రాగ, ద్వేషాలు లేని వాడు, దేనిని ఆపేక్షించని వాడు, దేనిని ద్వేషించని వాడు సర్వభూతముల యందు మైత్రి కరుణ కలవాడు ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు , ఇలాంటి బ్రాహ్మిస్థితి పొందిన యోగి ఎన్నడు మొహితుడు కాదు.   
ఇవండీ భగవంతుడు చెప్పిన క్వాలిటీస్.  ఇందులో మనకి ఎన్నున్నాయో మనకి మనమే టెస్ట్ పెట్టుకోవాలి.  
మరి ఇవన్నీ సాధించటానికి మర్గాలున్నాయా అంటే --- ఉన్నాయి చూద్దాం 
మనం ఒక చిన్న నిచ్చనని తయారు చేసుకోవాలి ఎలా అంటే 
సత్సంగత్వే     నిస్సంగత్వం 
నిస్సంగత్వే     నిర్మోహత్వం 
నిర్మోహత్వే      నిశ్చలతత్వం 
నిశ్చలతత్వే     జీవనముక్తః  
సత్సంగత్వం     - gives  -   నిస్సంగత్వం (detachment) తటస్తం 
 నిస్సంగత్వం - gives -  నిర్మోహత్వం (no delusion)  మాయ, భ్రమ నుంచి బయటపడటం 
 నిర్మోహత్వం = gives -నిశ్చలతత్వం (stillness)  శాంతం, నిశ్చలత్వం 
 నిశ్చలతత్వం - gives - జీవన్ముక్తి  == మోక్షం 
    అర్జునిడికి కొచెం విసుగొచ్చింది, యుద్ధం చెయ్యను అంటే చెయ్యమన్నాడు, ఇప్పుడేమో జ్ఞానం ఉత్తమమైనది అంటాడు. ఓ కృష్ణా, నేను తపస్సు చేసుకొంటాను జ్ఞానాన్ని సంపాదించుకొంటాను నాకీ యుద్ధం వద్దు అన్నాడు.
    అబ్బ మళ్ళా మొదటికి వచ్చాడ్రా బాబు వీడు అనుకొన్నారు  శ్రీకృష్ణభగవానుడు. ఇలా అయితే ఇంకా చాలా చెప్పాలి వీడికి అనుకొన్నారు. 
3. అధ్యాయం - కర్మ యోగం 
లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయానఘ !
జ్ఞాన యోగేన సాంఖ్యానాం కర్మ యోగేన యోగినామ్ !     (3-3) 
మళ్ళా భగవానుడు ఇలా చెప్పారు - ఈ లోకం లో రెండు రకాలైన నిష్టలు పూర్వం ప్రసాదించాను అంటే రెండు దార్లు (ప్రవ్రుత్తి -నిర్వ్రుత్తి) 
1. సాంఖ్యులకు ( అంటే విచారణ శక్తి గలవారికి ) - జ్ఞాన యోగం 
2. యోగులకు (అంటే కర్మ నిష్టాపరులకు - చిత్తశుద్ధి కొరత పడిన వారికి) - నిష్కామకర్మ
     మనం ఏ కోవకి చెందుతాం అనేది మనమే నిర్ణయించుకోవాలి. ఒక గంట ధ్యానంలో కూర్చుంటే, నిముషం సేపు మనసుని నిలపలేము, రాగం, మోహమ్ వెంటాడుతూనే ఉంటాయి.  కోరికలు జ్ఞానాన్ని కప్పేస్తాయి. 
దుమేనావ్రియతే వహ్నిః యధాదర్శో మలేన చ !
               యథోల్బేనావృతో గర్భః తథా తెనేదమావృతం !      (3-38) 
పొగచే అగ్ని, ధూళిచే అద్దము, మావిచే గర్భము ఎలా కనపడవో అలాగే కామం చేత జ్ఞానం కనపడదు.
   అందువల్ల ముందు నిష్కామకర్మ ద్వారా చిత్తశుద్ధిని పొంది, అంటే తనుమనోబుద్దులతో శాస్త్రసమ్మతమైన నిత్య నైమిత్తిక కర్మలను ఫలాపేక్ష లేకుండా కేవలం ఆత్మ (మనస్సు) శుద్ధి కోసం ఆచరించాలి.  మొదట నిష్కామ కర్మలనాచరించి, చిత్తశుద్ధి ద్వార ఆత్మ జిజ్ఞాస కలిగి అప్పుడు జ్ఞాన సాధనాలైన శ్రవణ, మనన, నిధి, ధ్యాసలే సాధన చేసి జ్ఞానం పొంది జీవన్ముక్తుడవుతాడు. 
స్థూలశరీరము కంటే ఇంద్రియములు, ఇంద్రియముల కంటే మనస్సు. మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ సూక్ష్మమైనది.  బుద్ధి ద్వారా మనస్సుని వశపరచుకొని ఆత్మ జ్ఞానం పొందాలి. 
4. అధ్యాయం - జ్ఞాన  యోగం 
ఇమం వివస్వతే యోగం ప్రొక్తవనహమవ్యయం !
                వివస్వాన్ మనవే ప్రాహ మనూరిక్ష్వాకవే బ్రవీత్ !        (4-1) 
       శ్రీకృష్ణభగవానుడిలా అన్నారు - ఈ సనాతనమైన ధర్మాలన్నీ పూర్వం నేను సూర్యునికి చెప్పను, సూర్యుడు తన కొడుకైన మనువునకు, మనువు తన కొడుకైన ఇక్ష్వాకునకు భోదించాడు. 
మళ్ళా మన అర్జునిడికి సందేహం వచ్చింది = నువ్వేమో నాతోనే పుట్టావు, ఎప్పుడో సూర్యుడికి చెప్పాను అంటావేమిటి అని.  పాపం దేముడు దిగొచ్చి చెపితే నమ్మేవాళ్ళు ఎవరు. 
యదాయదా  హి ధర్మస్య గ్లానిర్భవతి భారతా !
                           అభ్యుత్తానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ !           (4-7)
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ !
                       ధర్మసంస్థాపానార్దాయ సంభవామి యుగే యుగే !              (4-8)
ఎప్పుడైతే  ధర్మమునకు హాని కలుగుతుందో, అధర్మము పెరిగి పోతుందో, అప్పుడు సన్మార్గులని రక్షించటానికి, దుర్మార్గులని శిక్షించటానికి నన్ను నేనే సృజించుకొంటూ ఉంటాను.
అంతే కాకుండా ఎవరెవరు తనకిస్టులో , ఎవరెవరిని తానూ ఎలా అనుగ్రహిస్తాడో కూడా చెప్పారు. (10 to 23 శ్లో )
4-10 వీతరాగభయక్రొధా మన్మయా మాముపాశ్రితాః
          4-11 యే యథా మాం  ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం!
4-13 చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః !
4-19 యస్య సర్వేసమారంభాః కమసంకల్పవర్జితాః ! 
రాగం,మొహం,క్రోధం,వదిలి మనస్సు ఎల్ల వేళలా నాయందే  (భగవంతుని)  యందే నిలిపే వారు నన్నే పొందుతారు. భక్తులు ఏ రీతిగా నన్ను సేవిస్తే (కోరికలతో,భయంతో, భాధతో etc. ) అలాగే వార్ని అనుగ్రహిస్తాను.  వారి గుణ, కర్మలని బట్టి నాలుగు వర్ణాలవారిని తానే సృజించానని,  సృష్టికి తానే కర్తనై ఉన్నానని చెప్పారు.  
ఎవడు సమస్త కర్మలు, కోరికలు, సంకల్పము లేకుండా చేస్తాడో వాడే పండితుడు, జ్ఞాని అని చెప్పారు.
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రాహ్మణా హుతమ్ !
           బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా !                 (4-24)

బ్రహ్మ అంటే ప్రజ్ఞానం (పరబ్రహ్మమ్ ) అర్పణం కూడా బ్రహ్మే   అంటే అర్పించేవి అన్నీ అవి ఏవైనా కాని అన్నము, నేయి వగైరా బ్రహ్మమే. నిష్ఠ తో చేసే వాడు కూడా బ్రహ్మమే, చేసే యజ్ఞ ఫలం కూడా బ్రహ్మమే. ఈ ప్రకారం సమస్తం బ్రహ్మమే యను నిశ్చయంతో కర్మ చేయువాడు బ్రహ్మమే అవుతాడు. మనిషి నిరంతరమూ దేనినిగూర్చి చింతించునో ఆ స్వరూపమే తానవుతాడు. అంటే ఏ కర్మ చేసినా ఏకాగ్రచిత్తంతో, భగవద్ భావనతో చేస్తే, ఆకర్మ, కర్మగా నుండక ద్యానరూపముగను, సమాధి రూపముగను మారిపోవును.
ఒక్కసారి యుద్దరంగంలో నించోపెట్టి శ్రీకృష్ణుడు చెప్పేస్తే జ్ఞానం వచేస్తుందా. అందుకే మళ్ళా భగవానుడే చెప్పారు, నీకు వీలున్నప్పుడల్లా తత్వ దర్సనులైన జ్ఞానుల దగ్గర శుశ్రూష చేసి జ్ఞానం సంపాదించమన్నారు.
తద్విద్ధి ప్రణిపాతేన   పరిప్రస్నేన సేవాయా 
               ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః !    (4-34)

5. అధ్యాయం - కర్మ సన్యాస యోగం
సరేనయ్యా పండితులని దర్శించమన్నావు, పండితులని ఎలా గుర్తించాలి , కాషాయాలు, గడ్డాలు ఉంటే చాలా, అంటే మళ్ళా శ్రీక్రిష్ణపరబ్రహ్మ - రాసుకోవయ్య బాబు లక్షణాలు చెపుతాను అన్నాడు.
విద్యావినయసంపన్నే బ్రాహ్మణే  గని హస్తిని !
                 శుని చైవ శ్వపాకే చ పండితా సమదర్శినః !           (5-18)
జ్ఞాననిస్టులు, పండితులు సమస్తమును అంటే ఈ దృశ్యమాన ప్రపంచం అంతా ఒకటిగానే చూస్తారు.  అంటే గోవు నందు, ఏనుగు నందు, కుక్క నందు, కుక్కమాంసం తినే చండాలుని యందు, సమదృష్టి  కలిగి ఉందురు.  ఒందరిని ఒకే భావం తో ఆత్మ రూపునిగా, బ్రహ్మముగా చూచును.  
ఎందుకొచ్చిన ఈ కాషాయవేషధారులు చెప్పండి, ఎవరు ఎలాంటి వారో నిర్ణయించుకొనే తెలివి మనకుంటే సరే, లేకపోతే సమస్తం నేనే చూసుకుంటాను అన్న పరమాత్మ పాదాలు పట్టుకొంటే సరిపోతుందికదా. మరి ఎలా పట్టుకొంటాము భగవంతుణ్ణి,


భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్ !
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిముచ్చతి !         (5-29)
అతడు సమస్త యజ్ఞములయొక్క, తపస్సుల యొక్క ఫలముననుభవించువాడు. యజ్ఞం అంటే మనం చేసే ప్రతిపనీ ఒక యజ్ఞం, జపయజ్ఞం, సంకీర్తనాయజ్ఞం, ధాతృత్వం , సత్యవాక్ పాలన etc., సమస్త ప్రాణికోటికి ఆప్త మిత్రుడు, అందరికి మేలు చేయటానికే కంకణం కట్టుకున్నవాడు. అతనికి కావలసింది మన భక్తి  మాత్రమే.  అది తెలుసుకొంటే ప్రతి హృదయం శాంతితో నిండిపోతుంది.  

6. అధ్యాయం - ఆత్మసంయమ యోగం
ఇంత వరకు జ్ఞానులు, గురువులు, భగవంతుడి గురించి చెప్పిన పరమాత్మ ఇప్పుడు నిన్ను నువ్వే ఉద్దరించుకో అంటున్నారు.


ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మన మవసాదయేత్ !
                ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః !          (6-5)
ప్రతి మనుషుడు తననుతానే ఉద్దరించు కోవాలి,   గురువులు, శాస్త్రము, దైవము దారి చూపుతారు కాని నడవవలసింది.  నువ్వే కాబట్టి,  ఎవర్ని వారే ఉద్ధరించుకోవాలి.  ఆత్మ జ్ఞానం ఎవరికీ వారే  సాధించుకొవాలి. ( 11 శ్లో. నుంచి 19 శ్లో. వరకు)
6-11  శుచౌదేసే ప్రతిష్టాప్య    6-12 తతైకాగ్రం మనః కృత్వా    6-13  సమం కాయశిరోగ్రీవం 
6-17 యుక్తాహారవిహారస్య   6-19  యధా దీపో నివాతస్థొ
      ఇక్కడ పరమాత్మ ధ్యానం గురించి, ధ్యానం పద్దతుల గురించి వివరించారు.  అలాగే ఆహార నియమాలు కూడా పాటించాలి అని చెప్పారు,  అలాగే గాలి లేని చోట దీపం ఎలా నిశ్చలంగా ఉంటుందో అలా ధ్యానం చేసేవాళ్ళ మనస్సు ఉండాలి అనిచెప్పారు.

అర్జునిడికి మళ్ళా సందేహం వచ్చింది - బాగుందయ్యా కృష్ణయ్యా, మనస్సు నిలబెట్టమంటావు - ఇది అసలు మాట వినదు కదయ్యా ఎలా నిలబెట్టాలి - చుడండి ఎలా అడుగుతున్నాడో - ఎటువంటి విద్యార్ధి నైనా ఉత్తీర్ణుణ్ని చేయ్యలనుకొనే గురువుకి భోదించటం ఎంత కష్టమో మనకి కృష్ణుడిని చూస్తే అర్ధం అవుతుంది.
యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరమ్ !
                   తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్ !          (6-26) 
అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం !
                  అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ  చ గృహ్యతే !             (6-35)
సహజముగా నిలకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయములందు విశృంఖలముగా పరిభ్రమించు చుండును.  అట్టి మనస్సును ఆయా విషయముల నుండి పదే పదే మరల్చి, దానిని పరమాత్మయందే స్థిరముగా నిల్పవలెను.  ఆత్మయందు మనస్సును లయం చేయటానికి చేసే ప్రయత్నమే సమాధి యోగం అదే నిర్వికల్ప సమాధి.  
ఒకటి అభ్యాసము రెండు వైరాగ్యము ఈ రెండింటి వల్ల ఇది సాధ్యపడుతుంది.
సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని !
                   ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శినః  !              ((6-29)
యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి !
                     తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి !              (6-30)
                 సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః                  (6-31)
                     ఆత్మౌపమ్యెవ సర్వత్ర సమం పశ్యతి యోర్జున                (6-32)
సర్వవ్యాప్తమైన అనంత చైతన్యం లో నేను ఆత్మ రూపుడునై అన్నిటి యందు ఉన్నాను. అది తెలుసుకొని సమస్త ప్రాణులలొను నన్ను చూసేవాడికి, నాలో సమస్త ప్రాణులని చూడగాలిగేవాడికి నేనెప్పుడు కనిపిస్తూనే ఉంటాను. అలాగే అతన్ని నేనెప్పుడు చూస్తూనే ఉంటాను. అలాంటి యోగి సర్వ కార్యములలో ప్రవర్తించుచున్నా, నాయందే ప్రవర్తించుచుంటాడు.  
7. వ అధ్యాయం - జ్ఞానవిజ్ఞాన యోగం  
అందుకే ప్రతి ఒక్కరు భగవంతుని దర్శనం కోసం ఎదురు చూసినా యుగానికి ఏ ఒక్కరో ఆయన్ని కనుక్కొగలుగుతున్నారు.  
మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే !
                   యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః !       (7-3) 
వేలకొద్దీ మందిలో ఏ ఒక్కరో నన్ను తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తారు.  వారిలో ఏ ఒక్కడికో నా తత్త్వం అర్ధం అవుతుంది.  మామిడిపూత చెట్టంతా వస్తుంది, చాలా రాలిపోయి, కొన్నే పిందెలు అవుతాయి, అందులో చాలపిందెలు రాలిపోయి కాయలయ్యేవి కొన్నే.

భుమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ !
              అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టథా !            (7-4)
అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ !
             జీవభూతాం మహబాహొ యయేదం ధార్యతె జగత్ !   (7-5) 
ఈ లోకం లో రెండు రకాలైన ప్రకృతిలు ఉన్నాయి. కనిపించేవి అన్నీ "అపరములు" "జడము" వెనకాతలుండి నడిపించేది "పరము" ఈ  రెండూ నాలోనే ఉన్నాయి.  
ఈ "అపరా" ప్రకృతి (8) మడతలుగా --- 1. ఆకాసము  2. వాయువు  3. అగ్ని 4. ఆపః (నీరు)  5. పృథ్వి  6. మనస్సు  7. బుద్ధి  8. అహంకారం  వ్యావహారిక సత్యం అయిన ఈ ప్రకృతి లో మనస్సు, బుద్ధి కూడా "జడమే" 
ఈ పైన చెప్పిన పంచభూతాలని - పంచజ్ఞానేంద్రియాల తో మనం అనుభవిస్తున్నాం 
1. ఆకాశము     --       శబ్దం   ( ఆత్మ )
2. వాయువు     --       స్పర్శ 
3. అగ్ని             --       రూపం (చూడగలుగుతాం)
4. ఆపః (నీరు)    --       రస     (రుచి)
5. పృథ్వి(భూమి) --       గంధః (వాసన) 
దీనికంటే భిన్నమైన ఉన్నతమైన మనం చూడలేని అనుభవించలేని ప్రకృతి ఉంది అదే "పరా" ప్రకృతి.  అదే బ్రహ్మం, అదే ఈ విశ్వాన్ని నడిపించేది, విశ్వం అంతటా వ్యాపించింది.  
ఎలా వ్యాపించి ఉంది పరా ప్రకృతి  అంటే భగవానుడు ఒక example  ఇచ్చారు. 
మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ !
          మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ !   (7-7)  
ఏదీ నా నుంచి వేరు కాదు, అన్నీ అంతటా నేనే వ్యాపించి ఉన్నాను, ఈ విశ్వం లోని సమస్త వస్తువులు ధారమందు మణులు కూర్చబడినట్లు అంతా నా యందే కూర్చబడ్డాయి.
  దైవీ ష్యెషా గుణమయీ మామ మయా దురత్యయా   (7-14)
అధిగమించటానికి వీలు కాని ఆయన మాయ లోనే జీవులందరూ ఉన్నారు -- కేవలం ఆయన భక్తులు మాత్రమే దీనినుంచి తప్పించుకోగలరు. 
ఈ భక్తుల్లో కూడా (4) రకలైనవారు ఉన్నారు 
ఆర్తో జిజ్ఞాసురర్ధార్ధీ   జ్ఞానీ  చ భరతర్షభ !         (7-16)

ఆర్తుడు - గజేంద్రుడు, ద్రౌపది 2. అర్దార్ది -- ధృవుడు  3. జిజ్ఞాసువు -- ఉద్ధవుడు 
4. జ్ఞాని  == ప్రహ్లాదుడు, కుచేలుడు 

8. అధ్యాయం - అక్షరబ్రహ్మ యోగం
అక్షరమంటే నాశనము లేనిది అనిఅర్ధం. నాశనరహితమైనది బ్రహమే. అంటే మోక్షమే. దాన్ని పొందటాని చేసే సాధనలో మార్గాలే ఇందులో చెప్పారు. 
కవిం పురాణమనుశాసితారమ్      (8-9)
ప్రయాణకాలే మనసాచలేన             (810)
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యహరాన్ మామనుస్మరన్ !
          యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం  గతిమ్ !   (8-13) 
    మాముప్యేత పునర్జన్మ దుఃఖాలయమశాస్వతమ్       (8-15)
    ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున                   (8-16)
 సర్వేంద్రియములు నిగ్రహించి మనస్సును హృదయమునందే స్తిరముగా నిలిపి ప్రాణములను సహస్రారమందు స్థిరమొనర్చి పరమాత్మ ద్యానము నందే నిమగ్నుడై అక్షర బ్రహ్మ స్వరూపుడైన "ఓం కారమును " ఉచ్చరించుచు దేహత్యాగ మొనర్చువాడు పరమగతిని (మోక్షమును ) పొందును.  
అంతేకాదు మర్త్య లోకం నుంచి బ్రహ్మగారి లోకం (చతుర్ముఖ బ్రహ్మ) వరకు అన్నీ నశించేవే, ఏ లోకం వరకు వెళ్ళినా మళ్లీ కర్మశేషం తో భూమిమీద పుట్టవలసిందే.  అదే నన్ను పొందితే పునర్జన్మ లేదని హామీ ఇస్తున్నాను అన్నారు పరమాత్మ. 

9. అధ్యాయం -- రాజవిద్యారాజగుహ్య యోగం 
పరమాత్మ మళ్ళా చెపుతున్నాను అన్నారు  అర్జునిడితో  =మళ్ళా ఎందుకన్నారు - అప్పటికే చాలా జ్ఞానం వచ్చేసినట్లు feel అవుతున్నాడు అర్జునుడు - బాబు నీకు సగమే చెప్పాను ఇంకా చాల ఉంది విను అని చెప్పటానికి . 
మయా తతమిదం సర్వం జగదవ్యక్తముర్తినా !
             మత్ స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః !      (9-4)
న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్ !
           భూతభ్రున్న చ భూతస్థొ మమాత్మ భూతభావనః !   (9-10) 
మొదటి శ్లోకం లో పరమాత్మ అంతటా నేనే ఉన్నాను, నేను లేని ప్లేస్ లేనేలేదు అనిచెప్పారు . రెండో శ్లోకం లో నేను దేనియందు లేను అనిచెప్పారు.  ఇదెలా గంటే 
ఉదాహరణకి -- ఒక ఉంగరం, ఒక గాజు, వడ్డాణం  ఇలా బంగారు వస్తువులు ఉన్నాయి అనుకొందాం, అన్నీ బంగారమే, అన్ని వస్తువులలోను బంగారం ఉంటుంది, కాని బంగారం లో ఏ వస్తువూ ఉండదు = అది శుద్ధం - పూర్ణం = అదే విధంగా ప్రాణులలో(ఉపాధిలో)  భగవదంశ ఉంటుంది - భగవంతుడిలో ఉపాధులు ఉండవు. అది శుద్ధ చైతన్యం మాత్రమే.   

మరి ఇలాంటి భగవంతుణ్ణి చేరుకొనే మార్గాలేమిటి - అదీ ఆయనే చెప్పారు 
అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే ! 
            తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ !    (9-22)
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి !
                  తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః !           (9-26)
యత్కరోషి యదశ్నాసి యజ్జుహొషి దదాసి యత్ !
                 యత్తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం !           (9-27)
    అనన్య భక్తితో, నిష్కామ భావముతో నన్ను సేవించేవారి యోగ క్షేమములను నేనే చూసుకొంటాను. యోగం  అంటే లభించనివి లభించటం - క్షేమము అంటే లభించిన వాటి రక్షణ. 
     అంత భక్తి కష్టం time ఉండదు, బోల్డు పనులు అంటారా - పోనీ ఆయన మనకోసం ఈ ప్రపంచాన్ని రంగు రంగు ల పూలతో, పళ్ళతో, జలాలతో నింపేశారు కదా, అందుకు కృతజ్ఞతగా ఓ కృష్ణా ఇవిగో నువ్విచ్చిన ఫలాలు, జలాలు నీకే సమర్పిస్తున్నాను అని నిశ్చల మనస్సుతో ఒక్క ఆకు అయినా ప్రతి రోజు ఆయనకి సమర్పిస్తే, అదే స్వీకరించి మనల్ని అనుగ్రహిస్తానని చెప్పారు . 
     అబ్బో ఇదీ కష్టమే - రోజు ఆకు ఎక్కడ వెతుకొంటాము అసలే appartment అనుకొంటే 
సరే ఏం వద్దు = నువ్వేం తిన్నా, ఏం  త్రాగినా, ఏ పనిచేసినా "కృష్ణార్పణం " అనుకోమన్నారు.  అప్పుడు కూడా నేను నీ వెనకే ఉండి నీ యోగ క్షేమములు చూసుకొంటాను అన్నారు. 
      ఎన్ని considerations ఇచ్చారో చూడండి , అదే భగవంతుడి ప్రేమ - బిడ్డలు ఎలాగైనా బాగుపదాలనేదే ఆయన తాపత్రయం.  
10. అధ్యాయం -- విభూతి యోగం 
మళ్ళా చెయ్యెత్తి నుంచున్నాడు అర్జునుడు doubt అన్నమాట -- అన్నీ నావే అంటున్నావు, అంతా నాదే అంటున్నావు - ఎంతుందేమిటి నీ ఆస్థి కాస్త declare చెయ్యి -- అదీ కాకుండా అంతా నీదే అయి, నువ్వే పరమాత్మవి మంచివాడివి అయినప్పుడు మరి ప్రపంచంలో మంచి చెడ్డలు ఎందుకున్నాయి. 
అప్పుడు శ్రీకృష్ణభగవానుడు తన విభూతుల్ని అంటే సంపదలని చెప్పటం మొదలు పెట్టారు. ఏ వస్తువు తన సృష్టి లో చెడ్డది లేదని, అన్నీ గొప్పవి, మంగళకరమైనవి అని అన్నింట్లో తాను ఉంటానని చెప్పారు. 
వనాలలో - హరితవర్ణంగా,   గిరులలో -- ఉన్నతత్వంగా (గిరిశిఖరం),  జలాల్లో -- చంచలత్వంగా,  సాగరంలో -- గంభీరంగా -- సేవతత్వంలో -- సేవకుడుగా, ప్రేమతత్వంలో - ప్రేమికుడుగా, స్వాంతనములో --కరుణామయుడుగా విశ్వం అంతా ఆనందో బ్రహ్మగా.  

అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః !           (10-20)
 ఆదిత్యానామహం విష్ణుః                                        (10-21)
 వేదానాం సామవేదోస్మి                                           (10-22)
అక్షరాణామకారోస్మి                                                 (10-33)
మాసానాం మార్గశీర్షోహమ్                                         (10-35)
వృష్టీనామ్ వాసుదేవోస్మి పాణ్ణవానాం  ధనంజయః        (10-37)
యద్యద్విభూతిమత్ సత్వం శ్రీమదూర్జితమేవ వా         (10-41)

ఓ అర్జునా ! సమస్త జీవులా ఆత్మను నేను. సృష్టి,స్తితి,లయలకు కారణం నేను.  జ్యోతిర్మయ స్వరూపులలో నేను సూర్యుణ్ణి, వాయులో "తేజాన్ని" నక్షత్రాలలో చంద్రుడను, వేదాలలో సామవేదాన్ని, ఇంద్రియములలో మనస్సుని, అక్షరాలలో "అ" కారాన్ని మాసాల్లో మార్గశిర మాసాన్ని, యాదవుల్లో శ్రీకృష్ణుడను, పాండవులలో అర్జునడను    ..... విభూతి యుక్తము అనగా ఐశ్వర్యము, కాంతి, శక్తి యుక్తమైన దేదైనా నా తెజస్సుయొక్క అంశము నుండియే కలిగినదిగా తెలుసుకో   .......... నా దివ్య విభూతులకు అంతమే లేదు నీకు చాల సంక్షిప్తముగా వివరించాను అన్నారు.
ఇది తెలుసుకోవాలంటే
తేషాం సతతయుక్తానాం భజతాం ప్రితిపూర్వకం !
          దదామి బుద్ధియోగం తం యేవ మాముపయాంతితే !    (10-10)
నా యందే స్థిర మనస్సుతో భక్తిశ్రద్ధ లతో ఉన్నవారికి నేను బుద్దియోగామును ప్రసాదిస్తాను, వారు దాని ద్వారా నన్నే పొందుదురు.
అధవా బహునైతేవ కిం జ్ఞాతేన తవార్జున !
విష్టభ్యాహమిదం కృత్స్నమ్ ఏకాంశేన స్థితో జగత్ !         (10-42)
ఓ అర్జునా ! ఇంతకంటే ఏం వివరంగా చెప్పను -- ఈ సమస్త జగత్తు కేవలం నా యోగ శక్తి అంశం తోనే ప్రవర్తిల్లుతోంది .

11. అధ్యాయం - విశ్వరూపదర్శన యోగం
ఎంత విన్నా ఎంత చదివినా మానవుడి బుద్ధి చాంచల్యం అంత తొందరగా దేన్నీ వప్పుకోదు. అర్జునిడికి లోపల్లోపల నిజంగా కృష్ణుడంతటి గొప్పవాడా అనే సందేహం ఉంది.  ఇన్ని విభూతులు నీలో ఉన్నాయని చెపుతున్నావు ఆ దివ్య రూపం నాకు చూపిస్తావా అనిఅడిగాడు.  proof కావాలన్నమాట.
ఎంత తిక్క student  కైనా పాఠం చెప్పే  సమర్ధుడు మన కృష్ణుడు, వీడి తిక్క కుదరాలంటే విశ్వరూపం చూపించాలిశిందే అనుకొన్నాడు .
పశ్య మే పార్ధ రూపాణి శతశోథ  సహస్రశః !
              నానావిధాని దివ్యాని నానావర్ణాక్రుతీని చ !     (11-5)
ఓ అర్జునా,  చూడు నా అలౌకిక రూపాన్ని, ఇంతకముందు చూచి ఎరుగని అపూర్వమైన రూపాన్ని, ఈ రూపం లో ఒకేచోట స్థితమై యున్న సమస్త చరాచరా జగత్తును చూడు. కానీ నీవు ఈ నేత్రాలతో చూడలేవు, నీకు దివ్య చక్షువులని ప్రసాదిస్తాను వాటితో చూడు.  

పశ్యామి దేవాంస్తవదేవ దేహే 
సర్వాంస్తథా భూతవిశేషసంఘాన్ 
బ్రహ్మాణమీశం కమలాసనస్థమ్ 
                     ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ !     (11-15)

అనేక బహూదర వక్త్ర నేత్రమ్
పశ్యామి త్వాం సర్వతో నంత రూపమ్
నాంతం  న మధ్యం న పున స్తవాదిమ్
                           పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప !         (15-16)

దంష్ట్రాకరాలాని చ తే ముఖాని
దృష్ట్వైవ కాలానల సంన్నిభాని
ది శో న జానే న లభే చ శర్మ
                        ప్రసీద దేవేశ జగన్నివాస !              (15-25)
     వేలాది సూర్యులు ఆకాశం లో ఒక్కసారిగా వచ్చినట్లు, ఆదిమద్యాంతరములు లేని తేజోమూర్తి విశ్వమంతా వ్యాపించి, అనేఖ ముఖములు, చేతులు, నేత్రాములూ ధరించి, దిక్కులన్నీ వ్యాపించి, కోరలచే భయంకరముగా నోరు తెరువబడి, ప్రళయాగ్నిని బోలిన ముఖంతో సమస్త సేనలు, కౌరవులు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అందరు ఆ కోరాలకి చిక్కి చూర్ణమై పోతున్నారు.

      ఈ భయానక దృశ్యం చూసిన అర్జునుడు భయంతో వణికిపోయి, ఈ రూపం నేను చూడలేకపోతున్నాను, నీకు శతకోటి వందనాలు